కెప్టెన్‌గా తొలి టెస్టులోనే రోహిత్ శర్మ అదరగొట్టాడు. మొహాలీ వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రోహిత్ శర్మపై టీమిండియా స్సిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా బ్యాట్‌తోను బాల్‌తోను అత్భుతంగా రాణించాడు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో రవీంద్ర జడేజా 175 పరుగులతో డబుల్ సెంచరీకు చేరువలో ఉన్నప్పుడు భారత్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఈనేపథ్యంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఈ వివాదంపై అశ్విన్ తాజాగా స్పందించాడు."రోహిత్ శర్మ కెప్టెన్సీ అద్భుతమైనది. రోహిత్ ఫీల్డ్‌లో ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తాడు. అతడు జట్టును లీడ్ చేసే విధానంలో నేను చాలా మానవీయ విలువలను గమనించాను.
అతడు జట్టులో ప్రతి ఒక్క ఆటగాడి గురించి తెలుసుకుంటాడు. ప్రతి ఒక్క ఆటగాడిలో విశ్వాసం పెంపొందించడానికి ప్రయత్నిస్తాడు. అతడు బౌలర్‌లను రొటేట్ చేసే విధానం అద్భుతమైనది. ఇక ఇన్నింగ్స్ డిక్లేర్ చేసే సమయం వచ్చినప్పటికీ జడేజా డబుల్ సెంచరీ సాధించాలని రోహిత్ కోరుకున్నాడు. జడేజా డబుల్ సెంచరీ సాధించాక ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయాలని రోహిత్ భావించాడు. ఈ విషయాన్ని జడేజాకు తెలియజేశాడు. దానికి బదులుగా జడ్డు.. డబుల్ సెంచరీ నాకు ముఖ్యం కాదు, ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయండి అని చెప్పాడు. అందుకే రోహిత్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు. ఇటువంటి విషయాల్లో రోహిత్ చాలా అనుభవజ్ఞుడని నేను భావిస్తున్నాను" అని అశ్విన్ పేర్కొన్నాడు. ఇక భారత్-శ్రీలంక మధ్య రెండో టెస్టు బెంగళూరు వేదికగా మార్చి 12 ప్రారంభం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment