మహిళల టి20 ప్రపంచకప్‌లో టీమిండియా అవకాశాలపై స్టార్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ వ్యాఖ్య
మెగా ఈవెంట్‌కు సర్వసన్నద్ధం
అన్ని జట్లపై హోంవర్క్ చేసి బరిలోకి
ఎన్నో ఏళ్లుగా ఊరిస్తోన్న అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ట్రోఫీ చేజిక్కించుకోవాలని తహతహలాడుతున్న భారత మహిళల క్రికెట్ జట్టు టి20 ప్రపంచకప్‌లో మెరుగైన ప్రదర్శన చేయడమే లక్ష్యంగా పెట్టుకుందని భారత టాపార్డర్ ప్లేయర్ జెమీమా రోడ్రిగ్స్ పేర్కొంది.
ఈసారి అందుకు తగ్గ అనుకూలతలు ఉన్నాయని...కప్ గెలిచేందుకు ఇదే మంచి తరుణమని ఆమె వెల్లడించింది. ప్లేయర్లందరికీ జట్టు ప్రయోజనాలే ముఖ్యమన్న జెమీమా... మెగా టోర్నీ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు తెలిపింది. అనుభవజు్ఞలు, యంగ్ ప్లేయర్లతో టీమిండియా సమతూకంగా ఉందని... ఆ్రస్టేలియా వంటి ప్రత్యర్థులపై కూడా విజయాలు సాధించగలమనే నమ్మకముందని పేర్కొంది.
రేపటి నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో మహిళల టి20 ప్రపంచకప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో జెమీమా రోడ్రిగ్స్ పంచుకున్న వివరాలు ఆమె మాటల్లోనే...
తొలిసారి మహిళల టి20 ప్రపంచకప్ చేజిక్కించుకోవడానికి భారత జట్టుకు అన్ని అనుకూలతలు ఉన్నాయి. జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించడం కంటే పెద్ద ఘనత ఏదీ లేదు. వరల్డ్‌కప్ బరిలోకి దిగుతున్న భారత మహిళల జట్టులో ప్రస్తుతం అందరి పరిస్థితి ఇదే. జట్టుకు అవసరమైన సమయంలో రాణించేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉన్నారు. నా వరకైతే టీమిండియాకు ఆడే సమయంలో సర్వశక్తుల ఒడ్డేందుకు ప్రయత్నిస్తా.
జట్టు గెలవడమనే నాకు ఎక్కువ సంతృప్తినిస్తుంది. రేపటి నుంచి ప్రారంభం కానున్న టి20 వరల్డ్‌కప్ కోసం మెరుగ్గా సిద్ధమయ్యా. ప్రత్యేకంగా ఒక బౌలర్‌ను లక్ష్యంగా చేసుకోలేదు. పరిస్థితులపై పైచేయి సాధించాలనుకుంటున్నా. ఎవరిని బౌలింగ్‌లో భారీ షాట్లు ఆడాలి... ఎలాంటి బంతులను గౌరవించాలి అనే దానిపై సాధన చేశా. నా ప్రదర్శన జట్టు విజయానికి తోడ్పడాలని కోరుకుంటా.
సమతూకంగా జట్టు...
అటు అనుభవజు్ఞలు ఇటు యంగ్ ప్లేయర్లతో జట్టు సమతూకంగా ఉంది. రిచా ఘోష్, షఫాలీ వర్మతో పాటు నాకూ గతంలో ఐసీసీ ప్రపంచకప్‌లు ఆడిన అనుభవం ఉంది. మేము యువ క్రీడాకారిణులమే అయినా... అవసరమైనంత అనుభవం ఉంది. ఇక జట్టులో హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన రూపంలో ఇద్దరు సీనియర్ ప్లేయర్లు ఉన్నారు. వారికి ప్రపంచకప్‌లలో ఆడిన అపార అనుభవం ఉంది.
ఆటగాళ్లంతా ట్రోఫీ చేజిక్కించుకోవాలనే ఉత్సాహంతో ఉన్నాం. జట్టు సమావేశాల్లో ఎక్కువ శాతం చర్చ దీని గురించే జరుగుతుంది. 2020 ప్రపంచకప్ ఫైనల్లో పరాజయం పాలయ్యాం. ఇప్పుడు తొమ్మిదో ఎడిషన్‌లో మెరుగైన ప్రదర్శన చేస్తామనే నమ్మకముంది. వార్మప్ మ్యాచ్‌లో రాణించడం ఆనందంగా ఉంది. ప్రధాన పోటీలకు ముందు చక్కటి ఇన్నింగ్స్ ఆడటం నా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది.
న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ సోఫీ డివైన్ ఆటకు నేను అభిమానిని. మొదటిసారి అండర్–19 క్యాంప్‌లో ఉన్న సమయంలో చిన్నస్వామి స్టేడియంలో సోఫీ డివైన్ వరుసగా ఐదు బంతుల్లో సిక్సర్లు బాదింది. ఆ సందర్భాన్ని మరవలేను. ఆమె కోసం మా బౌలర్ల వద్ద ప్రత్యేక ప్రణాళికలు ఉన్నాయి.
ఆస్ట్రేలియాతో పోటీని ఆస్వాదిస్తా...
ఈ నెల 13న ఆ్రస్టేలియాతో మ్యాచ్ ఆడనున్నాం. ఆసీస్‌తో ఆడటాన్ని ఎంతో ఆస్వాదిస్తా. మెరుగైన ప్రత్యరి్థతో తలపడ్డప్పుడు అత్యుత్తమ ఆట బయటకు వస్తుంది. చాన్నాళ్లుగా కంగారూ జట్టుతో మ్యాచ్‌లు ఆడుతున్నాం. ఈసారి మైదానంలో మా ప్రణాళికలను పక్కాగా అమలు చేస్తాం.
జట్టు వైస్ కెపె్టన్ స్మృతి మంధాన ఆటను బాగా అర్థం చేసుకుంటుంది. పరిస్థితులకు తగ్గట్టు ఆటతీరును మార్చుకుంటుంది. అందుకే గొప్ప ప్లేయర్‌గా ఎదిగింది. అవసరమైనప్పుడు చక్కటి సలహాలు ఇస్తుంది. ఇక కెపె్టన్ హర్మన్‌ప్రీత్ కౌర్ పెద్ద మ్యాచ్‌ల్లో మెరుగ్గా రాణిస్తుంది. కీలక మ్యాచ్‌ల్లో ఒత్తిడిని తట్టుకొని ఎలా నిలబడాలో ఆమె ఆట ద్వారా నేర్చుకున్నా.
ఇప్పటి వరకు జరిగిన ఎనిమిది టి20 ప్రపంచకప్‌లలోనూ హర్మన్‌ప్రీత్ పాల్గొంది. ఈ టోర్నీ ఆమెకు ఎంత ముఖ్యమో జట్టులో ప్రతి ఒక్కరికీ తెలుసు. దేశంతో పాటు ఆమె కోసం కప్పు గెలవాలని అనుకుంటున్నాం. ఆమె ట్రోఫీ చేజిక్కించుకోవడం చూడాలని ఆశిస్తున్నా.
Comments
Please login to add a commentAdd a comment