దేశవాళీ క్రికెట్ పునరాగమనంలో టీమిండియా స్టార్ శుబ్‌మన్ గిల్(Shubman Gill) పూర్తిగా నిరాశపరిచాడు. పంజాబ్(Punjab) తరఫున బరిలోకి దిగిన ఈ ఓపెనింగ్ బ్యాటర్ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యాడు. కాగా గత కొంతకాలంగా భారత ప్రధాన ఆటగాళ్లు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శుబ్‌మన్ గిల్ తదితరులు టెస్టుల్లో విఫలమవుతున్న విషయం తెలిసిందే.
తారలు దిగి వచ్చారు
ఈ క్రమంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కీలక ఆదేశాలు జారీ చేసింది. జాతీయ జట్టు తరఫున విధుల్లో లేనపుడు ప్రతి ఒక్కరు దేశవాళీ క్రికెట్ ఆడాలన్న నిబంధనలు కఠినతరం చేసింది.
ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ ముంబై తరఫున.. రిషభ్ పంత్ ఢిల్లీ తరఫున.. శుబ్‌మన్ గిల్ పంజాబ్ తరఫున రంజీ ట్రోఫీ(Ranji Trophy) సెకండ్ లెగ్ బరిలో దిగారు. కోహ్లి మాత్రం మెడనొప్పి వల్ల ఢిల్లీ జట్టుకు దూరంగా ఉన్నాడు
పంజాబ్ ఓపెనర్‌గా గిల్ విఫలం
ఇక బెంగళూరు వేదికగా కర్ణాటక- పంజాబ్ మధ్య గురువారం మొదలైన మ్యాచ్‌లో టాస్ గెలిచిన కర్ణాటక.. తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ప్రభ్‌సిమ్రన్ సింగ్‌తో కలిసి శుబ్‌మన్ గిల్ పంజాబ్ ఇన్నింగ్స్ ఆరంభించాడు. అయితే, కర్ణాటక బౌలర్ అభిలాష్ శెట్టి వరుస ఓవర్లలో ఓపెనింగ్ జోడీని విడగొట్టాడు. ఈ లెఫ్టార్మ్ పేసర్ బౌలింగ్‌లో తొలి వికెట్‌గా గిల్ వెనుదిరిగాడు.
కర్ణాటక పేసర్ల జోరు
మొత్తంగా ఎనిమిది బంతులు ఎదుర్కొన్న గిల్.. ఒకే ఒక్క ఫోర్ కొట్టి నిష్క్రమించాడు. క్రిష్ణన్ శ్రీజిత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. మరోవైపు.. ప్రభ్‌సిమ్రన్ సింగ్ 28 బంతుల్లో ఒక ఫోర్ సాయంతో ఆరు పరుగులు చేసి.. అభిలాష్ శెట్టి బౌలింగ్‌లో అనీశ్ కేవీకి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఇక మరో పేసర్ వాసుకి కౌశిక్ కూడాపంజాబ్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు.
వన్‌డౌన్ బ్యాటర్ బ్యాటర్ ఫుఖ్రాజ్ మన్(1)తో పాటు.. నాలుగో స్థానంలో వచ్చిన అన్మోల్‌ప్రీత్ సింగ్(0)ను సింగిల్ డిజిట్ స్కోర్లకే పెవిలియన్ చేర్చాడు. ఈ క్రమంలో ఆరంభంలోనే నాలుగు వికెట్లు కోల్పోయిన 10 ఓవర్లలో కేవలం 19 పరుగులు మాత్రమే చేసి.. కష్టాల్లో కూరుకుపోయింది.
బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో గిల్ ఫ్లాఫ్ షో
కాగా ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో శుబ్‌మన్ గిల్ విఫలమైన విషయం తెలిసిందే. గాయం వల్ల తొలి టెస్టుకు దూరమైన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. రెండో టెస్టు నుంచి అందుబాటులోకి వచ్చాడు. అడిలైడ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో గిల్ రెండు ఇన్నింగ్స్‌లో వరుసగా 31, 28 పరుగులతో ఫర్వాలేదనిపించాడు.
అయితే, గబ్బా మైదానంలో జరిగిన మూడో టెస్టులో మాత్రం ఒక్క పరుగుకే పరిమితమయ్యాడు. ఈ క్రమంలో మెల్‌బోర్న్ బాక్సింగ్ డే టెస్టుకు దూరంగా ఉన్న ఈ వన్‌డౌన్ బ్యాటర్.. ఆఖరిదైన సిడ్నీ టెస్టులో 20, 13 పరుగులు చేశాడు. మొత్తంగా ఆస్ట్రేలియాతో ఈ ఐదు టెస్టుల సిరీస్‌లో శుబ్‌మన్ గిల్ కేవలం 93 పరుగులు మాత్రమే చేశాడు.
రోహిత్- జైస్వాల్ కూడా ఫెయిల్
ఇందులో ఒక్క అర్ధ శతకం కూడా లేకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో రంజీ బరిలో దిగి ఫామ్‌లోకి రావాలని ఆశించిన గిల్‌కు మొదటి ప్రయత్నంలోనే చుక్కెదురైంది. కర్ణాటకతో మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లోనైనా అతడు రాణిస్తాడేమో చూడాలి! మరోవైపు.. జమ్మూ- కశ్మీర్‌తో మ్యాచ్‌లో ముంబై ఓపెనర్లు యశస్వి జైస్వాల్- రోహిత్ శర్మ కూడా ఫెయిలయ్యారు. జైస్వాల్ నాలుగు, రోహిత్ మూడు పరుగులు మాత్రమే చేసి అవుటయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment