టీమిండియా స్టార్ క్రికెటర్, పంజాబ్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్(Shubman Gill) ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చాడు. రంజీ మ్యాచ్‌లో శతకంతో చెలరేగి తనను తాను నిరూపించుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)లో గిల్ విఫలమైన సంగతి తెలిసిందే.
వరుస వైఫల్యాలు
గాయం కారణంగా పెర్త్‌లో జరిగిన తొలి టెస్టుకు దూరమైన ఈ పంజాబీ బ్యాటర్.. రెండో టెస్టు నుంచి అందుబాటులోకి వచ్చినా పెద్దగా రాణించలేకపోయాడు. అడిలైడ్‌లో జరిగిన ఈ పింక్ బాల్ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లో కలిపి 59(31, 28) పరుగులు చేశాడు. అయితే, గబ్బాలో జరిగిన మూడో టెస్టులో గిల్ తీవ్రంగా నిరాశపరిచాడు.
కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. అయితే, నాలుగో టెస్టు జట్టులో మాత్రం అతడికి చోటు దక్కలేదు. దీంతో బాక్సింగ్ డే టెస్టుకు దూరమైన గిల్.. ఆ తర్వాత సిడ్నీ టెస్టు ఆడినా అందులోనూ విఫలమయ్యాడు. రెండు ఇన్నింగ్స్‌లో వరుసగా 20, 13 పరుగులు సాధించాడు.
రంజీ బరిలో పంజాబ్ సారథిగా
కాగా కంగారూ గడ్డపై ఐదు టెస్టుల సిరీస్‌లో ఓవరాల్‌గా 93 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ నేపథ్యంలో శుబ్‌మన్ గిల్ ఆట తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో బోర్డు నిబంధనలకు అనుగుణంగా రంజీ ట్రోఫీ బరిలో దిగాడు. తాజా ఎడిషన్ రెండో దశ పోటీల్లో భాగంగా కర్ణాటకతో మ్యాచ్ సందర్భంగా ఈ పంజాబ్ ఓపెనర్ రంగంలోకి దిగాడు.
మొదటి ప్రయత్నంలో విఫలం
అయితే, మొదటి ప్రయత్నంలో గిల్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. తొలి ఇన్నింగ్స్‌లో ఎనిమిది బంతులు ఎదుర్కొని కేవలం నాలుగు పరుగులే చేసి.. అవుటయ్యాడు. కర్ణాటక పేసర్ అభిలాష్ శెట్టి బౌలింగ్‌లో క్రిష్ణన్ శ్రీజిత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. గిల్‌తో పాటు పంజాబ్ మిగతా బ్యాటర్లు కూడా దారుణంగా విఫలం కావడంతో తొలి ఇన్నింగ్స్‌లో 55 పరుగులకే ఆలౌట్ అయింది.
స్మరణ్ డబుల్ సెంచరీ
ఈ క్రమంలో కర్ణాటక స్టార్ రవిచంద్రన్ స్మరణ్ (277 బంతుల్లో 203; 25 ఫోర్లు, 3 సిక్స్‌లు) డబుల్ సెంచరీతో విజృంభించగా.. జట్టు భారీ స్కోరు సాధించింది. మొదటి ఇన్నింగ్స్‌లో ఏకంగా 475 పరుగులు చేసింది.
మయాంక్ అగర్వాల్ (20), దేవదత్ పడిక్కల్ (27) ఎక్కువసేపు నిలవలేకపోయిన చోట స్మరణ్ చక్కటి ఇన్నింగ్స్‌తో జట్టుకు భారీ స్కోరు అందించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 55 పరుగులకు ఆలౌటైన పంజాబ్... శుక్రవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 24 పరుగులు చేసింది. ప్రభ్‌సిమ్రన్ సింగ్ (1), అన్‌మోల్‌ప్రీత్ సింగ్ (14) అవుట్ అయ్యారు.
గిల్ సూపర్ ఇన్నింగ్స్.. కానీ
ఈ నేపథ్యంలో ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్న శుబ్‌మన్ గిల్ మూడో రోజు ఆటలో భాగంగా సెంచరీతో చెలరేగాడు. చిన్నస్వామి స్టేడియంలో శనివారం 159 బంతుల్లో వంద పరుగుల మార్కు అందుకున్నాడు. అతడి ఇన్నింగ్స్‌లో పద్నాలుగు ఫోర్లు, మూడు సిక్స్‌లు ఉన్నాయి.
గిల్ ఓవరాల్‌గా 171 బంతుల్లో 102 పరుగులు సాధించగా.. మిగతా వాళ్ల నుంచి మాత్రం సహకారం అందలేదు. ఈ క్రమంలో 213 పరుగులకు ఆలౌట్ అయిన పంజాబ్.. కర్ణాటక చేతిలో ఇన్నింగ్స్ 207 పరుగుల భారీ తేడాతో పరాజయం పాలైంది.
చదవండి: అతడిని తప్పించి మంచి పనిచేశారు.. ఇదొక విన్నింగ్ టీమ్: డివిలియర్స్
Shubman Gill gets his century.. a fine & confident innings #RanjiTrophy #KarvsPun pic.twitter.com/iA1gm6I1Ib
— Manuja (@manujaveerappa) January 25, 2025
Shubman Gill Celebration after One of best Hundred under pressure in Ranji trophy match against Karnataka 💥📹📷 @Sebashiyun pic.twitter.com/7IMnWegWSy
— JassPreet (@JassPreet96) January 25, 2025
Comments
Please login to add a commentAdd a comment