
South Africa Wins 2nd T20: శ్రీలంకతో కొలంబోలో జరిగిన రెండో టీ20లో దక్షిణాఫ్రికా 9 వికెట్లతో నెగ్గింది. తద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను 2–0తో సొంతం చేసుకుంది. తొలుత ఆతిథ్య శ్రీలంక 18.1 ఓవర్లలో 103 పరుగులకు ఆలౌటైంది. మార్క్‌రమ్, షమ్సీ చెరో మూడు వికెట్లు తీశారు. ఇక పర్యాటక దక్షిణాఫ్రికా 14.1 ఓవర్లలో వికెట్ నష్టపోయి 105 పరుగులు చేసి విజయం సాధించింది.
డికాక్ (48 బంతుల్లో 58 నాటౌట్; 7 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 3 వికెట్లు తీసి సత్తా చాటిన తబ్రేజ్ షమ్సీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇక సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్‌లో గెలుపొందడం గురించి ప్రొటీస్ జట్టు కెప్టెన్ కేశవ్ మహరాజ్ మాట్లాడుతూ.. ఇదంతా జట్టు సమిష్టి కృషి వల్లే సాధ్యమైందని హర్షం వ్యక్తం చేశాడు. సానుకూల దృక్పథంతో ప్రణాళికలు పక్కాగా అమలు చేసి అనుకున్న ఫలితం సాధించినట్లు పేర్కొన్నాడు.
శ్రీలంక ఇన్నింగ్స్: 103-10 (18.1 ఓవర్లు)
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: 105-1 (14.1 ఓవర్లు)