దుబాయ్: జూన్ నెలకు గాను ‘ప్లేయర్ ఆఫ్ ద మంత్’ నామినీలను ఐసీసీ ప్రకటించింది. కాగా టీమిండియా మహిళల జట్టు నుంచి భారత టీనేజ్ బ్యాట్స్‌వుమెన్ షఫాలీ వర్మ, ఆల్‌రౌండర్ స్నేహ్ రాణా ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్’ మహిళల కేటగిరీ అవార్డుకు నామినేట్ అయ్యారు. ఇంగ్లండ్‌తో జరిగిన ఏకైక టెస్టులో రాణించడం ద్వారా గత నెల అవార్డు రేసులో ఉన్నారు. అరంగేట్రం చేసిన టెస్టులోనే వీళ్లిద్దరు అర్ధసెంచరీలతో కదంతొక్కి భారత జట్టును ‘డ్రా’తో గట్టెక్కించారు.
ఇక పురుషుల కేటగిరీలో న్యూజిలాండ్ క్రికెటర్లు డెవన్ కాన్వే, జేమీసన్, దక్షిణాఫ్రికా ప్లేయర్ డికాక్ అవార్డు రేసులో ఉన్నారు. టీమిండియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో కైల్ జేమిసన్ తొలి ఇన్నింగ్స్‌లో ఐదు, రెండో ఇన్నింగ్స్‌లో రెండు మొత్తంగా ఏడు వికెట్లు తీసి విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్, టీమిండియాతో డబ్ల్యూటీసీ ఫైనల్లో బ్యాటింగ్‌లో డెవన్ కాన్వే మెరిశాడు. కాగా ఈసారి టీమిండియా పురుషుల జట్టు నుంచి ఒక్కరు కూడా ఎంపికవలేదు.
ఇక షఫాలీ వర్మ టీ 20 ఫార్మాట్లో ఆకట్టుకోవడంతో.. ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులు, వన్డేల్లో అరంగేట్రం చేసింది. ఈ సిరీస్‌లోనూ ఆకట్టుకోవడంతో పాటు ఏకైక టెస్టులో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచింది. ఈ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ హాఫ్‌సెంచరీలతో ఆకట్టుకుంది. దాంతో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ అర్థ సెంచరీలు చేసిన మొదటి భారత బ్యాట్స్‌వుమెన్‌గా నిలిచింది. ఆల్‌రౌండర్ స్నేహ్రాణా ఇంగ్లండ్‌తో జరిగిన ఏకైక టెస్టును డ్రా చేయడంలో కీలక పాత్ర పోషించింది. 154 బంతుల్లో 80 పరుగులు చేసి ఇంగ్లండ్ బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టింది. చివరకు ఇంగ్లండ్ టీంకు విజయాన్ని దూరం చేసింది. బౌలింగ్‌లోనూ రాణించి నాలుగు వికెట్లు పడగొట్టింది. అవార్డుకు నామినేట్ అయిన ఇంగ్లండ్ బౌలర్సోఫీ ఎకిల్‌స్టోన్ 8 వికెట్లు పడగొట్టింది.
Comments
Please login to add a commentAdd a comment