కోల్‌కతా: టీమిండియా మాజీ ఆటగాడు, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి నిర్వహించిన యాంజియోప్లాస్టీ విజయవంతమైనట్లు గురువారం అపోలో ఆసుపత్రి యాజమాన్యం నిర్థారించింది. యాంజియోప్లాస్టీ ద్వారా రక్తానాళాల్లో పూడికలు తొలగించేందుకు అదనంగా మరో రెండు స్టెంట్లు వేసినట్లు వైద్యులు పేర్కొన్నారు. ప్రస్తుతం దాదా ఆరోగ్యం నిలకడగా ఉందని.. రేపు డిశ్చార్జి అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
అయితే జనవరి మొదటివారంలో గంగూలీ గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. ఆసుపత్రిలో చేరిన గంగూలీ గుండె రక్తనాళాల్లో మూడు చోట్ల పూడికలు ఉన్నట్లు అప్పట్లో వైద్యులు గుర్తించారు. యాంజియోప్లాస్టీ ద్వారా సమస్య అధికంగా ఉన్నచోట స్టంట్ అమర్చారు. దీంతో గంగూలీ ఆరోగ్యం కుదుటపడడంతో మిగతాచోట్ల స్టంట్ వేయడాన్ని వాయిదా వేశారు. కాగా బుధవారం(జనవరి 27న) కాస్త అసౌకర్యంగా కనిపించిన గంగూలీ సాధారణ చెకప్ పేరిట ఆసుపత్రికి రావడంతో మరోసారి ఆందోళన నెలకొంది. దీంతో గంగూలీని పరీక్షించిన వైద్యులు గురువారం మరోమారు యాంజియోప్లాస్టీ నిర్వహించి మిగతా రెండు స్టెంట్స్ వేశారు.
చదవండి: నిలకడగా గంగూలీ ఆరోగ్యం
కాగా గురువారం బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సౌరవ్ గంగూలీని పరామర్శించారు. సౌరవ్ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని.. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. గంగూలీకి నిర్వహించిన ఆపరేషన్ విజయవంతం అయిందని.. అతని భార్య డోనా గంగూలీతో ఈ విషయం మాట్లాడినట్లు మమతా మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా గంగూలీకి నిర్వహించిన ఆపరేషన్ విజయవంతం కావడం పట్ల ఆమె వైద్యులను అభినందించారు.
దాదా తన 16 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో 113 టెస్టుల్లో, 311 వన్డేల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. గంగూలీ కెప్టెన్సీలో భారత్ 49 టెస్టులు ఆడి 21 విజయాలు సాధించింది. 13 టెస్టుల్లో ఓడి, 15 మ్యాచ్‌లను ‘డ్రా’ చేసుకుంది. వన్డేల్లో గంగూలీ నాయకత్వంలో టీమిండియా 146 మ్యాచ్‌లు ఆడింది. 76 మ్యాచ్‌ల్లో గెలిచి, 65 మ్యాచ్‌ల్లో ఓడింది. మరో ఐదు మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు. 2015 నుంచి 2019 వరకు బెంగాల్ క్రికెట్ సంఘం (సీఏబీ) అధ్యక్షుడిగా వ్యవహరించిన గంగూలీ 2019 అక్టోబర్‌లో బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. చదవండి: మళ్లీ ఆసుపత్రిలో చేరిన గంగూలీ
Comments
Please login to add a commentAdd a comment