భారత అభిమానులచే భవిష్యత్తు సూపర్ స్టార్‌గా, జూనియర్ విరాట్ కోహ్లిగా, మరో పరుగుల యంత్రంగా కీర్తించబడిన టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్, నెలలు తిరగకుండగానే ఏ నోళ్లతో అయితే కీర్తించబడ్డాడో అదే నోళ్లతో దూషించబడుతున్నాడు. ఐపీఎల్ 2023లో ఆకాశమే హద్దుగా చెలరేగి, ఏకంగా 3 సెంచరీలు బాది పరుగుల వరద (17 మ్యాచ్‌ల్లో 3 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీల సాయంతో 890 పరుగులు) పారించిన గిల్.. అంతర్జాతీయ స్థాయిలో దేశం కోసం ఆడాల్సి వచ్చే సరికి వరుస వైఫల్యాల బాట పట్టి తేలిపోతున్నాడు. ఇదే భారత అభిమానులను ఆగ్రహానికి గురి చేస్తుంది. దీంతో వారు పట్టలేని కోపంతో గిల్‌పై దూషణల పర్వానికి దిగుతున్నారు.
పొగిడిన నోళ్లతోనే దుర్భాషలాడుతున్నారు. ఏమాత్రం ములాజా లేకుండా జట్టు నుండి తీసిపారేయాలని డిమాండ్ చేస్తున్నారు. దేశం తరఫున ఆడేప్పుడు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చకపోతే మహామహులకే తప్పలేదు, ఇతనెంత అంటూ ఘాటైన కామెంట్లు చేస్తున్నారు. గిల్‌ను త్వరలో జరుగనున్న ఆసియా కప్, వన్డే వరల్డ్‌కప్‌లకు కూడా ఎంపిక చేయొద్దని సూచిస్తున్నారు. ఐపీఎల్ ఇచ్చిన సక్సెస్‌తో విర్రవీగుతున్నాడు, కొద్ది రోజులు పక్కకు కూర్చోబెడితే టీమిండియాలో స్థానం విలువ తెలిసొస్తుందని అంటున్నారు. ప్రస్తుతం భారత రిజర్వ బెంచ్ కూడా బలంగా ఉంది, గిల్‌కు ప్రత్యామ్నాయంగా రుతురాజ్‌ను ఎంపిక చేయాలని సూచిస్తున్నారు. ఐపీఎల్-2023 తర్వాత గిల్ గణాంకాలను చూపిస్తూ సోషల్‌మీడియా వేదికగా ఏకి పారేస్తున్నారు.
కాగా, గిల్‌పై అభిమానుల ఆగ్రహానికి నిజంగానే అర్ధం ఉంది. ఐపీఎల్ 2023లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచిన గిల్.. నాటి నుంచి నిన్న విండీస్‌తో మూడో టీ20 వరకు టీమిండియా తరఫున 11 మ్యాచ్‌లు ఆడి కేవలం 218 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒకే ఒక్క అర్ధ సెంచరీ ఉంది. ఐపీఎల్ తర్వాత డబ్ల్యూటీసీ ఫైనల్లో రెండు ఇన్నింగ్స్‌ల్లో 31 పరుగులు (13, 18) చేసిన గిల్.. ప్రస్తుత విండీస్ పర్యటనలో తొలి టెస్ట్‌లో 6, రెండో టెస్ట్‌లో 39 పరుగులు (10, 29 నాటౌట్), తొలి వన్డేలో 7, రెండో వన్డేలో 34, మూడో వన్డేలో 85 పరుగులు, తొలి టీ20లో 3, రెండో టీ20లో 7, మూడో టీ20లో 6 పరుగులు చేశాడు.
గిల్ చేసిన ఈ స్కోర్లు చూసే పొగిడిన నోళ్లు దూషిస్తున్నాయి. స్టార్ ఆటగాడైన గిల్ వరుసగా ఇన్ని మ్యాచ్‌ల్లో విఫలం కావడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే అతనిపై భారీ స్థాయిలో దుమ్మెత్తిపోస్తున్నారు. గిల్ సరిగా ఆడకపోవడం టీమిండియాపై ప్రభావం చూపుతుందని, పసికూన విండీస్ చేతిలో వరుస పరాజయాలే ఇందుకు నిదర్శనమని అంటున్నారు. మొత్తంగా ఐపీఎల్ ఆడినప్పుడు గిల్‌లో కనిపించిన కసి, దేశం కొరకు ఆడుతున్నప్పుడు కనిపించడం లేదని మండిపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment