మరీ ఇంత స్వార్థమా?.. కోచ్‌ ఇలా చేయడం తప్పే: డీకే ఫైర్‌ | 'So Wrong': Dinesh Karthik Fumes As Tamil Nadu Coach Throws Captain Under The Bus | Sakshi
Sakshi News home page

ఇంత స్వార్థం పనికిరాదు.. కోచ్‌ ఇలా చేయడం తప్పే: డీకే ఆగ్రహం

Published Tue, Mar 5 2024 11:56 AM | Last Updated on Tue, Mar 5 2024 12:56 PM

So Wrong: Dinesh Karthik Fumes As Tamil Nadu Coach Throws Captain Under The Bus - Sakshi

DK Fumes As Tamil Nadu Coach 'Throws Captain Under The Bus': తమిళనాడు క్రికెట్‌ కోచ్‌ సులక్షణ్‌ కులకర్ణి తీరుపై టీమిండియా వెటరన్‌ క్రికెటర్‌ దినేశ్‌ కార్తిక్‌ మండిపడ్డాడు. జట్టు ఓటమికి కెప్టెన్‌ను బాధ్యుడిని చేసేలా స్వార్థపూరితంగా మాట్లాడటం కోచ్‌ స్థాయికి తగదని చురకలు అంటించాడు. 

కాగా రంజీ ట్రోఫీ 2023-24లో భాగంగా ముంబైతో జరిగిన సెమీ ఫైనల్లో తమిళనాడు ఓటమిపాలై.. టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇన్నింగ్స్‌ 70 పరుగుల భారీ తేడాతో ఓడి ఇంటిబాటపట్టింది. ఈ నేపథ్యంలో తమిళనాడు కోచ్‌ సులక్షణ్‌ కులకర్ణి స్పందిస్తూ.. కెప్టెన్‌ ఆర్‌.సాయి కిషోర్‌ నిర్ణయాలను తప్పుబట్టాడు.

ఓ ముంబైకర్‌గా నాకన్నీతెలుసు.. కానీ
టాస్‌ గెలిచినప్పుడు తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుని పొరపాటు చేశాడని విమర్శించాడు. ఈ మేరకు.. ‘‘ఆరోజు వికెట్‌ను నేను గమనించాను. కోచ్‌గా, మంబైకర్‌(ముంబైకి చెందినవాడు)గా అక్కడి పిచ్‌ పరిస్థితులపై నాకు పూర్తి అవగాహన ఉంది. 

టాస్‌ గెలిచినపుడు బౌలింగ్‌ చేయించాలని అనుకుంటే.. మా కెప్టెన్‌ మాత్రం తనకు నచ్చినట్లుగా నిర్ణయం తీసుకున్నాడు. ఏదేమైనా బాస్‌ అతడే. అతడి నిర్ణయమే ఫైనల్‌. కేవలం ఇన్‌పుట్స్‌, ఫీడ్‌బ్యాక్‌ ఇవ్వడం వరకే నేను పరిమితం’’ అని సులక్షణ్‌ ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫోతో పేర్కొన్నాడు. 

నిజానికి తాము మొదటి రోజు ఆట టాస్‌ సమయంలోనే ఓడిపోయామంటూ సాయి కిషోర్‌ను ఓటమికి బాధ్యుడిని చేసేలా వ్యాఖ్యలు చేశాడు. ఈ విషయంపై దినేశ్‌ కార్తిక్‌ ఎక్స్‌ వేదికగా స్పందించాడు.

కోచ్‌కు ఇంత స్వార్థం పనికిరాదు..
‘‘ఇలా మాట్లాడటం కచ్చితంగా తప్పే. కోచ్‌ నుంచి ఇలాంటి మాటలు వినాల్సి రావడం నన్ను నిరాశకు గురిచేసింది. ఏడేళ్ల తర్వాత తొలిసారి జట్టును రంజీ సెమీస్‌ వరకు తీసుకువచ్చిన కెప్టెన్‌ను అభినందించాల్సింది పోయి.. ఇలా కోచే స్వయంగా.. బహిరంగంగా అతడిని విమర్శించడం సరికాదు’’ అని తమిళనాడు వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ డీకే ఆగ్రహం వ్యక్తం చేశాడు. 

తమిళనాడు ఆట ముగిసిందిలా.. ఫైనల్లో ముంబై
రంజీ ట్రోఫీలో తమ ఆధిపత్యాన్ని చాటుకుంటూ 41 సార్లు చాంపియన్‌ ముంబై జట్టు 47వ సారి ఫైనల్లోకి దూసుకెళ్లింది. సొంతమైదానంలో తమిళనాడుతో జరిగిన తొలి సెమీఫైనల్లో ముంబై ఇన్నింగ్స్‌ 70 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఓవర్‌నైట్‌ స్కోరు 353/9తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన ముంబై 106.5 ఓవర్లలో 378 పరుగులకు ఆలౌటైంది. 

తమిళనాడు బౌలర్లలో కెప్టెన్‌ సాయికిశోర్‌ 6 వికెట్లు తీసుకున్నాడు. అనంతరం 232 పరుగులతో వెనుకబడి రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన తమిళనాడు షమ్స్‌ ములానీ (4/53), శార్దుల్‌ ఠాకూర్‌ (2/16), మోహిత్‌ (2/26), తనుష్‌ (2/18) ధాటికి 162 పరుగులకే కుప్పకూలి ఓడిపోయింది. శార్దుల్‌ ఠాకూర్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది. 

చదవండి: గోపీచంద్‌ అకాడమీకి బైబై..!.. అమెరికాకు పయనం!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement