Photo Credit: BCCI Twitter
వన్డే ప్రపంచకప్ 2027 దృష్ట్యా టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని వన్డేల్లో కూడా ఆడిస్తే బాగుంటుందని మాజీ క్రికెటర్ ఫరూఖ్ ఇంజినీర్ అభిప్రాయపడ్డాడు. ఓపెనింగ్‌లో రోహిత్‌కు జతగా వైభవ్‌ను పంపించి కెప్టెన్ శుబ్‌మన్ గిల్ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌కు ట్యాగ్ చేస్తూ తన సందేశాన్ని వెల్లడించాడు. దీనివల్ల మిడిలార్డర్ కూడా బలంగా మారుతుందని ఫరూఖ్ వెల్లడించాడు.
పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫరూఖ్ ఇంజినీర్ మాట్లాడుతూ.. 'గిల్ క్లాస్ ప్లేయర్. ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయగల సత్తా అతడికి ఉంది. అయితే ఆరంభంలోనే దూకుడుగా ఆడే స్వభావం గిల్‌కు లేదు. అయితే వైభవ్ సూర్యవంశీ లెఫ్ట్ హ్యాండర్ కావడంతో పాటు రోహిత్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించగలడు. వైభవ్ ధాటిగా ఆడుతున్నాడంటే ఒక ఎండ్‌లో రోహిత్ క్రీజులో నిలబడేందుకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాడు. వైభవ్ ఉన్నంతసేపు రోహిత్ తన బ్యాట్‌కు పని చెప్పాల్సిన అవసరం తక్కువగా ఉంటుంది.
ఇక క్లాస్ బ్యాటర్ అయిన గిల్‌కు నాలుగో స్థానం సరైనది. కోహ్లి ఎలాగూ మూడో స్థానంలో వస్తాడు. ఐదు, ఆరు స్థానాల్లో శ్రేయస్, రాహుల్ వస్తారు. అయితే వైభవ్‌ను వయసుతో ముడిపెడుతూ వన్డేల్లో అవకాశాలు ఇవ్వడం లేదు. నా వరకు 15 ఏళ్ల వయసు అనేది వన్డే క్రికెట్‌లో ఎంట్రీకి అర్హతే. అయితే కొందరు మాత్రం వైభవ్‌ను టీ20ల్లోనే ఆడించాలని, వన్డేల్లో ఇప్పుడే అవసరం లేదని అంటున్నారు.
కానీ ఒక బ్యాటర్‌కు ఏ ఫార్మాట్ అయినా పరుగులు చేయడమే ప్రధానం. ఆరంభంలో ఒకటి రెండు మ్యాచ్‌లు విఫలమైనప్పటికీ, కుదురుకుంటే ఎంత ప్రమాదకారో ఇప్పటికే వైభవ్ రుచి చూపించాడు. అతడు ఆడితే ఓడినవాటి కంటే గెలిచే మ్యాచ్‌లే ఎక్కువగా ఉంటాయి. నా దృష్టిలో సర్ వీవీ రిచర్డ్స్ గొప్ప బ్యాటర్. అతడంత గొప్ప బ్యాటర్‌ను నేను చూడలేదు. ఇప్పుడు సూర్యవంశీ కూడా అలానే కనిపిస్తున్నాడు. రాబోయే కాలంలో వైభవ్ కచ్చితంగా భారతదేశ భవిష్యత్తు ఆశాకిరణంగా మారనున్నాడు.'అని ఫరూఖ్ ఇంజినీర్ చెప్పుకొచ్చాడు.
ఐర్లాండ్, ఇంగ్లండ్‌తో సిరీస్‌ల్లో అంతగా ఆకట్టుకోని వైభవ్ సూర్యవంశీ జింబాబ్వేతో టీ20 సిరీస్‌లో మాత్రం అదరగొట్టాడు. మూడు మ్యాచ్‌లు కలిపి 151 పరుగులు సాధించిన వైభవ్ ఖాతాలో రెండు అర్ధసెంచరీలున్నాయి. తన ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌తో పాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ కూడా సొంతం చేసుకున్నాడు.
Read: కసి మీదున్న సూర్యకుమార్.. 3 గంటల్లో వెయ్యి బంతులా!


