మెట్జ్ (ఫ్రాన్స్): మోజెల్లి ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల డబుల్స్ విభాగంలో హైదరాబాద్ ప్లేయర్ బొల్లిపల్లి రిత్విక్ చౌదరీ రాకెట్ పట్టకుండానే క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకున్నాడు. తొలి రౌండ్‌లో రిత్విక్ (భారత్)–ఫ్రాన్సిస్కో కబ్రాల్ (పోర్చుగల్) జోడీతో తలపడాల్సిన ఆర్థర్ కజాక్స్–హరోల్డ్ మయోట్ (ఫ్రాన్స్) జంట గాయం కారణంగా బరిలోకి దిగలేదు. దాంతో రిత్విక్–కబ్రాల్ ద్వయానికి తొలి రౌండ్‌లో ‘వాకోవర్’ లభించింది.
వాస్తవానికి ఈ టోర్నీలో భారత్‌కే చెందిన అర్జున్ ఖడేతో రిత్విక్ జతగా పోటీపడాల్సింది. అయితే గతవారం బ్రాటిస్లావాలో జరిగిన స్లొవాక్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టోర్నీ సందర్భంగా అర్జున్‌కు గాయమైంది. దాంతో అర్జున్ మోజెల్లి ఓపెన్ నుంచి వైదొలగగా... పోర్చుగల్ ప్లేయర్ కబ్రాల్‌తో కలిపి రిత్విక్ పోటీపడుతున్నాడు.
కెరీర్ బెస్ట్ ర్యాంక్‌లో...
స్లొవాక్ ఓపెన్‌లో రిత్విక్ సెమీస్‌కు చేరడంతో అతని ఏటీపీ డబుల్స్ ర్యాంక్ కూడా మెరుగైంది. గతవారం 85వ ర్యాంక్‌లో నిలిచిన రిత్విక్ సోమవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో ఐదు స్థానాలు ఎగబాకి 80వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. రిత్విక్ భాగస్వామి అర్జున్ ఖడే 76వ ర్యాంక్‌లో కొనసాగుతుండగా... శ్రీరామ్ బాలాజీ నాలుగు స్థానాలు పడిపోయి 65వ ర్యాంక్‌లో ఉన్నాడు. యూకీ బాంబ్రీ 48వ ర్యాంక్‌లో మార్పు లేదు.
టాప్–10లో చోటు కోల్పోయిన బోపన్న
గత ఏడాది ఆగస్టు నుంచి టాప్–10లో ఉన్న భారత వెటరన్ స్టార్ రోహన్ బోపన్న తాజా ర్యాంకింగ్స్‌లో నాలుగు స్థానాలు పడిపోయాడు. పారిస్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టోర్నీలో బోపన్న–ఎబ్డెన్ (ఆ్రస్టేలియా) జోడీ రెండో రౌండ్‌లో నిష్క్రమించడం బోపన్న ర్యాంక్‌పై ప్రభావం చూపింది. బోపన్న ప్రస్తుతం 12వ ర్యాంక్‌లో ఉన్నాడు.
గతవారం సియోల్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్–100 టోర్నీలో విజేతగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సాకేత్ మైనేని–రామ్‌కుమార్ రామనాథన్ (తమిళనాడు) ర్యాంక్‌లు కూడా మెరుగయ్యాయి. రామ్‌కుమార్ 18 స్థానాలు ఎగబాకి 125వ ర్యాంక్‌లో, సాకేత్ 25 స్థానాలు పురోగతి సాధించి 203వ స్థానంలో నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment