ఆసీస్ మాజీ క్రికెటర్ స్టువర్ట్ మెక్ గిల్ కిడ్నాప్ వ్యవహారం అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. గతేడాది మార్చిలో దుండగులు సిడ్నీలోని తన నివాసంలోనే మెక్‌గిల్‌ను కిడ్నాప్ చేశారు. ఇది జరిగిన 15 నెలల తర్వాత మెక్‌గిల్ కిడ్నాప్ వ్యవహారంపై ఎట్టకేలకు నోరు విప్పాడు.
‘ఆ ఘటనను తలుచుకుంటేనే చాలా భయమేస్తోంది. మనం అసహ్యించుకునే శత్రువులకు కూడా అలా జరుగకూడదరని కోరుకుంటున్నా. కొందరు దుండగులు సిడ్నీలోని నా ఇంటికి వచ్చి నన్ను కిడ్నాప్ చేశారు. వాళ్లు నన్నెక్కడికి తీసుకెళ్లారో నాకు తెలియదు. నా కళ్లకు గంతలు కట్టి కార్ లో పడేశారు. నేను కార్‌లోకి ఎక్కనంటే ఆయుధాలతో బెదిరించారు. సుమారు గంటన్నర పాటు కార్‌లో ప్రయాణం చేశాం. అయితే వాళ్లు నన్ను ఎక్కడికి తీసుకెళ్లారనే దానిపై స్పష్టత లేదు.
ఒక చోటుకు తీసుకెళ్లిన తర్వాత పాయింట్ బ్లాక్‌లో గన్ పెట్టి నా బట్టలన్నీ విప్పేసి నగ్నంగా నిల్చోబెట్టి దారుణంగా కొట్టారు. ఆ తర్వాత ఒక చోట నన్ను విడిచి వెళ్లిపోయారు. ఎక్కడున్నానో అర్థం కాక మూడు గంటల పాటు అలాగే నిల్చుండిపోయా. మళ్లీ వచ్చిన దుండగులు కార్‌లో తీసుకెళ్లి బెల్మోర్ సిటీలో విడిచిపెట్టి అక్కడి నుంచి పరారయ్యారు.
అక్కడి స్థానికుల సహాయంతో ఆసుపత్రిలో చికిత్స చేయించుకొని సిడ్నీలోనే ఒక హోటళ్లో రెండు-మూడు వారాల పాటు గడిపాను. ఆ తర్వాత తెలిసిన స్నేహితుడిని ద్వారా ఫ్రేజర్ ఐలాండ్‌లోని నా గెస్ట్ హౌస్‌లో మరికొన్ని వారాలు గడిపాను. నన్ను కిడ్నాప్ చేసిన దుండగులు అరెస్ట్ అయ్యారని తెలుసుకొని తిరిగి ఇంటికి చేరుకొన్నా.. కానీ ఆ మూడు నెలలు మాత్రం చాలా నరకం అనుభవించా’ అని ఆవేదన వ్యక్తం చేశాడు.
అయితే మొదట్లో మెక్ గిల్‌ను డబ్బుల కోసం కిడ్నాప్ చేశారని చాలా మంది భావించారు. కానీ ఈ కేసులో మెక్ గిల్ భార్య తమ్ముడి హస్తం ఉందని తేలింది. మత్తు పదార్థాల సరఫరా విషయంలో మెక్ గిల్ ఇన్వాల్వ్ అయ్యాడని.. అందుకే దుండగులతో కిడ్నాప్ చేయించి వార్నింగ్ ఇచ్చినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇక 1998-2008 మధ్య ఆసీస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన మెక్ గిల్.. టెస్టు, వన్డే ఫార్మాట్లలో ఆడాడు. 44 టెస్టులాడిన మెక్‌గిల్ 208 వికెట్లు.. మూడు వన్డేలాడి 6 వికెట్లు తీశాడు.
చదవండి: 'ఒక శకం ముగిసింది'.. టెస్టులకు ఇంగ్లండ్ దిగ్గజ క్రికెటర్ గుడ్‌బై
ENG vs NED: నెదర్లాండ్స్ ఆటగాళ్ల గోస .. బంతి కోసం చెట్లు, పుట్టల్లోకి
Comments
Please login to add a commentAdd a comment