
ముంబై : ఎక్కువ వయసు ఉన్న ఆటగాళ్లతో నిండిన చెన్నై జట్టు యువకులతో కూడిన ఢిల్లీతో పోరుకు సిద్ధమైంది. అయితే టి20ల్లో యువకులకే మంచి అవకాశం ఉందని దీనర్థం కాదు. ఇన్నేళ్లుగా బాగా ఆడుతున్న చెన్నై బలం, చురుకుదనంకంటే ప్రతిభ, పట్టుదల కీలకమని నిరూపించింది. ముంబైతో మ్యాచ్‌లో తొలి బంతికే వికెట్ తీసిన పీయూష్ చావ్లాను చూస్తే ఇది అర్థమవుతుంది. అన్ని రంగాల్లో పటిష్టంగా కనిపిస్తున్న ఢిల్లీ, ఇవే అంశాల్లో ఎంతో అనుభవం ఉన్న చెన్నైనుంచి సవాల్ ఎదురు కానుంది.
గత మ్యాచ్‌లో రాజస్తాన్ చేతిలో ఓడినా చెన్నైకి కొన్ని సానుకూలతలు కూడా ఉన్నాయి. తొలి మ్యాచ్‌లో చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడిన డు ప్లెసిస్ రెండో మ్యాచ్‌లో దానికి పూర్తి భిన్నంగా దూకుడుగా చెలరేగిపోయాడు. వాట్సన్ కూడా ఫామ్‌లోకి వచ్చాడు. అవుట్ అయ్యాక అతనిలో అసహనం చూస్తే 217 పరుగుల లక్ష్యాన్ని ఛేదించగలమని భావించి ఉంటాడు. ఇలాంటిదే చెన్నైకి కావాలి. ముంబైపై అద్భుతంగా ఆడిన రాయుడు దురదృష్టవశాత్తూ గాయపడటం కొంత ఇబ్బందిగా మారింది. సుదీర్ఘ విరామం తర్వాత మైదానంలోకి దిగినా...తొలి మ్యాచ్‌లోనే అతను ఆడిన చూడచక్కటి షాట్లని బట్టి చూస్తే రాయుడు ఎంత సన్నద్ధంగా ఉన్నాడో అర్థమవుతుంది. ఢిల్లీతో పోలిస్తే బౌలింగ్‌లో చెన్నై బలహీనంగా కనిపిస్తోంది.
బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌లపై జడేజా సహా ఐదుగురు బౌలర్లనే వాడటం అంత మంచి వ్యూహం కాదు. గత మ్యాచ్‌లో సూపర్ ఓవర్‌లో గెలిచిన ఢిల్లీకి ఈ పిచ్ బాగా సహకరిస్తుంది. ముఖ్యంగా స్టొయినిస్‌కు ఇది మరో మంచి అవకాశం. తొలి ఓవర్లోనే రెండు వికెట్లు తీశాక అశ్విన్ గాయపడటం బాధాకరం. అతని స్థానంలో రెగ్యులర్ స్పిన్నర్‌కే అవకాశం ఇవ్వాలి. అమిత్ మిశ్రా అందుకు సరిపోతాడు. డీన్ జోన్స్ మరణ వార్త నన్ను బాగా కలచివేసింది. ఆటగాడిగా ఉన్నప్పుడు నేను తీసిన ఏకైక వికెట్ అతనిదే. కామెంటరీ సహచరుడిగానే కాకుండా బయట కూడా నాకు ఆప్తమిత్రుడు. ఎప్పుడూ నవ్వుతూ, నవి్వస్తూ ఉండేవాడు. సచిన్‌కంటే నువ్వే గొప్ప అంటూ ఒకసారి నవజ్యోత్ సిద్ధూను ఎగదోసి మేమిద్దరం పెద్ద రచ్చ చేసి తర్వాత బాగా నవ్వుకున్న ఘటన అందులో ఒకటి. డీన్...నువ్వు ఎప్పటికీ గుర్తుండిపోతావు.