‘నేను చాలా మారాను.. మునుపటి పాండ్యాను కాను’ | RCB Star Krunal Pandya Says I-Have Changed Lot Evolution As-Cricketer | Sakshi
Sakshi News home page

‘నేను చాలా మారాను.. మునుపటి పాండ్యాను కాను’

Apr 27 2026 6:22 PM | Updated on Apr 27 2026 6:30 PM

RCB Star Krunal Pandya Says I-Have Changed Lot Evolution As-Cricketer

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో కృనాల్ పాండ్యా రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుకు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నాడు. జ‌ట్టులో కీల‌క ఆల్‌రౌండ‌ర్‌గా కొన‌సాగుతూ విజ‌యాల్లో కీల‌క‌పాత్ర పోషిస్తున్నాడు. తాజాగా ఒక క్రికెట‌ర్‌గా తాను ఏంతో ప‌రిణితి చెందానని, ఒక‌ప్ప‌టి పాండ్యాను కాద‌ని.. చాలా మారిపోయానంటూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. 

ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో మ్యాచ్ నేప‌థ్యంలో కృనాల్ పాండ్యా క్రికెట‌ర్‌గా త‌న ప్ర‌యాణంతో పాటు ఆర్సీబీతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. జియో హాట్‌స్టార్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో పాండ్యా మాట్లాడుతూ.. ‘కాలక్రమేణా నేను మంచి వ్యక్తిగా మారాను. ప్రయాణంలో ముందుకు సాగుతున్నప్పుడు ఎన్నో విషయాలు నేర్చుకుంటారు. 

నా తల్లిదండ్రులు నన్ను పెంచిన తీరుకు ఈ ఘనత దక్కుతుంది.  ఒక మనిషిగా మాత్రం మారలేదు. నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం, ఆడటానికి ఇప్పటికీ అంతే ఉత్సాహంగా, ఆసక్తిగా ఉంటాను. నేను ఎప్పుడూ కుటుంబానికి ప్రాధాన్యతనిచ్చే వ్యక్తిని. నా కుటుంబాన్ని, పిల్లలను, భార్యను అమితంగా ప్రేమిస్తాను. నా తల్లిదండ్రులు ప్రతీ విషయంలో నాకు అండగా నిలిచారు. 

మీరు విజయాన్ని రుచి చూసినప్పుడు, రెండు విషయాలు జరగవచ్చు, ఒకటి మీరు పిచ్చివాళ్లు అయిపోతారు లేదా అది మిమ్మల్ని వినయవంతులుగా చేస్తుంది. నేను రెండో మార్గాన్ని ఎంచుకున్నాను. నేను ఎదిగే కొద్దీ, మరింత వినయవంతుడిగా మారాను, అందుకే నాకు కుటుంబం చాలా ముఖ్యం.’ అని చెప్పుకొచ్చాడు.

ఆ తర్వాత ఐపీఎల్‌లో ఆర్సీబీ తరఫున కేకేఆర్‌పై తొలి మ్యాచ్ ఆడిన క్షణాలను గుర్తుచేసుకున్నాడు. ‘ఆర్సీబీ తరఫున నా తొలి మ్యాచ్ ఆడటానికి నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. అప్పుడే ప్రారంభోత్సవం జరిగింది. షారుఖ్ సర్ వేదికపై ఉండటం, ప్రేక్షకులు నినాదాలు చేయడం నాకు గుర్తుంది. పవర్‌ప్లేలో నా మొదటి ఓవర్ వేసి 15 పరుగులు ఇచ్చాను. 

10 ఓవర్లలో కేకేఆర్ 110 పరుగులు చేసింది, వాళ్లు వేగంగా పరుగులు రాబడుతున్నారు. తర్వాతి ఓవర్‌లో నేను అజింక్య రహానేను డీప్ స్క్వేర్ లెగ్ వద్ద అవుట్ చేశాను. అప్పుడు వెంకటేష్ అయ్యర్ హెల్మెట్ లేకుండానే క్రీజులోకి వచ్చాడు. ఆ సమయంలో నేను ఒక బౌన్సర్ వేయాలనుకున్నా. అయితే వెంటనే వెంకటేశ్ అయ్యర్ తన హెల్మెట్ పెట్టుకున్నాడు. కానీ తర్వాతి బంతికే వెంకటేశ్ అయ్యర్ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు.’ అని పేర్కొన్నాడు. 

వాంఖడేలో ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో గెలవడాన్ని గుర్తుచేసుకున్న కృనాల్ పాండ్యా 2025 సీజన్‌లో ఆర్సీబీ చాంపియన్‌గా నిలవడం తన కెరీర్‌లో మరిచిపోలేని క్షణమని తెలిపాడు. కోహ్లితో కలిసి ట్రోఫీని అందుకోవడం ఇప్పటికీ తన కళ్ల ముందు మెదులుతూనే ఉందని చెప్పుకొచ్చాడు. ఈ సీజ‌న్‌లో కృనాల్ పాండ్యా 7 మ్యాచ్‌ల్లో 8 వికెట్లు తీశాడు. ఓవ‌రాల్‌గా ఐపీఎల్‌లో 149 మ్యాచ్‌లాడిన కృనాల్ 1792 ప‌రుగులు చేయ‌డంతో పాటు బౌలింగ్‌లో 101 వికెట్లు తీశాడు.

చదవండి: థామ‌స్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. క్వార్టర్స్‌కు భారత్‌

Advertisement
 
Advertisement
Advertisement