రంజీ ట్రోఫీ-2024లో హైదరాబాద్ క్రికెట్ జట్టు వరుసగా రెండో విజయం నమోదు చేసింది. మేఘాలయను ఏకంగా ఇన్నింగ్స్ 81 పరుగుల తేడాతో చిత్తు చేసింది. రెండురోజుల్లోనే మ్యాచ్ ముగించి సత్తా చాటింది.
రంజీ ట్రోఫీ ‘ప్లేట్’ గ్రూప్‌లో భాగంగా మేఘాలయాతో శుక్రవారం మొదలైన మ్యాచ్‌లో.. టాస్ గెలిచిన హైదరాబాద్ తొలుత బౌలింగ్ చేసింది. మేఘాలయను తొలి ఇన్నింగ్స్‌లో 33.1 ఓవర్లలో 111 పరుగులకే ఆలౌట్ చేసింది.
మేఘాలయ బ్యాటర్లలో కెప్టెన్ కిషన్ లింగ్డో (51) మినహా అంతా విఫలమయ్యారు. ఇక హైదరాబాద్ బౌలర్లలో పాలకోడేటి సాకేత్ సాయిరామ్ (4/33) నాలుగు వికెట్లు పడగొట్టగా... సీవీ మిలింద్, తనయ్ త్యాగరాజన్, రవితేజ తలా 2 వికెట్లు తీశారు.
అనంతరం బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ ఆట ముగిసే సమయానికి 47 ఓవర్లలో 4 వికెట్లకు 182 పరుగులు సాధించింది. ఫలితంగా 71 పరుగుల ఆధిక్యం లభించింది. ఈ క్రమంలో 182/4 ఓవర్‌నైట్ స్కోరుతో శనివారం ఆట మొదలుపెట్టిన హైదరాబాద్ ఏడు వికెట్ల నష్టానికి 346 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.
రోహిత్ రాయుడు 124 పరుగులతో అజేయంగా నిలవగా.. చందన్ సహానీ అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. సీవీ మిలింద్ 38 బంతుల్లోనే 50 పరుగులతో నాటౌట్‌గా నిలిచి సత్తా చాటాడు. ఈ నేపథ్యంలో మళ్లీ బ్యాటింగ్‌కు దిగిన మేఘాలయను 154 పరుగులకు కట్టడి చేసిన హైదరాబాద్ జయభేరి మోగించింది.
కాగా ఈ సీజన్ ఆరంభ మ్యాచ్‌లో హైదరాబాద్ నాగాలాండ్‌ను ఇన్నింగ్స్ 194 పరుగుల తేడాతో ఓడించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌కు తిలక్ వర్మ కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే, అఫ్గనిస్తాన్‌తో టీ20 సిరీస్ నేపథ్యంలో అతడు జట్టును వీడగా.. రాహుల్‌సింగ్ గహ్లోత్ సారథ్య బాధ్యతలు స్వీకరించాడు.
Comments
Please login to add a commentAdd a comment