టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ అభిమానులకు శుభవార్త చెప్పాడు. తన క్రికెటింగ్ కెరీర్‌లో నూతన అధ్యాయాన్ని మొదలుపెట్టనున్నట్లు తెలిపాడు. తాను ఇంకా ఫిట్‌గానే ఉన్నానని.. ఆటగాడిగా కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నాడు. లెజెండ్స్ లీగ్ క్రికెట్(ఎల్‌ఎల్‌సీ)లో భాగం కానున్నట్లు ధావన్ వెల్లడించాడు.
వినోదం పంచేందుకు సిద్ధం
రిటైర్మెంట్ తర్వాత కూడా తాను ఆటగాడిగా ముందుకు సాగేందుకు దొరికిన గొప్ప అవకాశం ఇది అని పేర్కొన్నాడు. క్రికెట్ తన జీవితంలో భాగమని.. త్వరలోనే తన స్నేహితులతో కలిసి మళ్లీ బ్యాట్ పట్టి మైదానంలో దిగనున్నట్లు తెలిపాడు. తన అభిమానులకు వినోదం పంచేందుకు సిద్ధంగా ఉన్నానని.. వారితో కలిసి కొత్త జ్ఞాపకాలు పోగు చేసుకునేందుకు ఆతురతగా ఎదురుచూస్తున్నట్లు గబ్బర్ తెలిపాడు.
రిటైర్మెంట్ అనంతరం
ఇందుకు సంబంధించి శిఖర్ ధావన్ పేరిట ఎల్‌ఎల్‌సీ సోమవారం ప్రకటన విడుదల చేసింది. కాగా తాను అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ధావన్ శనివారం ప్రకటించిన విషయం తెలిసిందే. పద్నాలుగేళ్లకు పైగా టీమిండియా క్రికెటర్‌గా కొనసాగిన ఈ మాజీ ఓపెనర్‌కు గత రెండేళ్లుగా అవకాశాలు కరువయ్యాయి. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ జోడీగా శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్ జట్టులో పాతుకుపోగా.. గబ్బర్‌కు నిరాశే ఎదురైంది.
ఈ నేపథ్యంలో 38 ఏళ్ల ధావన్ అంతర్జాతీయ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే, క్రికెటర్‌గా మాత్రం తాను కొనసాగుతానని.. అందుకు లెజెండ్స్ లీగ్ రూపంలో కొత్త అవకాశం వచ్చిందని తాజాగా వెల్లడించాడు. కాగా 2010లో భారత్ తరఫున అరంగేట్రం చేసిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్ 2022లో తన చివరి ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడాడు. మొత్తంగా టీమిండియా తరఫున 34 టెస్టులు, 167 వన్డేలు, 68 టీ20లు ఆడి ఆయా ఫార్మాట్లలో 2315, 6793, 1759 పరుగులు సాధించాడు ధావన్.
లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో ఆరు జట్లు
టీ20 ఫార్మాట్లో నిర్వహిస్తోన్న లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో భిల్వారా కింగ్స్, గుజరాత్ జెయింట్స్, ఇండియా క్యాపిటల్స్, మణిపాల్ టైగర్స్, సదరన్ సూపర్‌స్టార్స్, అర్బనైజర్స్ హైదరాబాద్ పేరిట ఆరు జట్లు పాల్గొంటున్నాయి. భారత మాజీ స్టార్లు హర్భజన్ సింగ్, సురేశ్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, మహ్మద్ కైఫ్, పార్థివ్ పటేల్, శ్రీశాంత్ సహా విదేశీ ఆటగాళ్లు క్రిస్ గేల్, ఆరోన్ ఫించ్, ఉపుల్ తరంగ, డ్వేన్ స్మిత్, మార్టిన్ గప్టిల్ తదితరులు భాగమవుతున్నారు. తాజాగా శిఖర్ ధావన్ కూడా ఈ జాబితాలో చేరాడు. అయితే, అతడు ఏ జట్టుకు ఆడనున్నది తెలియాల్సి ఉంది. సెప్టెంబరులో ఈ లీగ్ ఆరంభం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment