Sri Lanka vs New Zealand, 2nd Test Day 2 Score Final Update: న్యూజిలాండ్‌తో గాలె వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. తొలిరోజు దినేశ్ చండీమల్ శతకం సాధించగా, రెండో రోజు ఆటలో కమిందు మెండిస్ (250 బంతుల్లో 182 నాటౌట్; 16 ఫోర్లు, 4 సిక్స్‌లు), కుశాల్ మెండిస్ (149 బంతుల్లో 106 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) అజేయ సెంచరీలతో కదంతొక్కారు. దీంతో ఆతిథ్య శ్రీలంక జట్టు తొలి ఇన్నింగ్స్‌ను 163.4 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 602 పరుగుల భారీస్కోరు వద్ద డిక్లేర్ చేసింది.
ఓవర్‌నైట్ స్కోరు 306/3తో శుక్రవారం రెండో రోజు ఆట కొనసాగించిన లంక బ్యాటర్లలో ఎంజెలో మాథ్యూస్ (185 బంతుల్లో 88; 7 ఫోర్లు) తన క్రితం రోజు స్కోరుకు 10 పరుగులు జోడించి నిష్క్రమించాడు. దీంతో తొలి సెషన్ ఆరంభంలోనే 328 పరుగుల వద్ద నాలుగో వికెట్ కూలింది.
ఈ దశలో మరో ఓవర్‌నైట్ బ్యాటర్ కమిందు మెండిస్ కు జతయిన కెప్టెన్ ధనంజయ డిసిల్వా (80 బంతుల్లో 44; 3 ఫోర్లు, 1 సిక్స్) కుదురుగా ఆడటంతో పర్యాటక బౌలర్లకు మళ్లీ కష్టాలు తప్పలేదు. ఈ జోడీని విడగొట్టేందుకు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. జట్టు స్కోరు 400 మైలురాయి దాటాక ఎట్టకేలకు తొలిసెషన్ ముగిసే దశలో ధనంజయను ఫిలిప్స్ పెవిలియన్ చేర్చాడు.
అరుదైన రికార్డు
అతను అవుటైన 402 స్కోరువద్దే లంచ్ బ్రేక్‌కు వెళ్లారు. కుశాల్ మెండిస్ క్రీజులోకి రాగా... రెండో సెషన్ మొదలైన కాసేపటికే కమిందు మిండిస్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఈ మిడిలార్డర్ బ్యాటర్ అరుదైన రికార్డును కొనసాగిస్తున్నాడు.
అరంగేట్రం చేసిన టెస్టు నుంచి ఇప్పటివరకు (తాజా 8వ టెస్టు) ప్రతి మ్యాచ్‌లో సెంచరీ, లేదంటే అర్ధసెంచరీ చేసిన బ్యాటర్‌గా ఘనతకెక్కాడు. మరోవైపు అతనికి జతయిన కుశాల్ కూడా కివీస్ బౌలర్లను దీటుగా ఎదుర్కోవడంతో రెండో సెషన్ అసాంతం కష్టపడినా వికెట్ తీయలేకపోయింది. 519/5 స్కోరు వద్ద రెండో సెషన్ ముగిసింది.
602/5 వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్
ఆ తర్వాత మొదలైన మూడో సెషన్‌లోనూ ఈ జోడీ క్రీజు వదలకపోవడంతో పాటు పరుగుల్ని అవలీలగా సాధించింది. కమిందు 150 పరుగులు పూర్తి చేసుకోగా... కుశాల్ సెంచరీ సాధించాడు. జట్టు స్కోరు 602/5 వద్ద ఉండగా ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశారు. కుశాల్, కమిందు ఇద్దరు అబేధ్యమైన ఆరో వికెట్‌కు సరిగ్గా 200 పరుగులు జోడించారు.
గ్లెన్ ఫిలిప్స్ 3 వికెట్లు తీశాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన న్యూజిలాండ్ ఆట నిలిచే సమయానికి 14 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 22 పరుగులు చేసింది. శ్రీలంక కంటే 580 పరుగులు వెనుకబడి ఉంది. ఇరు జట్ల మధ్య శనివారం మూడో రోజు మొదలైంది. కాగా తొలి టెస్టులోశ్రీలంక కివీస్‌ను 63 పరుగుల తేడాతో ఓడించిన విషయం తెలిసిందే.
చదవండి: అలా జరిగితే గంభీర్ విశ్వరూపం చూస్తారు: బంగ్లాదేశ్ క్రికెటర్
Comments
Please login to add a commentAdd a comment