దుబాయ్: ఈ ఐపీఎల్ సీజన్‌లో భాగంగా రాజస్తాన్ రాయల్స్‌తో జరుగుతున్న రెండో అంచె మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ముందుగా రాజస్తాన్‌ను బ్యాటింగ్ చేసేందుకు ఆహ్వానించాడు. ఓవరాల్‌గా ఇరు జట్ల మధ్య 12 మ్యాచ్‌లు జరగ్గా ఎస్‌ఆర్‌హెచ్, రాజస్తాన్‌లు తలో ఆరు మ్యాచ్‌లు గెలిచాయి. ఈ సీజన్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన తొలి అంచె మ్యాచ్‌లో రాజస్తాన్ విజయం సాధించింది. ఎస్‌ఆర్‌హెచ్ నిర్దేశించిన 159 పరుగుల టార్గెట్‌ను రాజస్తాన్ ఇంకా బంతి ఉండగా ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. (డుప్లెసిస్ డ్రింక్స్ మోయలేదా?)
ఇప్పటివరకూ రాజస్తాన్ 10 మ్యాచ్‌లకు గాను నాలుగింట విజయం సాధించగా, సన్‌రైజర్స్ 9 మ్యాచ్‌లతో మూడు విజయాలను నమోదు చేసింది. ప్రస్తుతం రాజస్తాన్ ఆరో స్థానంలో ఉండగా, సన్‌రైజర్స్ ఏడో స్థానంలో ఉంది. రాజస్తాన్ ఆడిన గత ఐదు మ్యాచ్‌ల్లో రెండే విజయాలు సాధించగా, హైదరాబాద్ గత ఐదు మ్యాచ్‌ల్లో ఒకదాంట్లో మాత్రమే గెలుపును అందుకుంది. దాంతో ఇరుజట్లకు ఈ మ్యాచ్‌లో గెలుపు అత్యంత కీలకం.ఈ మ్యాచ్‌లో బాసిల్ థంపి స్థానంలో నదీమ్ జట్టులోకి వచ్చాడు. మరొకవైపు జేసన్ హోల్టర్ కూడా ఆరెంజ్ ఆర్మీ తుది జట్టులోకి వచ్చాడు.
ఇక రాజస్తాన్ రాయల్స్ ఎటువంటి మార్పులు లేకుండా పోరుకు సిద్ధమైంది. టాస్ గెలిచిన తర్వాత డేవిడ్ వార్నర్ మాట్లాడుతూ.. ముందుగా బౌలింగ్ చేస్తున్నట్లు తెలిపాడు. అదే సమయంలో జట్టులో పెద్దగా మార్పులు చేయడం లేదన్నాడు. ఇక రాజస్తాన్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ మాట్లాడుతూ.. ‘టాస్ ఓడిపోవడం మంచిదైంది. మేము ముందుగా బ్యాటింగ్ చేయాలనుకున్నాం. టాస్ ఓడిపోయినా తొలుత బ్యాటింగ్‌కు వెళ్లడం సంతోషంగా ఉంది.ఇప్పుడే మేము గాడిలో పడ్డాం. సీఎస్‌కేపై గత విజయం మా జట్టులో ఆత్మవిశ్వాసాన్ని నింపింది’ అని పేర్కొన్నాడు.
సన్‌రైజర్స్ జట్టు బ్యాటింగ్ విభాగంలో డేవిడ్ వార్నర్(331), బెయిర్ స్టో(316), మనీష్ పాండే(212)లు ఫామ్‌లో ఉండగా, బౌలింగ్ విభాగంలో రషీద్ ఖాన్(11), నటరాజన్(11), ఖలీల్ అహ్మద్(8)లు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఇక రాజస్తాన్ జట్టులో జోస్ బట్లర్(262), స్టీవ్ స్మిత్(246), సంజూ శాంసన్(236)లు కీలకం కాగా, బౌలింగ్ విభాగంలో జోఫ్రా ఆర్చర్(13), రాహుల్ తెవాటియా(7), శ్రేయస్ గోపాల్(7)లే వారి ఆయుధాలు.
వార్నర్ వర్సెస్ ఆర్చర్
ఈ సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటింగ్ విభాగంలో పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో ఆ జట్టుకు వరుస ఓటముల్ని చూడాల్సి వస్తుంది. డేవిడ్ వార్నర్, బెయిర్ స్టో, మనీష్ పాండేలు ఆడుతున్నా నిలకడలేమి కనిపిస్తోంది. ప్రధానంగా ఆరంభంలో విషయంలో సన్‌రైజర్స్ తడబడుతోంది. ఎస్‌ఆర్‌హెచ్‌లో వార్నర్ కీలక ఆటగాడు. కానీ స్టైక్‌రేట్ 124. 43గా ఉంది. ఇది వార్నర్ గత ఐపీఎల్ సీజన్ల కంటే తక్కువ స్టైక్‌రేట్. టాపార్డర్‌లో బ్యాటింగ్ చేసేటప్పుడు ఇది సరిపోదు. రాజస్తాన్‌తో జరిగిన గత మ్యాచ్‌లో వార్నర్ 48 పరుగులు చేసినా ఇక్కడ స్టైక్‌రేట్ 126.32 మాత్రమే ఉంది. హాఫ్ సెంచరీకి చేరువలో వార్నర్‌ను ఆర్చర్ బౌల్డ్ చేశాడు.
ఆర్చర్ ఇప్పటివరకూ 13 వికెట్లు సాధించాడు. అదే సమయంలో ఎకానమీలో దుమ్ములేపుతున్నాడు. ఈ సీజన్‌లో ఆర్చర్ ఎకానమీ 6.75 గా ఉంది. మిగతా రాజస్తాన్ బౌలర్ల కంటే ఆర్చర్ ఎకానమీనే అత్యుత్తమంగా ఉండటంతో మరోసారి ఆ ఇంగ్లిష్ బౌలర్‌తో ప్రమాదం లేకపోలేదు. ఆర్చర్‌ను వార్నర్ సమర్ధవంతంగా ఎదుర్కొంటేనే ఎస్‌ఆర్‌హెచ్ గాడిలో పడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment