బాబర్‌ను దించి అగ్రపీఠాన్ని అధిరోహించనున్న గిల్‌ | Shubman Gill Is All Set To Become New No 1 ODI Batter In ICC Rankings | Sakshi
Sakshi News home page

బాబర్‌ను దించి అగ్రపీఠాన్ని అధిరోహించనున్న గిల్‌

Published Fri, Feb 14 2025 5:39 PM | Last Updated on Fri, Feb 14 2025 5:50 PM

Shubman Gill Is All Set To Become New No 1 ODI Batter In ICC Rankings

టీమిండియా వైస్ కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ (Shubman Gill) ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో (ICC ODI Rankings) అగ్రపీఠాన్ని అధిరోహించనున్నాడు. ఈ వారం ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉన్న గిల్‌ (781 రేటింగ్‌ పాయింట్లు).. వచ్చే బుధవారం వెలువడే ర్యాంకింగ్స్‌లో టాప్‌ ర్యాంక్‌కు చేరుకోనున్నాడు. ఇప్పటిదాకా టాప్‌ ర్యాంక్‌లో ఉన్న పాక్‌ ఆటగాడు బాబర్‌ ఆజమ్‌ (Babar Azam) (786).. ఇవాళ (ఫిబ్రవరి 14) న్యూజిలాండ్‌తో జరుగుతున్న ట్రై సిరీస్‌ ఫైనల్లో విఫలమయ్యాడు. బాబర్‌కు గిల్‌కు మధ్య కేవలం ఐదు పాయింట్ల వ్యత్యాసం మాత్రమే ఉంది. 

ఈ బుధవారం ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేలో గిల్‌ సెంచరీ చేశాడు. ఈ వారం ర్యాంకింగ్స్‌లో ఇది పరిగణలోకి రాలేదు. కాబట్టి వచ్చే వారం ర్యాంకింగ్స్‌లో ఈ సెంచరీ తాలుకా పాయింట్లు గిల్‌కు యాడ్‌ అవుతాయి. దీంతో ఛాంపియన్స్‌ ట్రోఫీ తొలి మ్యాచ్‌కు (బంగ్లాదేశ్‌తో) ముందే గిల్‌ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో బాబర్‌ను కిందకు దించి టాప్‌ ర్యాంక్‌కు చేరుకుంటాడు.

రేసులో రోహిత్‌ కూడా..!
వన్డే ర్యాంకింగ్స్‌ టాప్‌ ర్యాంక్‌ రేసులో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (Rohit Sharma) కూడా ఉన్నాడు. ఈ వారం ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలో ఉన్న రోహిత్‌.. ఛాంపియన్స్‌ ట్రోఫీ తొలి మ్యాచ్‌లో మంచి ఇన్నింగ్స్‌ ఆడితే గిల్‌ను సైతం వెనక్కునెట్టి టాప్‌ ర్యాంక్‌కు చేరుకుంటాడు. ప్రస్తుతం టాప్‌ ర్యాంక్‌లో ఉన్న బాబర్‌కు రోహిత్‌కు మధ్య కేవలం 13 పాయింట్ల వ్యత్యాసం మాత్రమే ఉంది. బాబర్‌ ఖాతాలో 786 పాయింట్లు ఉండగా.. రోహిత్‌ ఖాతాలో 773 పాయింట్లు ఉన్నాయి.

చరిత్ర సృష్టించిన బాబర్‌
న్యూజిలాండ్‌తో జరుగుతున్న ట్రై సిరీస్‌ ఫైనల్లో విఫలమైనా పాక్‌ మాజీ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ చరిత్ర సృష్టించాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 6000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు హాషిమ్‌ ఆమ్లాతో కలిసి రికార్డు షేర్‌ చేసుకున్నాడు. ఆమ్లా, బాబర్‌కు తలో 123 ఇన్నింగ్స్‌ల్లో 6000 పరుగులు పూర్తి చేశారు.  

వన్డేల్లో అత్యంత వేగంగా 6000 పరుగులు పూర్తి చేసిన టాప్‌-5 ఆటగాళ్ల జాబితాలో బాబర్‌, ఆమ్లా తర్వాతి స్థానాల్లో విరాట్‌ కోహ్లి, కేన్‌ విలియమ్సన్‌, డేవిడ్‌ వార్నర్‌ ఉన్నారు. విరాట్‌ 136 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయిని తాకితే.. కేన్‌ మామ, వార్నర్‌ భాయ్‌ తలో 139 ఇన్నింగ్స్‌ల్లో 6000 పరుగుల క్లబ్‌లో చేరారు.

ట్రై సిరీస్‌ ఫైనల్‌ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేస్తుంది. 41.5 ఓవర్ల అనంతరం ఆ జట్టు 6 వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసింది. పాక్‌ ఇన్నింగ్స్‌లో ఇప్పటివరకు ఒక్క హాఫ్‌ సెంచరీ కూడా నమోదు కాలేదు. రిజ్వాన్‌ 46, సల్మాన్‌ అఘా 45, తయ్యబ్‌ తాహిర్‌ 38, బాబర్‌ ఆజమ్‌ 29 పరుగులు చేశారు. ఖుష్దిల్‌ షా (6), ఫమీమ్‌ అష్రఫ్‌ (1) క్రీజ్‌లో ఉన్నారు. న్యూజిలాండ్‌ బౌలర్లలో విలియమ్‌ ఓరూర్కీ, మైఖేల్‌ బ్రేస్‌వెల్‌ తలో 2 వికెట్లు పడగొట్టగా.. నాథన్‌ స్మిత్‌, జేకబ్‌ డఫీ చెరో వికెట్‌ దక్కించుకున్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement