బాడీ షేమింగ్‌ ట్రోల్స్‌.. కట్‌చేస్తే టీమిండియాలోకి రీఎంట్రీ! | Sarfaraz Khan 1st-Reaction-Re-Entry-Indian Team Vs SL Test Series | Sakshi
Sakshi News home page

Sarfaraz Khan: బాడీ షేమింగ్‌ ట్రోల్స్‌.. కట్‌చేస్తే టీమిండియాలోకి రీఎంట్రీ!

Aug 10 2026 11:56 AM | Updated on Aug 10 2026 1:08 PM

Sarfaraz Khan 1st-Reaction-Re-Entry-Indian Team Vs SL Test Series

Photo Credit: BCCI Twitter

శ్రీలంక‌తో టెస్టు సిరీస్‌కు గాయ‌ప‌డిన‌ సాయి సుద‌ర్శ‌న్ స్థానంలో 28 ఏళ్ల స‌ర్ఫ‌రాజ్ ఖాన్‌కు జ‌ట్టులో అవ‌కాశం క‌ల్పించింది. అయితే రెండేళ్ల త‌ర్వాత తిరిగి టెస్టు జ‌ట్టులో చోటు ద‌క్కించుకున్న స‌ర్ఫ‌రాజ్ ఖాన్ త‌న ఎంపిక‌పై తొలిసారి స్పందించాడు. త‌న బాడీషేమింగ్‌పై వ‌చ్చిన ట్రోల్స్‌ను చాలెంజ్‌గా తీసుకున్న స‌ర్ఫ‌రాజ్ ఖాన్ సీరియ‌స్ వ‌ర్కౌట్స్ చేసి బ‌రువు త‌గ్గిన కొత్త ఫొటోల‌ను పంచుకున్నాడు. 

తొలి ఫోటోలో తనను జట్టులోకి ఎంపిక చేసినందుకు కృత‌జ్ఞ‌తగా షేక్ హ్యాండ్ ఇస్తున్న ఎమోజీతో పాటు లవ్ ఇండియా సింబ‌ల్‌ను ట్యాగ్ చేశాడు. ఇక రెండో ఫొటోలో త‌న తండ్రి నౌష‌ద్ ఖాన్‌తో క‌లిసి ఉన్న క్లిప్‌ను పంచుకున్నాడు. స్వ‌త‌హాగా క్రికెట్ కోచ్ అయిన నౌషద్ ఖాన్ భార‌త్ త‌ర‌ఫున‌ త‌న కుమారుడి అంత‌ర్జాతీయ అరంగేట్రం కోసం చాలానే క‌ష్ట‌ప‌డ్డాడు. 2024లో త‌న కుమారుడు తొలిసారి జాతీయ జ‌ట్టుకు ఎంపికైన సంద‌ర్భంలో నౌష‌ద్ ఖాన్ హ‌ర్షం వ్య‌క్తం చేసిన ఫొటోలు అప్ప‌ట్లో వైర‌లయ్యాయి. 

తండ్రి పర్యవేక్షణలో..
అంతేకాదు ఫామ్‌లేమి, ఫిట్‌నెస్ స‌మ‌స్య‌ల‌తో జ‌ట్టులో చోటు కోల్పోయి ఇబ్బంది ప‌డుతున్న కొడుకుకు అండ‌గా నిలిచి, అత‌డు బ‌రువు త‌గ్గ‌డంలో ప్ర‌ధాన పాత్ర పోషించాడు. ఈ క్ర‌మంలో గాయ‌ప‌డ్డ సాయి సుద‌ర్శ‌న్ స్థానంలో జ‌ట్టుకు ఎంపిక కావ‌డంతో స‌ర్ఫ‌రాజ్ సంతోషానికి అవ‌దుల్లేకుండా పోయాయి. కాగా తండ్రితో క‌లిసి దిగిన ఫొటోకు సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. 13 గంట‌ల్లోనే 169 ల‌క్ష‌ల వ్యూస్ రావ‌డం విశేషం.

2024లో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు అనూహ్యంగా చోటు ద‌క్కించుకున్న స‌ర్ఫ‌రాజ్ ఖాన్ ఆ సిరీస్‌లో 371 ప‌రుగుల‌తో ఆక‌ట్టుకున్నాడు. ఇందులో మూడు హాఫ్ సెంచ‌రీలున్నాయి. సూప‌ర్ ఫామ్‌తో న్యూజీలాండ్‌తో సిరీస్‌కు కూడా ఎంపిక‌య్యాడు. అయితే తొలి మ్యాచ్‌లో 150 ప‌రుగుల ఇన్నింగ్స్‌తో ఆక‌ట్టుకున్న స‌ర్ఫ‌రాజ్ ఆ త‌ర్వాత వ‌రుస‌గా 11, 9, 0, 1.. విఫ‌లం కావ‌డంతో జ‌ట్టులో చోటు కోల్పోయాడు.

జురెల్‌, పడిక్కల్‌తో పోటీ
ఇదే స‌మ‌యంలో ధ్రువ్ జురెల్ ఎంట్రీ ఇవ్వ‌డం, ఆడిన ప్ర‌తీ మ్యాచ్‌లోనూ రాణించ‌డంతో స‌ర్ఫ‌రాజ్ ఖాన్ క్ర‌మంగా జ‌ట్టుకు దూర‌మ‌య్యాడు. అయితే తాజాగా సాయి సుద‌ర్శ‌న్ గాయంతో లంక‌తో సిరీస్‌కు దూర‌మ‌వ్వ‌డంతో అత‌డి స్థానంలో స‌ర్ఫ‌రాజ్ జ‌ట్టులోకి వ‌చ్చాడు. ధ్రువ్ జురెల్ ఇప్ప‌టికే జ‌ట్టులో ఉండ‌డంతో లంక‌తో తొలి టెస్టుకు స‌ర్ఫ‌రాజ్‌కు అవ‌కాశం రావ‌డం క‌ష్ట‌మే.

2024లో టీమిండియాలో చోటు కోల్పోయిన స‌ర్ఫ‌రాజ్ తొలుత ఫిట్‌నెస్‌పై దృష్టి సారించాడు. క‌ఠిన శిక్ష‌ణ‌తో బ‌రువు త‌గ్గిన స‌ర్ఫ‌రాజ్ పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. ఆ త‌ర్వాత 2025-26 రంజీ ట్రోఫీలో స‌ర్ఫ‌రాజ్ తొమ్మిది ఇన్నింగ్స్‌ల్లో ఒక డ‌బుల్ సెంచ‌రీ సాయంతో 429 ప‌రుగులు సాధించాడు. 

ఈ ప్ర‌ద‌ర్శ‌న‌తోనే స‌ర్ఫ‌రాజ్‌.. ఆరో స్థానం కోసం ధ్రువ్ జురెల్‌, దేవ‌ద‌త్ ప‌డిక్క‌ల్‌తో పోటీ ప‌డుతున్నాడు. ప్ర‌స్తుత ఫామ్ దృష్ట్యా ప‌డిక్క‌ల్ తొలి టెస్టులో ఆడే అవ‌కాశాలు మెండుగా క‌నిపిస్తున్నాయి. ఇక లంక‌తో తొలి టెస్టు గాలే వేదిక‌గా ఆగ‌స్టు 15 నుంచి ప్రారంభం కానుంది.

Read: భయపెడుతున్న గాయాలు.. గిల్ ఫిట్‌నెస్‌పై కీల‌క అప్‌డేట్‌!

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement