ముంబై: జూలైలో శ్రీలంకలో పర్యటించనున్న భారత బి జట్టును బీసీసీఐ గురువారం ప్రకటించింది. విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత సీనియర్ జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన నేపథ్యంలో.. సీనియర్ ఆటగాడు శిఖర్ ధవన్ సారధ్యంలో టీమిండియా లంకతో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడనుంది. ఐపీఎల్, దేశవాలీ టోర్నీల్లో ప్రతిభ ఆధారంగా లంక పర్యటనకు యువ ఆటగాళ్లను బీసీసీఐ ఎంపిక చేసింది. రుతురాజ్ గైక్వాడ్, దేవదత్ పడిక్కల్, చేతన్ సకారియా, కృష్ణప్ప గౌతమ్, నితీష్ రాణా వంటి యువ ఆటగాళ్లు తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికయ్యారు. అయితే 20 మంది సభ్యులతో కూడిన భారత బి జట్టులో శ్రేయస్ అయ్యర్, నటరాజన్‌ల పేర్లు లేకపోవడం అందరిని ఆశ్చర్యపరిచింది. వారిని ఎంపిక చేయకపోవడానికి గల కారణాలపై ఆరా తీయగా అసలు విషయం బయటపడింది.
ఐపీఎల్ 2021 సీజన్ సందర్భంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించిన నటరాజన్.. గాయం బారిన పడ్డాడు. అతని మోకాలికి తీవ్ర గాయం కావడం వల్ల ఐపీఎల్ నుంచి వైదొలిగాడు. అనంతరం అతనికి శస్త్రచికిత్స కూడా జరిగింది. అయితే గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడం వల్లే నట్టూను లంక పర్యటనకు పరిగణలోకి తీసుకోలేదని బీసీసీఐ వెల్లడించింది. మరోవైపు టీమిండియా రెగ్యులర్ సభ్యుడిగా ఉన్న శ్రేయస్ అయ్యర్.. భారత్‌లో ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా గాయపడ్డాడు. శ్రేయస్ భుజానికి తీవ్ర గాయం కావడంతో అతను లండన్ వెళ్లి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. అయితే శ్రేయస్ కూడా గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో అతన్ని లంక పర్యటనకు ఎంపిక చేయలేదని బీసీసీఐ స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే, జూలై 13 నుంచి 25 మధ్య భారత బి జట్టు శ్రీలంకతో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది.
భారత జట్టు: శిఖర్ ధవన్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్ (వైస్ కెప్టెన్), పృథ్వీ షా, దేవదత్ పడిక్కల్, హార్దిక్ పాండ్యా, రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్, మనీష్ పాండే, నితీష్ రాణా, ఇషాన్ కిషన్, సంజు శాంసన్, యుజ్వేంద్ర చహల్, రాహుల్ చాహర్, కృష్ణప్ప గౌతమ్, కృనాల్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, దీపక్ చహర్, నవ్‌దీప్ సైనీ, చేతన్ సకారియా .
చదవండి: WTC FINAL: టీమిండియాకు భారీ షాక్.. కెప్టెన్ కోహ్లీకి గాయం?
Comments
Please login to add a commentAdd a comment