రోహిత్ శర్మ- విరాట్ కోహ్లి (PC: BCCI/ICC)
India tour of South Africa, 2023-24 :సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డు ముంగిట నిలిచాడని క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ అన్నాడు. సఫారీ గడ్డపై గనుక ఈ సిరీస్ గెలిస్తే వన్డే వరల్డ్‌కప్-2023 ఫైనల్లో ఎదురైన పరాభవ ప్రభావాన్ని కొంతమేర అయినా తగ్గించే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డాడు.
కాగా సొంతగడ్డపై జరిగిన ఐసీసీ మెగా ఈవెంట్లో రోహిత్ సేన ఫైనల్ చేరేంత వరకు అజేయంగా నిలిచిన విషయం తెలిసిందే. అయితే, అసలైన పోరులో మాత్రం ఆస్ట్రేలియా చేతిలో ఓడి తీవ్ర నిరాశకు గురైంది. నరేంద్ర మోదీ స్టేడియంలో దాదాపు లక్ష మందికి పైగా అభిమానుల మధ్య ఎదురైన ఘోర పరాభవం కారణంగా ఆటగాళ్లంతా భావోద్వేగానికి లోనయ్యారు.
బాక్సింగ్ డే టెస్టుతో పునరాగమనం
కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి సహా ఇతర క్రికెటర్లంతా కంటతడి పెట్టుకుని భారంగా మైదానాన్ని వీడారు. ఈ క్రమంలో మూడు వారాలకు పైగా ఆటకు దూరమైన ‘విరాహిత్’ ద్వయం దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా తిరిగి మైదానంలో దిగనుంది.
రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా డిసెంబరు 26 నుంచి ఈ ఇద్దరు తిరిగి జట్టుతో కలవనున్నారు. కాగా ప్రొటిస్ గడ్డపై ఇంతవరకు భారత జట్టు ఒక్క టెస్టు సిరీస్ కూడా గెలవలేదు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ సారథి సునిల్ గావస్కర్ స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
వరల్డ్‌కప్ ఓటమిని మరిపించేలా
‘‘గత 6-8 నెలలుగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి అద్భుత ఫామ్‌లో కొనసాగుతున్నారు. సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో రోహిత్ కీలకం కానున్నాడు. ఈ టీమిండియా ఈ సిరీస్ గనుక గెలిస్తే వరల్డ్‌కప్ ఫైనల్లో ఎదురైన ఓటమి తాలుకు గాయాన్ని కొంతమేర అయినా నయం చేసే అవకాశం ఉంటుంది’’ అని గావస్కర్ అభిప్రాయపడ్డాడు.
ఇదిలా ఉంటే.. దిక్షిణాఫ్రికా పర్యటనలో భారత్‌కు వర్షం స్వాగతం పలికింది. సఫారీలో కఠిన సవాలు ఎదురవుతుందనుకుంటే ఎడతెరిపిలేని వర్షంతో ఆదివారం నాటి తొలి టి20 మ్యాచ్ రద్దయ్యింది. కాగా సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా టీమిండియా మూడు టీ20, మూడు వన్డే, రెండు టెస్టులు ఆడనుంది.
చదవండి: Ind vs Pak: భారత క్రికెట్ జట్టుకు నిరాశ.. సెమీస్ చేరాలంటే..
Comments
Please login to add a commentAdd a comment