ICC ODI Batting Rankings: టీమిండియా యువ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రపీఠానికి మరింత చేరువయ్యాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో 823 రేటింగ్ పాయింట్లు సాధించాడు. ప్రస్తుతం వరల్డ్ నంబర్ 1 బ్యాటర్‌గా ఉన్న పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం కంటే కేవలం ఆరు పాయింట్లు వెనుకబడి ఉన్నాడు.
డెంగ్యూ జ్వరం కారణంగా
కాగా డెంగ్యూ జ్వరం కారణంగా భారత ఓపెనింగ్ బ్యాటర్ వన్డే వరల్డ్‌కప్-2023 ఆరంభ మ్యాచ్‌లకు దూరమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మెరుగైన చికిత్స అనంతరం పూర్తి ఫిట్‌నెస్ సాధించిన ఈ రైట్‌హ్యాండ్ బ్యాటర్ అహ్మదాబాద్‌లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌తో తిరిగి జట్టుతో చేరాడు.
చిరకాల ప్రత్యర్థి పాక్‌తో మ్యాచ్‌లో కేవలం 16 పరుగులకే పరిమితమైన శుబ్‌మన్ గిల్.. బంగ్లాదేశ్‌పై అర్ధ శతకం(53) సాధించి తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. ఇప్పటి వరకు మొత్తంగా మూడు ఇన్నింగ్స్‌లో కలిపి 95 పరుగులతో రాణించాడు. ఈ క్రమంలో వన్డేల్లో బాబర్ ఆజం నంబర్ వన్ ర్యాంకును ఆక్రమించే క్రమంలో మరో ముందడుగు వేశాడు.
దుమ్ములేపిన డికాక్, క్లాసెన్
ఇక ఐసీసీ బుధవారం ప్రకటించిన వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో సౌతాఫ్రికా స్టార్ బ్యాటర్లు క్వింటన్ డికాక్, హెన్రిచ్ క్లాసెన్ దుమ్ములేపారు. బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా వన్డే ప్రపంచకప్-2023లో మూడో సెంచరీ నమోదు చేసిన డికాక్ ఏకంగా మూడు స్థానాలు ఎగబాకి మూడో ర్యాంకు సాధించాడు.
అదే విధంగా.. ఆరంభం నుంచి అద్భుత ఇన్నింగ్స్ ఆడుతున్న క్లాసెన్ బంగ్లాదేశ్‌పై 90 పరుగులు చేసి తాజా ర్యాంకింగ్స్‌లో నాలుగు స్థానాలు మెరుగుపరచుకుని నాలుగో ర్యాంకు సొంతం చేసుకున్నాడు.
కోహ్లి, రోహిత్ ఇలా
ఇక బాబర్ ఆజం(పాకిస్తాన్- 829 పాయింట్లు), శుబ్‌మన్ గిల్(ఇండియా- 823), క్వింటన్ డికాక్(సౌతాఫ్రికా- 769), హెన్రిచ్ క్లాసెన్(సౌతాఫ్రికా- 756)లతో పాటు ఆస్ట్రేలియా బ్యాటర్ డేవిడ్ వార్నర్(747 పాయింట్లు) టాప్-5లో చోటు దక్కించుకున్నాడు.
మరోవైపు.. టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి రెండు స్థానాలు కోల్పోయి వార్నర్ తర్వాతి ర్యాంకులో నిలిచాడు. భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఒక స్థానం మెరుగుపరచుకుని ఎనిమిదో ర్యాంకు సాధించాడు.
చదవండి: రుత్‌రాజ్ విధ్వంసకర శతకం.. కేవలం 51 బంతుల్లోనే
Comments
Please login to add a commentAdd a comment