
Mayank Agarwal: రంజీ ట్రోఫీ 2022-23 సీజన్‌లో భాగంగా సౌరాష్ట్రతో ఇవాళ (ఫిబ్రవరి 8) మొదలైన రెండో సెమీఫైనల్ మ్యాచ్‌లో కర్ణాటక కెప్టెన్ మయాంక్ అగర్వాల్ అజేయ శతకంతో కదం తొక్కాడు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన కర్ణాటక.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. మయాంక్‌తో పాటు వికెట్ కీపర్ శ్రీనివాస్ శరత్ (58) అజేయ అర్ధసెంచరీతో క్రీజ్‌లో ఉన్నాడు. సౌరాష్ట్ర బౌలర్లలో కుశాంగ్ పటేల్ 2 వికెట్లు పడగొట్టగా.. చేతన్ సకారియా, ప్రేరక్ మన్కడ్ తలో వికెట్ దక్కించుకున్నారు. గత మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిప శ్రేయస్ గోపాల్ (15) రనౌటయ్యాడు.
సెంచరీతో ఆదుకున్న మయాంక్..
ఈ మ్యాచ్‌లో మయాంక్ చేసిన సెంచరీ చాలా కీలకమైంది. 112 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో ఉండగా మయాంక్ కెప్టెన్స్ ఇన్నింగ్స్ ఆడాడు. శ్రీనివాస్ శరత్‌తో కలిసి మయాంక్ ఆరో వికెట్‌కు అజేయమైన 117 పరుగులు సమకూర్చాడు. ఈ ఇన్నింగ్స్‌లో 246 బంతులు ఆడిన మయాంక్ 11 ఫోర్లు, సిక్సర్ సాయంతో 110 పరుగులు చేశాడు. సెంచరీ చేసేందుకు మయాంక్ ఇన్ని బంతులు ఆడటం బహుశా ఇదే మొదటిసారి అయ్యుండొచ్చు.
మరోవైపు ఇవాలే మొదలైన తొలి సెమీఫైనల్ మ్యాచ్‌లో మధ్యప్రదేశ్, బెంగాల్ జట్లు తలపడ్డాయి. తొలి రోజు ఆటలో బెంగాల్ పైచేయి సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న బెంగాల్.. సుదీప్ కుమార్ ఘరామీ (112), అనుస్తుప్ మజుందార్ (120) శతకాలతో విరుచుకుపడటంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 307 పరుగులు చేసింది.
ఓపెనర్లు అభిమన్యు ఈశ్వరన్ (27), కరణ్ లాల్ (23)లకు మంచి శుభారంభాలు లభించినప్పటికీ వాటిని భారీ స్కోర్లుగా మలచడంలో విఫలమయ్యారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి కెప్టెన్ మనోజ్ తివారి (5), షాబజ్ అహ్మద్ (6) క్రీజ్‌లో ఉన్నారు. మధ్యప్రదేశ్ బౌలర్లలో అనుభవ్ అగర్వాల్ 2 వికెట్లు పడగొట్టగా.. ఆవేశ్ ఖాన్, గౌరవ్ యాదవ్‌కు చెరో వికెట్ దక్కింది.
Comments
Please login to add a commentAdd a comment