పాక్‌తో ఆడేది లేదు.. వాళ్ల‌కు మాత్రం మిన‌హాయింపు! | Sports Ministry Says India Keeps Pakistan Sports Ban For Bilateral Series | Sakshi
Sakshi News home page

పాక్‌తో ఆడేది లేదు.. వాళ్ల‌కు మాత్రం మిన‌హాయింపు!

May 6 2026 5:03 PM | Updated on May 6 2026 5:56 PM

Sports Ministry Says India Keeps Pakistan Sports Ban For Bilateral Series

పాకిస్తాన్‌తో ద్వైపాక్షిక సిరీస్‌ల‌కు సంబంధించి భార‌త ప్ర‌భుత్వం బుధ‌వారం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. పాకిస్తాన్‌తో ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడేది లేద‌ని క్రీడాశాఖ మంత్రి మ‌న్సుక్ మాండ‌వీయ తెలిపారు. అయితే భార‌త్‌లో జ‌రిగే  మ‌ల్టీ నేష‌న‌ల్ స్పోర్ట్స్ ఈవెంట్‌లో మాత్రం పాకిస్తాన్ అథ్లెట్లు పాల్గొనేందుకు  అనుమ‌తి ఇస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది. 

ఈ మేర‌కు జాతీయ క్రీడా స‌మాఖ్య‌, ఇండియ‌న్ ఒలింపిక్ అసోసియేష‌న్‌, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్‌) సంయుక్తంగా స‌ర్క్యుల‌ర్‌ విడుద‌ల చేసింది. 2030 కామ‌న్‌వెల్త్ గేమ్స్‌తో పాటు 2036 ఒలింపిక్స్‌ను నిర్వ‌హ‌ణ‌కు భార‌త్ ప్ర‌య‌త్నిస్తున్న నేప‌థ్యంలో ఒలింపిక్ చార్ట‌ర్‌, అంత‌ర్జాతీయ క్రీడా మార్గ‌ద‌ర్శ‌కాల‌ను అనుస‌రించ‌నున్న‌ట్లు తెలిపింది. 

అయితే పాకిస్తాన్‌తో మాత్రం ఎలాంటి ద్వైపాక్షిక క్రీడా సంబంధాలు ఉండ‌వ‌ని, అంత‌ర్జాతీయ నిబంధ‌న‌ల ప్ర‌కారం ఐసీసీ, ఒలింపిక్స్‌, కామ‌న్‌వెల్త్, ఆసియా గేమ్స్ వంటి టోర్నీల్లో మాత్రమే భార‌త్, పాకిస్తాన్‌తో త‌ల‌ప‌డుతుంద‌ని క్రీడాశాఖ పున‌రుద్ఘాటించింది. 

తాజాగా విడుద‌ల చేసిన స‌ర్క్యుల‌ర్‌తో పాకిస్తాన్‌తో ప్ర‌స్తుతం ఉన్న క్రీడా విధానం య‌థాత‌థంగా కొన‌సాగ‌నుంది. దీంతో స‌మీప భ‌విష్య‌త్తులో అటు భార‌త్‌లో కానీ, ఇటు పాకిస్తాన్‌లో కానీ ఇరు దేశాల మ‌ధ్య క్రికెట్‌, హాకీ స‌హా ఇత‌ర క్రీడా సిరీస్‌లు జ‌ర‌గ‌వు. 

అయితే పాకిస్తాన్ అథ్లెట్ల‌కు మాత్రం ఇందుకు మిన‌హాయింపు ఉంటుంద‌ని, ఎందుకంటే వారి వ్య‌క్తిగ‌త కెరీర్‌ను దెబ్బ‌తీసే ఉద్దేశం త‌మ‌కు ఎంతమాత్రం లేద‌ని పేర్కొంది. భార‌త్‌లో జ‌రిగే అథ్లెటిక్స్‌ ఈవెంట్‌లు ఏవైనా పాక్ అథ్లెట్లు పాల్గొనడాన‌కి అవ‌కాశమిస్తామ‌ని కేంద్ర క్రీడాశాఖ నొక్కి చెప్పింది. 

గ‌తేడాది ఏప్రిల్‌లో ప‌హ‌ల్గాం ఉగ్ర‌దాడి ఘ‌ట‌న‌లో 26 మంది అమాయ‌క ప్రాణాలు బ‌లిగొన్న త‌ర్వాత భార‌త్‌, పాకిస్తాన్ మ‌ధ్య సంబంధాలు మ‌రింత క్షీణించాయి. నిజానికి 2008 ముంబై ఉగ్ర‌దాడుల త‌ర్వాత భార‌త్‌, పాకిస్తాన్ మ‌ధ్య ద్వైపాక్షిక క్రీడా సిరీస్‌లు పూర్తిగా నిలిచిపోయాయి. కేవ‌లం ఐసీసీ టోర్నీల్లో మాత్రం భారత్, పాకిస్తాన్‌లు త‌ల‌ప‌డుతున్నాయి. చివ‌రగా 2026 టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో పాక్‌తో మ్యాచ్ ఆడిన భార‌త్ ఘ‌న విజ‌యాన్ని సాధించింది.

చదవండి: బ్యాటర్ల వెన్నులో వణుకు.. కనుమరుగవుతున్న యార్కర్లు!

Advertisement
 
Advertisement
Advertisement