డీకే తిట్టుకున్న బ్యాట్‌తో రోహిత్‌ దంచి కొట్టాడు.. | Rohit Sharma First Ever International Fifty Hit With My Bat Says Dinesh Karthik | Sakshi
Sakshi News home page

డీకే తిట్టుకున్న బ్యాట్‌తో తొలి ఫిఫ్టీ కొట్టిన రోహిత్‌..

Published Tue, Jun 1 2021 7:35 PM | Last Updated on Tue, Jun 1 2021 9:23 PM

Rohit Sharma First Ever International Fifty Hit With My Bat Says Dinesh Karthik - Sakshi

ముంబై: హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ శర్మ.. అంతర్జాతీయ కెరీర్‌లో మొట్టమొదటి అర్ధ శతకాన్ని తనకు కలిసిరాని బ్యాట్‌తో సాధించాడని టీమిండియా వెటరన్‌ వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మెన్‌ దినేశ్‌ కార్తీక్‌ వెల్లడించాడు. మంగళవారం(జూన్‌ 1న) 36వ జన్మదినాన్ని జరుపుకున్న డీకే.. ఈ ఆసక్తికర విషయాన్ని ప్రస్తావించాడు. దక్షిణాఫ్రికా గడ్డపై 2007లో జరిగిన తొలి టీ20 ప్రపంచకప్‌లో భాగంగా సఫారీలతో జరిగిన మ్యాచ్‌లో తాను తిట్టుకుని, వద్దనుకున్న బ్యాట్‌తో రోహిత్‌ అద్భుతంగా రాణించాడని, 40 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 50 పరుగులతో అజేయంగా నిలిచాడని గుర్తు చేసుకున్నాడు. రోహిత్ శర్మ తొలి అర్థసెంచరీ తన బ్యాట్ నుంచి జాలువారడాన్ని తలచుకుంటే ఇప్పటికీ గర్వంగా ఉంటుందని ఆయన వ్యాఖ్యానించాడు.

ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేయగా.. ఛేదనలో దక్షిణాఫ్రికా 116/9కే పరిమితమైంది. 50 పరుగలతో నాటౌట్‌గా నిలిచిన రోహిత్ శర్మకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. కాగా, అదే మ్యాచ్‌లో మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన దినేశ్ కార్తీక్ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. పొలాక్ బౌలింగ్‌లో ఎదుర్కొన్న తొలి బంతికే మోర్కెల్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ క్రమంలో డ్రెస్సింగ్ రూముకి వచ్చిన డీకే.. తనకు ఆ బ్యాట్‌ కలిసి రావడం లేదని తిట్టుకున్నాడట. ఆ సమయంలో పక్కనే ఉన్న రోహిత్.. డీకేను ఆ బ్యాట్‌ ఇవ్వల్సిందిగా కోరి, అదే బ్యాట్‌తో హాఫ్ సెంచరీ బాదినట్లు డీకే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఇదిలా ఉంటే, ప్రస్తుతం డీకే ఐపీఎల్‌కు మాత్రమే పరిమితం కాగా, రోహిత్‌ టీమిండియాలో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు.
చదవండి: తొలి టెస్ట్‌కు ముందు ఇంగ్లండ్‌కు గట్టి షాక్‌..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement