
ఉత్తరాఖండ్‌ను చిత్తు చేసిన కర్ణాటక(PC: PTI)
Karnataka won by an innings and 281 runs: రంజీ ట్రోఫీ 2022-23 సీజన్‌లో కర్ణాటక సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. క్వార్టర్స్‌లో ఉత్తరాఖండ్‌ను ఇన్నింగ్స్ మీద 281 పరుగులతో చిత్తు చేసి సెమీస్‌లో అడుగుపెట్టింది. సెంచరీ హీరో శ్రేయస్ గోపాల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.
మయాంక్ నమ్మకాన్ని నిలబెట్టి
బెంగళూరు వేదికగా ఉత్తరాఖండ్‌తో జనవరి 31న మొదలైన క్వార్టర్ ఫైనల్-3లో టాస్ గెలిచిన కర్ణాటక తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కెప్టెన్ మయాంక్ అగర్వాల్ నమ్మకాన్ని నిలబెడుతూ.. కర్ణాటక బౌలర్లు సొంతమైదానంలో ఆకాశమే హద్దుగా చెలరేగారు.
రైట్ ఆర్మ్ పేసర్, 22 ఏళ్లమురళీధర వెంకటేశ్ ఐదు వికెట్లతో ఉత్తరాఖండ్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించగా.. విద్వత్ కవెరప్ప, క్రిష్ణప్ప గౌతమ్ రెండేసి వికెట్లు తీశారు. విజయ్ కుమార్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో 116 పరుగులకే ఉత్తరాఖండ్ తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌట్ అయింది.
రెచ్చిపోయిన కర్ణాటక బ్యాటర్లు.. బౌలర్లకు చుక్కలే
ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన కర్ణాటక బ్యాటర్లు ఉత్తరాఖండ్ బౌలర్లకు పగలే చుక్కలు చూపించారు. ఓపెనర్లు సమర్థ్(82), మయాంక్ అగర్వాల్(83) అర్థ శతకాలతో చెలరేగగా.. వన్‌డౌన్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ 69 పరుగులతో రాణించాడు.
శ్రేయస్ గోపాల్ అద్భుత సెంచరీ
నాలుగో స్థానంలో వచ్చిన నికిన్ జోస్ 62 రన్స్ సాధించగా.. మనీశ్ పాండే 39 పరుగులతో ఫర్వాలేదనపించాడు. అయితే, ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన శ్రేయస్ గోపాల్ బ్యాట్ ఝలిపించడంతో కర్ణాటక భారీ స్కోరు చేయగలిగింది.
మొత్తంగా 288 బంతులు ఎదుర్కొన్న శ్రేయస్ 16 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 161 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. మిగతా వాళ్లలో శరత్ 33, గౌతం 39, వెంకటేశ్ 15 పరుగులు చేశారు. ఈ క్రమంలో కర్ణాటక 606 పరుగులకు ఆలౌట్ అయింది.
సెమీస్‌లో అడుగు
ఇక లక్ష్య ఛేదనకు దిగిన ఉత్తరాఖండ్ కథ 209 పరుగులకే ముగిసింది. దీంతో శుక్రవారం నాటి(ఫిబ్రవరి 3) ఆఖరి రోజు ఆటలో కర్ణాటక జయకేతనం ఎగురవేసింది. ఇప్పటి వరకు ఎనిమిది సార్లు చాంపియన్‌గా నిలిచిన కన్నడ జట్టు తాజా సీజన్‌లో సెమీస్‌కు చేరుకుంది.
చదవండి: Ranji Trophy 2022-23: విహారి ఒంటి చేతి పోరాటం వృధా.. క్వార్టర్స్‌లో ఓటమిపాలైన ఆంధ్ర
BGT 2023: ఆస్ట్రేలియా మాస్టర్ ప్లాన్.. మన ‘అశ్విన్ డూప్లికేట్’తో కలిసి ప్రాక్టీసు! ఇంతకీ ఎవరీ కుర్రాడు?