
టీమిండియా హెడ్‌కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ కొనసాగేలా చర్చలు జరిపిన భారత క్రికెట్ నియంత్రణ మండలి కెప్టెన్ రోహిత్ శర్మ విషయంలోనూ అదే పంథాలో వెళ్లనున్నట్లు సమాచారం. అంతర్జాతీయ టీ20లకు దూరంగా ఉండాలనుకుంటున్న హిట్‌మ్యాన్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా బీసీసీఐ పెద్దలు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది.
వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ టోర్నీ ముగిసే వరకు సారథిగా కొనసాగాలని రోహిత్‌ను ఒప్పించే దిశగా ఇప్పటికే చర్చలు మొదలుపెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా విరాట్ కోహ్లి తర్వాత టీమిండియా పగ్గాలు చేపట్టిన రోహిత్ శర్మ.. టీ20 వరల్డ్ కప్-2022లో జట్టును సెమీస్ వరకు చేర్చాడు.
అనంతరం ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ వరకు తీసుకువచ్చాడు. ఇక ఇటీవల ముగిసిన వన్డే ప్రపంచకప్ ఈవెంట్లో కూడా ఫైనల్‌కు తీసుకొచ్చినా టైటిల్ మాత్రం గెలవలేకపోయాడు. ఈ ప్రపంచకప్‌నకు సిద్ధమయ్యే క్రమంలో టీ20లలకు దూరంగా ఉన్నా అనుకున్న ఫలితం రాబట్టలేకపోయాడు.
ఈ నేపథ్యంలో టీ20లకు పూర్తిగా దూరమై వన్డే, టెస్టుల్లో కొనసాగాలని 36 ఏళ్ల రోహిత్ శర్మ నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. హిట్‌మ్యాన్ తప్పుకొంటే హార్దిక్ పాండ్యా టీ20ల సారథి కావడం లాంఛనమే!
అయితే, బీసీసీఐ పెద్దలు మాత్రం ద్రవిడ్ మాదిరే రోహిత్‌ను కూడా కొనసాగిస్తేనే వచ్చే ఏడాది ప్రపంచకప్‌లో అనుకున్న ఫలితాలు రాబట్టగలమనే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆ దిశగా హిట్‌మ్యాన్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు బీసీసీఐ సన్నిహిత వర్గాలు పేర్కొన్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. సౌతాఫ్రికా పర్యటన నుంచే రోహిత్‌ను మళ్లీ టీ20ల బరిలో దించేందుకు బీసీసీఐ సిద్ధమవుతుందన్నది వాటి సారాంశం.
Comments
Please login to add a commentAdd a comment