
రోడ్‌సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో భాగంగా మంగళవారం బంగ్లాదేశ్ లెజెండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక లెజెండ్స్ 70 పరుగుల తేడాతో విజయం సాధించింది. 214 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ లెజెండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు మాత్రమే చేయగలిగింది. తుషార్ ఇమ్రాన్ 52 పరుగులు చేయగా.. అబుల్ హసన్ 29 పరుగులు చేశాడు. లంక బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో బంగ్లా లెజెండ్స్ పరుగులు చేయడంలో విఫలమయ్యారు. లంక లెజెండ్స్ బౌలర్లలో తిలకరత్నే దిల్షాన్ మూడు వికెట్లు తీయగా.. అసేలా గుణరత్నే 2, సనత్ జయసూర్య, దమ్మిక ప్రసాద్‌లు చెరొక వికెట్ తీశారు.
అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన లంక లెజెండ్స్‌కు ఓపెనర్లు ఉదావట్టే 43, సనత్ జయసూర్య 37 పరుగులతో శుభారంభం అందించారు. ఆ తర్వాత కెప్టెన్ తిలకరత్నే దిల్షాన్ 51 పరుగులతో రాణించగా.. చమర సిల్వా 34 పరుగులు నాటౌట్‌గా నిలిచి జట్టు భారీ స్కోరు చేయడంలో సహకరించాడు. బంగ్లా లెజెండ్స్ బౌలర్లలో హొస్సేన్, షరీఫ్, కబీర్, రజాక్, ఎలిస్ సన్నీ తలా ఒక వికెట్ తీశారు.
బ్యాటింగ్‌లో అర్థసెంచరీ, బౌలింగ్‌లో మూడు వికెట్లతో ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచిన కెప్టెన్ దిల్షాన్‌ను ప్లేయర్ ఆఫ్ మ్యాచ్ అవార్డు వరించింది. కాగా ఇప్పటికే శ్రీలంక లెజెండ్స్, ఇండియా లెజెండ్స్, వెస్టిండీస్ లెజెండ్స్, ఆస్ట్రేలియా లెజెండ్స్‌లు సెమీ ఫైనల్‌కు చేరుకున్నాయి. మొదటి సెమీఫైనల్(సెప్టెంబర్ 28న)లో శ్రీలంక లెజెండ్స్, ఇండియా లెజెండ్స్ తలపడనుండగా.. రెండో సెమీస్‌లో వెస్టిండీస్ లెజెండ్స్, ఆస్ట్రేలియా లెజెండ్స్(సెప్టెంబర్ 29న) పోటీపడనున్నాయి. ఇక ఫైనల్ మ్యాచ్ అక్టోబర్ 1న(శనివారం) జరగనుంది.
చదవండి: 178 పరుగులకే ఆలౌట్.. సిరీస్ క్లీన్‌స్వీప్; సంజూ కెప్టెన్సీ అదరహో