ఐపీఎల్ 19వ సీజన్‌లో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసం కొనసాగుతూనే ఉంది. బుధవారం ఎస్ఆర్‌హెచ్‌తో జరిగిన ఎలిమినేటర్ పోరులో వైభవ్ 29 బంతుల్లోనే 97 పరుగులు చేసి తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. తాజాగా నేడు గుజరాత్ టైటాన్స్‌తో క్వాలిఫయర్-2 పోరులో వైభవ్ ప్రళయం సృస్టిస్తాడా లేక విఫలమవుతాడా అన్నది చూడాలి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ వైభవ్ సూర్యవంశీని పొగడ్తలతో ముంచెత్తాడు.
ఎస్ఆర్‌హెచ్‌తో మ్యాచ్ సందర్భంగా హర్భజన్, సెహ్వాగ్‌లు కామెంటేటర్లుగా వ్యవహరించారు. మాటల సందర్భంలో వైభవ్ వేలంలోకి వస్తే ఎంత ఖర్చు చేసి అతడిని కొనుగోలు చేస్తావంటూ సెహ్వాగ్‌కు హర్భజన్ ప్రశ్న సంధించాడు. భజ్జీ ప్రశ్నకు ఏమాత్రం సంకోచించని సెహ్వాగ్.. ఒకవేళ వైభవ్ వేలంలోకి వస్తే గనుక రూ. 30 కోట్లు ఇచ్చి కొనుక్కుంటానంటూ ఆసక్తికర సమాధానమిచ్చాడు.
అదే సమయంలో పక్కనే ఉన్న మరో మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కూడా సెహ్వాగ్ ఇచ్చే ఆఫర్‌కు సమాన మొత్తాన్ని తాను చెల్లిస్తానంటూ బదులిచ్చాడు. ఇక వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర బ్యాటింగ్ దృష్ట్యా అతడిని భారత సీనియర్ జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్లు పెరిగిపోతున్నాయి. అయితే అతను ఐపీఎల్‌లో ఎంట్రీ ఇచ్చి రెండేళ్లు కూడా కాకపోవడం, పైగా 15 ఏళ్లే ఉండడంతో జాతీయ జట్టులోకి అతడి ఎంపికకు ఇంకా సమయం ఉందంటూ బీసీసీఐ పేర్కొంది.
అయితే అతడి ప్రతిభను ప్రపంచవ్యాప్తంగా తెలిపేందుకు ఇండియా-ఎ జట్టుకు వైభవ్ సూర్యవంశీని ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. తిలక్ వర్మ నేతృత్వంలో వచ్చే నెలలో శ్రీలంకలో జరగనున్న ట్రై సిరీస్‌లో ఇండియా-ఎ తరఫున సూర్యవంశీ ఆడనున్నాడు. ఈ సిరీస్‌లో వైభవ్ సత్తా చాటితే గనుక త్వరలో భారత సీనియర్ జట్టులోకి వచ్చే అవకాశం కూడా లేకపోలేదు.
ఐపీఎల్ 18వ సీజన్‌లోనే కొన్ని మంచి ఇన్నింగ్స్‌లు ఆడిన వైభవ్ సూర్యవంశీ తన ఇన్నింగ్స్‌లు గాలివాటం కాదని తాజా సీజన్ ద్వారా నిరూపించాడు. ఈ సీజన్‌లో 15 మ్యాచ్‌లాడిన వైభవ్ సూర్యవంశీ 242 స్ట్రైక్‌రేట్‌తో 680 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ, నాలుగు అర్థసెంచరీలున్నాయి. ఎస్ఆర్‌హెచ్‌తో జరిగిన ఎలిమినేటర్ పోరులో 29 బంతుల్లోనే 97 పరుగులు చేసిన వైభవ్ తృటిలో క్రిస్ గేల్ (30 బంతుల్లో సెంచరీ) ప్రపంచ రికార్డు సాధించే అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు.
చదవండి: IPL 2026: బీసీసీఐ కీలక ప్రకటన


