ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు మాజీ చాంపియన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్) జట్టుకు ఊహించని షాక్ తగిలేలా ఉంది. ఆ జట్టు విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ జట్టును ఎస్ఆర్‌హెచ్‌ను వీడనున్నట్లు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఐపీఎల్ 2027 రిటెన్షన్స్ కంటే ముందే అభిషేక్ జట్టును వీడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీలతో అభిషేక్ శర్మ సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ కూడా రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ వార్తల్లో నిజం లేదని ఎస్ఆర్‌హెచ్ సీఈవో షణ్ముగం ఖండించారు. అభిషేక్ శర్మను తాము వదులుకోవడానికి సిద్ధంగా లేమని, అనవసరంగా పుకార్లు పుట్టించొద్దని, ఇది ఎంతమాత్రం నిజం కాదని షణ్ముగం పేర్కొన్నాడు.
2026 ఐపీఎల్ సీజన్‌లో ఆరంభ మ్యాచ్‌లకు రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ దూరమవ్వడంతో అతడి స్థానంలో ఇషాన్ కిషన్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడం అభిషేక్‌కు నచ్చలేదట. తనకు కెప్టెన్సీ అప్పగిస్తారని భావించినప్పటికీ, ఎస్ఆర్‌హెచ్ యాజమాన్యం మాత్రం ఇషాన్‌కు అప్పగించడంపై అభిషేక్ గుర్రుగా ఉన్నాడు.
అయితే ఈ వార్తల్లో నిజం లేదనిపిస్తున్నప్పటికీ, ఒకవేళ అభిషేక్ శర్మ వచ్చే సీజన్ నాటికి జట్టును వీడితే మాత్రం అది ఎస్ఆర్‌హెచ్‌కు పెద్ద దెబ్బే అని చెప్పొచ్చు. ఓపెనింగ్ స్థానంలో వచ్చి ఎన్నో భీకరమైన ఇన్నింగ్స్‌లు ఆడిన అభిషేక్ శర్మ జట్టు సాధించిన చాలా విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఇక 2022 నుంచి అభిషేక్ శర్మ ఎస్ఆర్‌హెచ్‌తోనే ప్రయాణం సాగిస్తున్నాడు.
2024లో ఎస్ఆర్‌హెచ్ ఫైనల్ చేరడంలో అభిషేక్ శర్మ కీలకపాత్ర వహించాడు. ఆ సీజన్‌లో 16 మ్యాచ్‌లాడిన అభిషేక్ 484 పరుగులు సాధించాడు. 2025 సీజన్‌లో 40 బంతుల్లోనే సెంచరీ సాధించిన అభిషేక్ ఐపీఎల్‌లో తన తొలి సెంచరీ మార్క్‌ను చేరుకున్నాడు. ఓవరాల్‌గా ఐపీఎల్‌లో 92 మ్యాచ్‌లాడిన అభిషేక్ శర్మ 2,379 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు, 13 అర్థసెంచరీలు ఉన్నాయి. ఇక టీమిండియా తరఫున ప్రస్తుతం ఆసియా గేమ్స్‌లో పాల్గొంటున్న అభిషేక్ శర్మ రేపు పాకిస్తాన్‌తో జరగనున్న ఫైనల్ పోరు కోసం సిద్ధమవుతున్నాడు.
ఇదీ చదవండి: ఓటమి తప్పించిన భారత బ్యాటర్.. ఆసీస్‌పై సిరీస్ కైవసం


