రియల్‌ హీరోకు సచిన్‌ బహుమతి.. ఎమోషనల్‌ వీడియో వైరల్‌ | The Real Hero: Sachin Tendulkar Meets Para Cricketer Amir Gifts Bat Video Viral | Sakshi
Sakshi News home page

Sachin Tendulkar: రియల్‌ హీరోకు సచిన్‌ బహుమతి.. ఎమోషనల్‌ వీడియో వైరల్‌

Published Sat, Feb 24 2024 6:28 PM | Last Updated on Sat, Feb 24 2024 6:51 PM

The Real Hero: Sachin Tendulkar Meets Para Cricketer Amir Gifts Bat Video Viral - Sakshi

రియల్‌ హీరోకు సచిన్‌ బహుమతి(PC: Sachin Tendulkar X)

టీమిండియా దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌ ప్రస్తుతం కశ్మీర్‌ పర్యటనలో ఉన్నాడు. భూతల స్వర్గంలో గల్లీ క్రికెట్‌ ఆడుతూ, జవాన్లను పలకరిస్తూ ఆహ్లాదంగా గడుపుతున్నాడు. 

కుటుంబంతో కలిసి కశ్మీర్‌ అందాలను ఆస్వాదిస్తూ.. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో పంచుకుంటున్నాడు. ఈ క్రమంలో ‘క్రికెట్‌ గాడ్‌’ సచిన్‌ టెండుల్కర్‌ తాజాగా షేర్‌ చేసిన వీడియో అభిమానుల హృదయాలను తాకింది.

ఇంతకీ అందులో ఏముంది?!... జమ్మూ కశ్మీర్‌కు చెందిన అమిర్‌ హుసేన్‌ లోనీ అనే దివ్యాంగ క్రికెటర్‌ పేరు అప్పట్లో సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అయిన విషయం తెలిసిందే. చిన్ననాటి నుంచే క్రికెట్‌పై మక్కువ పెంచుకున్న అమిర్‌.. దురదృష్టవశాత్తూ ఎనిమిదేళ్ల వయసులో ఓ ప్రమాదంలో రెండు చేతులను పోగొట్టుకున్నాడు.

అయినప్పటికీ ధైర్యం కూడదీసుకుని.. అడుగడుగునా ఎదురవుతున్న సవాళ్లను దాటుకుంటూ.. రాష్ట్ర పారా క్రికెట్‌ జట్టు కెప్టెన్‌గా ఎదిగాడు. రెండు చేతులు లేకున్నా తన మెడ భాగం, భుజం మధ్య బ్యాట్‌ పెట్టకుని క్రికెట్‌ ఆడే అమిర్‌.. కాళ్లతో బౌలింగ్‌ చేయగలడు.

ఈ క్రమంలో అమిర్‌ హుసేన్‌ గురించి తెలుసుకున్న క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌.. ఆట పట్ల అతడి అంకిత భావానికి ఫిదా అయ్యాడు. అమిర్‌ను కలిసే అవకాశం వస్తే.. అతడి పేరుతో ఉన్న జెర్సీని అడిగి మరీ బహుమతిగా అందుకుంటానని సచిన్‌ పేర్కొన్నాడు.

తాజాగా తన పర్యటనలో భాగంగా అమిర్‌ హుసేన్‌ను కలిశాడు సచిన్‌. తన సంతకంతో కూడిన బ్యాట్‌ను అతడికి గిఫ్టుగా ఇచ్చాడు. అంతేకాదు.. అమిర్‌ ఎలా బ్యాటింగ్‌ చేస్తాడో అడిగి మరీ మెళకువలు నేర్చుకున్నాడు.

ఇందుకు సంబంధించిన వీడియోను పంచుకుంటూ.. ‘‘అమిర్‌ నిజమైన హీరో.. నువ్విలాగే ఎల్లప్పుడూ అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉండాలి. నిన్ను కలవడం ఎంతో సంతోషంగా ఉంది’’ అని సచిన్ టెండుల్కర్‌ క్యాప్షన్‌ జతచేశాడు. ఈ నేపథ్యంలో అమిర్‌ హుసేన్‌తో పాటు అతడిని ఆప్యాయంగా అక్కున చేర్చుకున్న సచిన్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి. వీడియోపై మీరూ ఓ లుక్కేయండి!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement