తిరువనంతపురం: ఏడేళ్ల నిషేధం తర్వాత మళ్లీ బంతి పట్టనున్న టీమిండియా ఆటగాడు శ్రీశాంత్‌కు మాజీ క్రికెటర్ సురేశ్ రైనా శుభాకాంక్షలు తెలిపాడు. దాదాపు ఏడేళ్ల విరామం అనంతరం శ్రీశాంత్ కేరళ క్రికెట్ అసోసియేషన్ నిర్వహిస్తున్న ప్రెసిడెంట్స్ కప్ టీ20 టోర్నమెంటులో ఆడనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా శ్రీశాంత్ ట్విటర్ ద్వారా తన సంతోషాన్ని పంచుకున్నాడు. ఏడేళ్ల తర్వాత తన చేతులను మళ్లీ తిప్పే అవకాశం వచ్చిందని.. ఎంతగానో ఇష్టపడే క్రికెట్‌లో అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి కృషి చేస్తానని ట్వీట్‌లో పేర్కొన్నాడు. శ్రీశాంత్ ట్వీట్‌కు సురేశ్ రైనా స్పందిస్తూ.. ‘గుడ్ లక్ మై బ్రదర్’ అని బదులిస్తూ శుభాకాంక్షలు తెలిపాడు.
2013 ఐపీఎల్‌లో స్పాట్ ఫిక్సింగ్ కేసులో చిక్కుకొని శ్రీశాంత్ క్రికెట్‌కు దూరమయ్యాడు. అతడితో పాటు రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఆడిన సహచరులు అజిత్ చండేలా, అంకిత్ చవాన్‌లు నిషేధానికి గురయ్యారు. శ్రీశాంత్‌పై విధించిన నిషేధాన్ని గత సంవత్సరం ఏడేళ్లకు కుదించగా, ఈ ఏడాది సెప్టెంబరుతో ఆ గడువు ముగిసింది. ప్రెసిడెంట్స్ కప్ టీ 20 టోర్నీ వచ్చే నెల 17న ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో కేసీఏ రాయల్స్, కేసీఏ టైగర్స్, కేసీఏ టస్కర్స్, కేసీఏ ఈగల్స్, కేసీఏ పాంథర్స్, కేసీఏ లయన్స్ జట్లు తలపడనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment