ఢిల్లీ కాచుకో.. సన్‌రైజర్స్‌ వచ్చేసింది | SRH Beat RCB By 6 Wickets In Eliminator Match | Sakshi
Sakshi News home page

ఢిల్లీ కాచుకో.. సన్‌రైజర్స్‌ వచ్చేసింది

Published Fri, Nov 6 2020 11:13 PM | Last Updated on Fri, Nov 6 2020 11:13 PM

SRH Beat RCB By 6 Wickets In Eliminator Match - Sakshi

అబుదాబి:  సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మరో ముందడుగు వేసింది. ఒకవైపు ఆటగాళ్ల గాయాలు వేధిస్తున్నా సన్‌రైజర్స్‌ నిలబడుతూ తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. ఆర్సీబీతో జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ 6 వికెట్ల తేడాతో గెలిచి క్వాలిఫయర్‌-2లో అడుగుపెట్టింది. ఆర్సీబీ నిర్దేశించిన 132 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆరెంజ్‌ ఆర్మీ ఆరంభంలో తడబడినా తర్వాత నిలకడగా ఆడి చివరకు విజయాన్ని సొంతం చేసుకుంది. కేన్‌ విలియమ్సన్‌(50 నాటౌట్‌; 44 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), హోల్డర్‌( 24 నాటౌట్‌; 20 బంతుల్లో 3 ఫోర్లు)లు సన్‌రైజర్స్‌ విజయంలో ముఖ్య భూమిక పోషించాడు. టార్గెట్‌ను ఛేదించే క్రమంలో సన్‌రైజర్స్‌ ఆరంభంలోనే వికెట్‌ను కోల్పోయింది. ఓపెనర్‌ శ్రీవాట్స్‌ గోస్వామి డకౌట్‌ అయ్యాడు. సిరాజ్‌ వేసిన తొలి ఓవర్‌ నాల్గో బంతికి గోస్వామి ఔటయ్యాడు. ఆ తరుణంలో మనీష్‌ పాండే-వార్నర్‌ల జోడి కాసేపు మరమ్మత్తులు చేసింది. ఈ జోడి 41 పరుగులు జత చేసిన తర్వాత వార్నర్‌(17; 17 బంతుల్లో 3 ఫోర్లు) రెండో వికెట్‌గా ఔటయ్యాడు. సిరాజ్‌ వేసిన ఆరో ఓవర్‌ నాల్గో బంతికి వార్నర్‌ పెవిలియన్‌ చేరాడు.

కాసేపటికి మనీష్‌ పాండే(24; 21బంతుల్లో 3 ఫోర్లు, 1సిక్స్‌) కూడా నిష్క్రమించాడు. ఆడమ్‌ జంపా వేసిన 9 ఓవర్‌ మూడో బంతికి పాండే ఔటయ్యాడు. ప్రియాం గార్గ్‌(7) కూడా ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేదు. కాగా, విలియమ్సన్‌ నిలకడగా ఆడాడు. హోల్డర్‌తో కలిసి స్టైక్‌ రొటేట్‌ చేస్తూ స్కోరును ముందుకు తీసుకెళ్లాడు. అత్యంత చెత్త బంతుల్ని బౌండరీలకు తరలిస్తూ బాధ్యతాయుతంగా ఆటను కొనసాగించాడు. ఆఖరి ఓవర్‌ వరకూ టెన్షన్‌ పెట్టినా హోల్డర్‌ వరుసగా రెండు ఫోర్లు కొట్టి విజయాన్ని ఇంకా రెండు బంతులు ఉండగానే సాధించిపెట్టాడు.సైనీ వేసిన మూడు, నాలుగు బంతుల్ని హోల్డర్‌ ఫోర్లు కొట్టడంతో సన్‌రైజర్స్‌ ఊపిరిపీల్చుకుంది. ఈ జోడి 65 పరుగుల్ని సాధించి సన్‌రైజర్స్‌ విజయం‍లో ముఖ్యపాత్ర పోషించింది. ఆదివారం జరుగనున్న క్వాలిఫయర్‌-2లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో సన్‌రైజర్స్‌ తలపడనుంది. ఇక్కడ గెలిచిన జట్టు ఫైనల్‌కు చేరుతుంది.

ముందుగా బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. సన్‌రైజర్స్‌ బౌలర్లు దుమ్మురేపడంతో ఆర్సీబీ మోస్తరు స్కోరుకే పరిమితమైంది. ప్రధానంగా హోల్డర్‌, నటరాజన్‌లు తమ పేస్‌తో ఆర్సీబీకి చుక్కలు చూపించారు. ఆరంభంలోనే ఆర్సీబీని హోల్డర్‌ గట్టి దెబ్బకొట్టాడు. కోహ్లి, పడిక్కల్‌లను వేర్వేరు వరుస ఓవర్లలో పెవిలియన్‌కు పంపి సన్‌రైజర్స్‌కు మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. ఆర్సీబీ జట్టులో ఏబీ డివిలియర్స్‌((56; 43 బంతుల్లో 5 ఫోర్లు)హాఫ్‌ సెంచరీకి జతగా అరోన్‌ ఫించ్‌(32; 30 బంతుల్లో 3 ఫోర్లు, 1సిక్స్‌) మాత్రమే రాణించాడు. మిగతా బ్యాట్స్‌మెన్‌ విఫలం కావడంతో ఆర్సీబీ సాధారణ స్కోరునే బోర్డుపై ఉంచింది. 

టాస్‌ గెలిచిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ముందుగా ఫీల్డింగ్‌ తీసుకుంది. దాంతో ఆర్సీబీ ఇన్నింగ్స్‌ను విరాట్‌ కోహ్లి, దేవదూత్‌ పడిక్కల్‌లు ఆరంభించారు. కోహ్లి(6) విఫలం కాగా, పడిక్కల్‌(1) కూడా నిరాశపరిచాడు. హోల్డర్‌ వేసిన రెండో ఓవర్‌ రెండో బంతికి కోహ్లి ఔట్‌ కాగా,  హోల్డర్‌ వేసిన ఇన్నింగ్స్‌ నాల్గో ఓవర్‌ మూడో బంతికి పడిక్కల్‌ పెవిలియన్‌ చేరాడు. దాంతో ఆర్సీబీ 15 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత ఫించ్‌, ఏబీ డివిలియర్స్‌లు ఇన్నింగ్స్‌ మరమ్మత్తులు చేశారు. ఈ జోడి 41 పరుగులు జత చేసిన తర్వాత ఫించ్‌(32; 30 బంతుల్లో 3 ఫోర్లు, 1సిక్స్‌) ఔటయ్యాడు. నదీమ్‌ వేసిన 11 ఓవర్‌ రెండో బంతికి  ఫించ్‌ పెవిలియన్‌ చేరాడు. ఆ తర్వాత వచ్చిన మొయిన్‌ అలీ(0), శివం దూబే(8), సుందర్‌(5)లు ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. సన్‌రైజర్స్‌ బౌలర్లలో హోల్డర్‌ మూడు వికెట్లు సాధించగా, నటరాజన్‌ రెండు వికెట్లు తీశాడు. నదీమ్‌కు వికెట్‌ దక్కింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement