పొట్టి ఫార్మాట్‌లో ఆఫ్ఘనిస్తాన్ సారధి, ఈ తరంలో ప్రపంచంలోనే మేటి స్పిన్నర్‌గా పేరొందిన రషీద్ ఖాన్ ఓ అరుదైన ఘనతను సాధించాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో భాగంగా ముంబై ఇండియన్స్ కేప్ టౌన్ జట్టుకు సారధ్యం వహిస్తున్న ఇతను.. నిన్న (జనవరి 23) ప్రిటోరియా క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో (4-0-16-3) 3 వికెట్లు పడగొట్టడం ద్వారా టీ20 ఫార్మాట్‌లో (ఓవరాల్‌గా) 500 వికెట్ల మైలురాయిని చేరుకున్న రెండో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. 24 ఏళ్ల రషీద్ ఖాన్.. ఈ ఫీట్‌ను 371 టీ20 మ్యాచ్‌ల్లో సాధించాడు.
The moment he reached 500 wickets 💙#MICTvPC #MICapeTown #OneFamily @rashidkhan_19 pic.twitter.com/MzWTMdqC5D
— MI Cape Town (@MICapeTown) January 23, 2023
పొట్టి క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్లు సాధించిన రికార్డు విండీస్ వెటరన్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో పేరిట ఉంది. బ్రావో.. 500 వికెట్ల మైలరాయిని చేరుకునేందుకు 458 మ్యాచ్‌లు ఆడాడు. ప్రస్తుతం ఈ విండీస్ వీరుడి ఖాతాలో 614 వికెట్లు ఉన్నాయి. రషీద్ అత్యంత పిన్న వయసులో, అతి తక్కువ మ్యాచ్‌ల్లో ఈ ఫీట్‌ను సాధించడంతో మున్ముందు 1000, 1500 వికెట్లు సునయాసంగా సాధిస్తాడని క్రికెట్ ఫాలోవర్స్ అభిప్రాయపడుతున్నారు. రషీద్ ప్రస్తుతం ఐపీఎల్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అన్ని టీ20 లీగ్‌ల్లో ఆడుతున్న విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే, ప్రిటోరియా క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రషీద్ ఖాన్, జోఫ్రా ఆర్చర్ (3/37), ఓడియన్ స్మిత్ (2/27) బంతితో రాణించినప్పటికీ.. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్‌లో చేతులెత్తేయడంతో 52 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ప్రిటోరియా క్యాపిటల్స్ తరఫున విల్ జాక్స్ (62) టాప్ స్కోరర్‌గా నిలువగా.. ఎంఐ కేప్‌టౌన్ తరఫున బేబీ ఏబీడీ డెవాల్డ్ బ్రెవిస్ (46) ఓ మోస్తరుగా రాణించాడు. ప్రిటోరియా బౌలర్లలో వేన్ పార్నెల్, అన్రిచ్ నోర్జే తలో 3 వికెట్లు పడగొట్టగా.. ఆదిల్ రషీద్ 2, ఈథన్ బోష్, విల్ జాక్స్ చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment