నితీశ్ రాణాను బౌల్డ్ చేసిన ఆనందంలో సిరాజ్
మొహమ్మద్ సిరాజ్... కోల్‌కతాతో మ్యాచ్‌కు ముందు ఐపీఎల్‌లో అతి చెత్త బౌలర్‌లలో ఒకడిగా గుర్తింపు... కనీసం 100కు పైగా ఓవర్లు వేసిన 92 మంది బౌలర్లలో అందరికంటే ఎక్కువగా 9.29 ఎకానమీతో అతను పరుగులిచ్చాడు... సోషల్ మీడియాలో అతనిపై లెక్కలేనన్ని ట్రోలింగ్‌లు... కానీ ఒక అద్భుత స్పెల్ అతడిని ఎప్పటికీ గుర్తుంచుకునేలా చేసింది. తన తొలి రెండు ఓవర్లలో ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా అతను తీసిన 3 వికెట్లు బెంగళూరు విజయానికి పునాది వేశాయి. సిరాజ్‌తో పాటు ఇతర బెంగళూరు బౌలర్లు కూడా చెలరేగడంతో నైట్‌రైడర్స్ కుప్పకూలింది. చెత్త బ్యాటింగ్‌తో 84 పరుగులకే పరిమితమై ఓటమికి ఆహ్వానం పలికింది. ఆ తర్వాత సునాయాస విజయాన్ని అందుకున్న కోహ్లి సేన అదనంగా రన్‌రేట్‌ను కూడా మెరుగుపర్చుకొని రెండో స్థానానికి దూసుకుపోయింది.
అబుదాబి: ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ఆట మరింత పదునెక్కింది. గొప్ప బ్యాటింగ్ వనరులున్నా పేలవ బౌలింగ్‌తో పలు మ్యాచ్‌లు చేజార్చుకున్న ఆ జట్టు ఈసారి కేవలం బౌలింగ్ ప్రదర్శనతోనే భారీ విజయాన్ని అందుకుంది. బుధవారం జరిగిన పోరులో ఆర్‌సీబీ 8 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (34 బంతుల్లో 30; 3 ఫోర్లు, 1 సిక్స్) మినహా అంతా విఫలమయ్యారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సిరాజ్ (3/8) చెలరేగగా, చహల్ (2/15) ఆకట్టుకున్నాడు. అనంతరం బెంగళూరు 13.3 ఓవర్లలో 2 వికెట్లకు 85 పరుగులు సాధించింది. దేవదత్ పడిక్కల్ (17 బంతుల్లో 25; 3 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
మోర్గాన్ మినహా...
కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) బ్యాటింగ్ తీరు చూస్తే ఐపీఎల్‌లో అన్ని చెత్త రికార్డులు ఆ జట్టు తమ పేరిట లిఖించుకునేలా కనిపించింది. సిరాజ్ దెబ్బకు రాహుల్ త్రిపాఠి (1), నితీశ్ రాణా (0), బాంటన్ (10) వెనుదిరగ్గా... సైనీ బౌలింగ్‌లో శుబ్‌మన్ గిల్ (1) చెత్త షాట్ ఆడి నిష్క్రమించాడు. దినేశ్ కార్తీక్ (4) కూడా చేతులెత్తేయడంతో ఆదుకునే భారం మోర్గాన్‌పై పడింది. నిలదొక్కుకునేందుకు సమయం తీసుకున్న కేకేఆర్ కెప్టెన్ కొన్ని చక్కటి షాట్లతో ఇన్నింగ్స్‌ను నడిపించాడు.
అయితే మరో భారీ షాట్‌కు ప్రయత్నించి సుందర్ బౌలింగ్‌లో మోర్గాన్ అవుట్ కావడంతో కనీస స్కోరు సాధించాలన్న కోల్‌కతా ఆశలు సన్నగిల్లాయి. చివర్లో ఫెర్గూసన్ (19 నాటౌట్), కుల్దీప్ (12) నిలబడటంతో జట్టు ఆలౌట్ కాకుండా ఉండిపోయింది. ఈ క్రమంలో ఐపీఎల్‌లో ఆలౌట్ కాకుండా అతి తక్కువ స్కోరు (గతంలో పంజాబ్ 92/8) చేసిన జట్టుగా నిలిచింది. మొత్తంగా కోల్‌కతా ఐపీఎల్‌లో తమ అత్యల్ప స్కోరు (67)ను దాటగలిగింది.
చకచకా...
లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పడిక్కల్, ఫించ్ తొలి వికెట్‌కు 38 బంతుల్లో 46 పరుగులు జోడించారు. వీరిద్దరు ఒకే స్కోరు వద్ద అవుటైనా... గుర్‌కీరత్ (26 బంతుల్లో 21 నాటౌట్; 4 ఫోర్లు), కోహ్లి (17 బంతుల్లో 18 నాటౌట్; 2 ఫోర్లు) కలిసి మిగతా పనిని పూర్తి చేశారు. ఈ జంట 31 బంతుల్లో 39 పరుగులు జత చేయడంతో మరో 39 బంతులు మిగిలి ఉండగానే బెంగళూరు గెలిచింది.
స్కోరు వివరాలు
కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: శుబ్‌మన్ (సి) మోరిస్ (బి) సైనీ 1; త్రిపాఠి (సి) డివిలియర్స్ (బి) సిరాజ్ 1; రాణా (బి) సిరాజ్ 0; బాంటన్ (సి) డివిలియర్స్ (బి) సిరాజ్ 10; కార్తీక్ (ఎల్బీ) (బి) చహల్ 4; మోర్గాన్ (సి) గుర్‌కీరత్ (బి) సుందర్ 30; కమిన్స్ (సి) పడిక్కల్ (బి) చహల్ 4; కుల్దీప్ (రనౌట్) 12; ఫెర్గూసన్ (నాటౌట్) 19; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 84.
వికెట్ల పతనం: 1–3; 2–3; 3–3; 4–14; 5–32; 6–40; 7–57; 8–84.
బౌలింగ్: మోరిస్ 4–1–16–0; సిరాజ్ 4–2–8–3; సైనీ 3–0–23–1; ఉదాన 1–0–6–0; చహల్ 4–0–15–2; సుందర్ 4–1–14–1.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: పడిక్కల్ (రనౌట్) 25; ఫించ్ (సి) కార్తీక్ (బి) ఫెర్గూసన్ 16; గుర్‌కీరత్ (నాటౌట్) 21; కోహ్లి (నాటౌట్) 18; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (13.3 ఓవర్లలో 2 వికెట్లకు) 85. వికెట్ల పతనం: 1–46; 2–46.
బౌలింగ్: కమిన్స్ 3–0–18–0; ప్రసిధ్ కృష్ణ 2.3–0–20–0; వరుణ్ చక్రవర్తి 4–0–28–0; ఫెర్గూసన్ 4–0–17–1.
కొత్త బంతితో బౌలింగ్ చేసే అవకాశం ఇచ్చిన కోహ్లికి కృతజ్ఞతలు. మేం మైదానంలోకి వెళ్లినప్పుడు ముందుగా దాని గురించి అనుకోలేదు. కానీ సిద్ధంగా ఉండు అని విరాట్ చెప్పాడు. కొత్త బంతితో నేను చాలా సాధన చేస్తున్నాను. అది ఇక్కడ పని చేసింది. రాణాను అవుట్ చేసిన బంతి చాలా బాగా పడింది.
–సిరాజ్
కొత్త బంతిని మోరిస్, సుందర్ పంచుకోవాలనేది మొదటి ఆలోచన. కానీ దానిని మార్చి సిరాజ్‌ను ముందుకు తెచ్చాం. ప్రతీది మా ప్రణాళిక ప్రకారమే చేశాం. గత ఏడాది సిరాజ్ అన్ని వైపుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. ఈసారి నెట్స్‌లో తీవ్రంగా ప్రాక్టీస్ చేశాడు. దాని ఫలితాలు ఇప్పుడు కనిపించాయి.
–కోహ్లి
సూపర్ స్పెల్...
0,0,0,0,0,0... 0,0,0,0,0,0... 1,0,0,0,1,0... 1,1,1,1,1,1... నాలుగు ఓవర్లలో సిరాజ్ బౌలింగ్ ప్రదర్శన ఇది. కోల్‌కతా బ్యాట్స్‌మెన్‌కు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా అతను చెలరేగాడు. సిరాజ్ బౌలింగ్ చూస్తుంటే ప్రతీ బంతికి వికెట్ తీస్తాడేమో అనిపించింది. తాను ఆడిన గత మ్యాచ్‌లో గేల్ చితక్కొట్టడంతో 3 ఓవర్లలోనే 0/44 గణాంకాలు నమోదు చేసిన అతడిపై కెప్టెన్ కోహ్లి మళ్లీ నమ్మకముంచాడు. దానిని నిలబెట్టుకుంటూ ఈ హైదరాబాదీ చెలరేగాడు. ఒక్క బౌండరీ కూడా కొట్టే చాన్స్ ఇవ్వకుండా అతను ఆధిక్యం ప్రదర్శించడం విశేషం. భారీగా పరుగులిస్తాడంటూ తనపై ఉన్న విమర్శలకు అతను ఈ మ్యాచ్‌తో తగిన సమాధానమిచ్చాడు. ఆర్‌సీబీ తరఫున మూడో ఏడాది ఆడుతున్న అతను ఎట్టకేలకు తన పదునేమిటో చూపించాడు. ఈ సీజన్‌లో సిరాజ్‌కు ఇప్పటి వరకు కొత్త బంతిని పంచుకునే అవకాశం రాలేదు.
ఈ మ్యాచ్‌లో కూడా రెండో ఓవర్ వేసేందుకు సుందర్ సన్నద్ధమవుతుండగా... అతడిని ఆపి సిరాజ్‌కు కోహ్లి బంతిని అప్పగించాడు. చక్కటి స్వింగ్‌తో త్రిపాఠిని దెబ్బ తీసిన అతను తర్వాతి బంతికే రాణాకు క్లీన్‌బౌల్డ్ చేయడం హైలైట్‌గా నిలిచింది. మరుసటి ఓవర్లో బాంటన్ కూడా సిరాజ్ స్వింగ్‌కు తలవంచాడు. ఈ స్పెల్ తర్వాత విరామం తీసుకున్న అతను మళ్లీ 19వ ఓవర్‌లో తిరిగొచ్చి అన్నీ సింగిల్స్ ఇచ్చాడు. ఒక దశలో ఐపీఎల్‌లో అత్యంత పొదుపైన బౌలింగ్ ప్రదర్శన (ఫిడేల్ ఎడ్వర్డ్స్–4 ఓవర్లలో 6 పరుగులు) నమోదు చేసేలా కనిపించినా చివరి ఓవర్‌తో గణాంకాలు కాస్త మారాయి. అయితే లీగ్ చరిత్రలో తొలిసారి రెండు మెయిడిన్ ఓవర్లు వేసిన బౌలర్‌గా అతను గుర్తింపు పొందాడు. ఈ బౌలింగ్ జోరు చూస్తే లీగ్‌లో అతను మరింతగా చెలరేగేందుకు కావాల్సిన జోష్‌ను ఇచ్చిందనడంలో సందేహం లేదు.
► ఐపీఎల్‌లో ఒక బౌలర్ 2 మెయిడిన్లు వేయడం ఇదే తొలిసారి (సిరాజ్)
► ఐపీఎల్‌లో ఒక టీమ్ 4 మెయిడిన్లు వేయడం ఇదే తొలిసారి (సిరాజ్ 2, మోరిస్ 1, సుందర్ 1). గతంలో ఏ జట్టూ 2 ఓవర్లకు మించి మెయిడిన్లు వేయలేదు.
► లీగ్‌లో పూర్తి ఓవర్లు ఆడి ఆలౌట్ కాకుండా ఒక జట్టు చేసిన అత్యల్ప స్కోరు ఇదే (84/8)
Comments
Please login to add a commentAdd a comment