
అహ్మదాబాద్: టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టెస్టుల్లో మరో మైలురాయిని అందుకున్నాడు. టీమిండియా తరపున టెస్టుల్లో 400 వికెట్లు సాధించిన నాలుగో ఆటగాడిగా రికార్డులకెక్కాడు. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న పింక్ బాల్ టెస్టులో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో జోఫ్రా ఆర్చర్‌ను ఔట్ చేయడం ద్వారా అశ్విన్ 400 వికెట్ల ఫీట్‌ను అందుకున్నాడు. కాగా ఇంతకముందు టెస్టుల్లో టీమిండియా తరపున ఎక్కువ వికెట్లు సాధించిన వారిలో అనిల్ కుంబ్లే (619), కపిల్ దేవ్(434), హర్భజన్ సింగ్(417) మాత్రమే ఉన్నారు.
దీంతో పాటు అశ్విన్ మరో రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో అత్యంత వేగంగా 400 వికెట్లు సాధించిన తొలి టీమిండియా ఆటగాడిగా.. ఓవరాల్‌గా రెండో ఆటగాడిగా రికార్డులకెక్కాడు. 400 వికెట్ల తీయడానికి అశ్విన్‌కు 77 టెస్టులు అవసరమవగా.. లంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ మాత్రం 72 టెస్టుల్లోనే 400 వికెట్ల ఫీట్‌ను సాధించి తొలి స్థానంలో నిలిచాడు. కాగా మ్యాచ్ విషయానికి వస్తే.. టీమిండియా స్పిన్నర్ల దాటికి ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో వణికిపోతుంది. అశ్విన్, అక్షర్‌ల దాటికి వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం ఇంగ్లండ్ 8 వికెట్ల నష్టానికి 80 పరుగులు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment