కోచ్ మారిజైన్
టోక్యో: భారత మహిళల హాకీ ప్రధాన కోచ్ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు జోర్డ్ మారిజైన్ స్పష్టం చేశాడు. టోక్యో ఒలింపిక్స్‌లో భాగంగా బ్రిటన్‌తో జరిగిన కాంస్య పతక పోరులో భారత్ ఓటమి అనంతరం మారిజైన్ ట్విటర్ వేదికగా ప్రకటించాడు.
''బ్రిటన్‌తో జరిగిన మ్యాచ్ నా చివరి అసైన్‌మెంట్. ఈరోజుతో భారత్ మహిళల హాకీ టీంతో నా ప్రయాణం ముగిసింది.ఇంతకాలం మాకు మద్దతిచ్చిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు. మేం ఈరోజు ఒలింపిక్స్‌లో మెడల్ గెలవలేకపోవచ్చు.. కానీ అంతకంటే పెద్ద విజయాన్ని అందుకున్నాం. అదే అభిమానుల ప్రేమాభిమానాలు. ప్రాభవం కోల్పోతున్న స్థితి నుంచి పతకం కోసం పోరాడే స్థాయికి చేరుకున్నాం. ఒలింపిక్స్‌లో భారత మహిళల హాకీ జట్టు అందరి అంచనాలకు భిన్నంగా రాణించింది. వారి ఆటతీరుతో ఈరోజు లక్షలాది అమ్మాయిల మనసు గెలుచుకున్నాం'' అంటూ ఉద్వేగంతో ట్వీట్ చేశాడు.
We did not win a medal, but I think we have won something bigger. We have made Indians proud again and we inspired millions of girls that dreams CAN come true as long as you work hard for it and believe it! Thanks for all the support! 🇮🇳
— Sjoerd Marijne (@SjoerdMarijne) August 6, 2021
కాగా నెదర్లాండ్స్‌కు చెందిన మారిజైన్ 2017 నుంచి భారత మహిళల హాకీ జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. అతని పనితీరుపై ముగ్దులైన భారత హాకీ సంఘం మెన్స్ టీమ్‌కు కోచ్‌గా వ్యవహరించమని అడిగింది. 2018 కామన్‌వెల్త్ గేమ్స్ తర్వాత మళ్లీ టీమిండియా మహిళల హాకీ జట్టును మరింత మెరుగ్గా తయారు చేసే పనిలో పడ్డాడు. కరోనా విరామం అనంతరం.. 2019లో ఒలింపిక్స్ క్వాలిఫయింగ్‌లో భాగంగా అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో 6-5తో అద్భుత ప్రదర్శన చేసిన అమ్మాయిలు ఒలింపిక్స్‌కుఅర్హత సాధించారు.
అయితే ఎలాంటి అంచనాలు లేకుండా టోక్యో బరిలో దిగి, ఆద్యంతం గట్టి పోటీనిచ్చిన రాణి రాంపాల్ సేనకు యావత్ భారతావని మద్దతుగా నిలిచింది. 41 ఏళ్ల తర్వాత తొలిసారి ఒలింపిక్ సెమీస్‌కు చేరి చరిత్ర సృష్టించింది. తాజాగా శుక్రవారం బ్రిటన్‌తో జరిగిన కాంస్య పతక పోరు మ్యాచ్‌లో 4-3 తేడాతో ఓటమి పాలైంది. హోరాహోరీగా సాగిన పోరులో పోరాట పటిమ ప్రదర్శించినప్పటికీ.. చివరి క్వార్టర్‌లో ఫలితం తారుమారుకావడంతో పతకం గెలవలేకపోయింది. కాంస్య పతక పోరులో భాగంగా మ్యాచ్ ఆరంభమైన కొద్ది నిమిషాల్లోనే రెండు గోల్స్ చేసి బ్రిటన్ గట్టి పోటీనివ్వగా.. పడిలేచిన కెరటంలా దూసుకుకొచ్చిన రాణి సేన రెండో క్వార్టర్ ముగిసే సరికి చివరి 5 నిమిషాల వ్యవధిలో మూడు గోల్స్ చేసి సత్తా చాటింది. భారత్ తరఫున గుర్జీత్ కౌర్ 2, వందనా కటారియా ఒక గోల్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment