
బెంగళూరు: రంజీ ట్రోఫీ క్రికెట్ టోర్నీలో మాజీ చాంపియన్స్ సౌరాష్ట్ర, బెంగాల్ జట్లు ఫైనల్లోకి దూసుకెళ్లాయి. బెంగళూరులో ఆదివారం ముగిసిన సెమీఫైనల్లో సౌరాష్ట్ర నాలుగు వికెట్ల తేడాతో కర్ణాటక జట్టును... ఇండోర్‌లో జరిగిన మరో సెమీఫైనల్లో బెంగాల్ 306 పరుగుల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ మధ్యప్రదేశ్‌పై గెలుపొందాయి.
ఈనెల 16 నుంచి కోల్‌కతాలో జరిగే ఫైనల్లో సౌరాష్ట్ర, బెంగాల్ తలపడతాయి. ఆట చివరిరోజు ఓవర్‌నైట్ స్కోరు 123/4తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన కర్ణాటక 234 పరుగులకు ఆలౌటైంది. అనంతరం సౌరాష్ట్ర 115 పరుగుల లక్ష్యాన్ని ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది. మరోవైపు బెంగాల్ నిర్దేశించిన 548 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన మధ్యప్రదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో 241 పరుగులకు ఆలౌటైంది.