
ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో పెద్దగా మార్పులేమీ చోటు చేసుకోలేదు. ప్రపంచవాప్తంగా ఉన్న ఆటగాళ్లంతా ఐపీఎల్‌తో బిజీగా ఉండగా.. పాకిస్తాన్, న్యూజిలాండ్ మాత్రమే వన్డే సిరీస్ ఆడాయి. ఈ నేపథ్యంలో ఆ రెండు జట్లకు చెందిన కొందరు ఆటగాళ్ల ర్యాంక్‌లు మాత్రమే మారాయి.
బ్యాటింగ్‌లో టీమిండియా ప్రిన్స్ శుభ్‌మన్ గిల్ టాప్ ర్యాంక్‌లో కొనసాగుతుండగా.. పాకిస్తాన్ ఆటగాడు బాబర్ ఆజమ్, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. భారత్ నుంచి విరాట్ (5), శ్రేయస్ అయ్యర్ (8) టాప్-10లో కొనసాగుతున్నారు. న్యూజిలాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 72 పరుగులు చేసిన పాక్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ రెండు స్థానాలు మెరుగుపర్చుకుని 21వ స్థానానికి చేరగా.. న్యూజిలాండ్ కెప్టెన్ మైఖేల్ బ్రేస్‌వెల్ ఏకంగా 12 స్థానాలు మెరుగుపర్చుకుని 89 స్థానానికి చేరాడు.
బౌలర్ల ర్యాంకింగ్స్‌లో శ్రీలంక స్పిన్నర్ మహీశ్ తీక్షణ టాప్‌లో కొనసాగుతుండగా.. భారత్ రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, సౌతాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్ రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. భారత్ నుంచి కుల్దీప్‌తో పాటు రవీంద్ర జడేజా (9) ఒక్కడే టాప్-10లో ఉన్నాడు. పాక్‌తో సిరీస్‌లో 3 మ్యాచ్‌ల్లో ఓ ఐదు వికెట్ల ప్రదర్శన సహా 10 వికెట్లు తీసిన న్యూజిలాండ్ పేసర్ బెన్ సియర్స్ ఏకంగా 64 స్థానాలు మెరుగపర్చుకుని 100వ స్థానానికి చేరాడు. పాక్ పేసర్ నసీం షా ఐదు స్థానాలు మెరుగుపర్చుకుని 43వ స్థానానికి ఎగబాకాడు.
ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఆఫ్ఘనిస్తాన్ స్టార్ ఆల్‌రౌండర్ అజ్మతుల్లా ఒమర్‌జాయ్ టాప్ ప్లేస్‌లో కొనసాగుతుండగా.. మరో ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు మహ్మద్ నబీ రెండో స్థానంలో నిలిచాడు. జింబాబ్వే ఆటగాడు సికందర్ రజా మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. భారత్ నుంచి టాప్-10లో రవీంద్ర జడేజా (9) ఒక్కడే ఉన్నాడు. జడ్డూ ఓ స్థానం మెరుగుపర్చుకుని 10 నుంచి 9కి చేరాడు. పాక్‌తో జరిగిన సిరీస్‌లో 85 పరుగులు చేసి 2 వికెట్లు తీసిన మైఖేల్ బ్రేస్‌వెల్ (5) రెండు స్థానాలు మెరుగుపర్చుకుని టాప్-5లోకి వచ్చాడు.