
ముంబై: వరల్డ్‌కప్-2023లో సౌతాఫ్రికా మరో భారీ విజయాన్ని అందుకుంది. బంగ్లాదేశ్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్ సఫారీలు 149 పరుగుల విజయాన్ని నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్‌లో చెలరేగిపోయిన సౌతాఫ్రికా.. ఆపై బౌలింగ్‌లో కూడా విశ్వరూపం ప్రదర్శించింది.
సఫారీల బౌలింగ్ ధాటికి బంగ్లాదేశ్ 233 పరుగులకే చాపచుట్టేసింది. బంగ్లా ఆటగాళ్లలో మహ్మదుల్లా(111) మినహా ఎవరూ రాణించలేదు. ఫలితంగా బంగ్లాకు ఘోర పరాజయం ఎదురైంది.ఇది బంగ్లాదేశ్‌కు నాల్గో ఓటమి కాగా, దక్షిణాఫ్రికాకు నాల్గో విజయం. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ప్రోటీస్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 382 పరుగులు చేసింది.
సాతాఫ్రికా బ్యాటర్లలో ఓపెనర్ క్వింటన్ డికాక్ అద్భుతమైన శతకంతో చెలరేగాడు.ఈ మ్యాచ్‌లో 140 బంతులు ఎదుర్కొన్న డికాక్.. 15 ఫోర్లు, 7 సిక్స్‌లతో 174 పరుగులు చేశాడు. అతడితో పాటు హెన్రిస్ క్లాసెన్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. క్లాసెన్ కేవలం 49 బంతుల్లో 2 ఫోర్లు, 8 సిక్స్‌లతో 90 పరుగులు చేశాడు.