
బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టడానికే నేను ఎక్కువగా ఇష్టపడతాను. తప్పులు జరగడం సహజం. దానిని స్వీకరించేందుకు నేను సిద్ధంగా ఉన్నా.
బ్రిస్బేన్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో అవుటైన తీరుపై తాను పశ్చాత్తాపడటం లేదని హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ అన్నాడు. కొన్నిసార్లు తప్పులు జరుగుతాయని, వాటిని ఆమోదించేందుకు మానసికంగా సిద్ధంగా ఉండాలని పేర్కొన్నాడు. నాథన్ లయన్ స్మార్ట్ బౌలర్ అన్న రోహిత్.. అతడు బంతి విసిరిన విధానం వల్లే తాను అనుకున్న షాట్ కొట్టలేకపోయానని తనను తాను సమర్థించుకున్నాడు. కాగా గబ్బాలో జరుగుతున్న నాలుగో టెస్టులో రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 62 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయింది. కమిన్స్ వేసిన ఇన్నింగ్స్ ఏడో ఓవర్ రెండో బంతికి శుభ్‌మన్ గిల్ ఔట్ కాగా, లయన్ వేసిన 20 ఓవర్ ఐదో బంతికి రోహిత్ పెవిలియన్ చేరాడు. 74 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 44 పరుగులు చేసి వైస్ కెప్టెన్ అవుట్ అయ్యాడు. అయితే, సులభమైన క్యాచ్ ఇచ్చి వికెట్ కోల్పోవడంపై అభిమానులతో పాటు క్రీడా విశ్లేషకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రోహిత్ షాట్ సెలక్షన్ బాగాలేదని విమర్శిస్తున్నారు.(చదవండి: ఏమాత్రం బాధ్యత లేని రోహిత్!)
ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ‘‘ బంతిని బలంగా బాదేందుకు సిద్ధంగా ఉన్నాను. లాంగాన్ మీదుగా బౌండరీకి తరలించాలనుకున్నా. అయితే నా ప్రణాళికను సరిగా అమలు చేయలేకపోయాను. నిజానికి నేను ఈరోజు ఏం చేశాను అది నాకు నచ్చింది. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుందని తొలుత భావించాం. అయితే కొన్ని ఓవర్లు ఆడిన తర్వాత స్వింగ్ అంతగా లేదని అర్థమైంది. పూర్తిగా తేరుకునేలోపే దురదృష్టవశాత్తూ అవుట్ అయ్యాను. అయితే ఇందులో పశ్చాత్తాపడటానికి ఏమీ లేదు. బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టడానికే నేను ఎక్కువగా ఇష్టపడతాను. తప్పులు జరగడం సహజం. దానిని స్వీకరించేందుకు నేను సిద్ధంగా ఉన్నా. లయన్ చాలా స్మార్ట్‌గా బౌల్ చేశాడు’’ అని చెప్పుకొచ్చాడు. కాగా లయన్ వేసిన ఫ్లైట్ బంతిని మిడాన్ వైపునకు రోహిత్ షాట్ ఆడాడు. లాంగాన్‌లో ఉన్న స్టార్క్ కాస్త ముందుకు కదిలి దాన్ని ఒడిసిపట్టడంతో వికెట్ సమర్పించుకోవాల్సి వచ్చింది.
Nathan Lyon's 397th Test wicket seemed to come out of nowhere and the Aussies were pumped! #OhWhatAFeeling #AUSvIND | @Toyota_Aus pic.twitter.com/rIhl4ZjbTu
— cricket.com.au (@cricketcomau) January 16, 2021