ముంబై: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాపై క్రికెట్ దిగ్గజం, లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. గత కొంతకాలంగా ఫామ్ లేమితో సతమతమవుతున్న హార్ధిక్‌ను సన్నీ ఏకి పారేశాడు. కెరీర్ ఆరంభంలో బంతితో, బ్యాట్‌తో చెలరేగిపోయిన హార్ధిక్‌లో ఇప్పుడు ఆ జోరు కనపడటం లేదని, ఫిట్‌నెస్ విషయంలో కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని ఆరోపించాడు. హార్దిక్‌కు ప్రత్యామ్నాయాన్ని వెదుక్కోవాల్సిన సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించాడు. ఇక హార్ధిక్ పనైపోయిందని, అతని స్థానాన్ని దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్‌లతో రీప్లేస్ చేయాలని సూచించాడు. చాహర్, భువీలకు తగినన్ని అవకాశాలిచ్చి వారిని మేటి ఆల్‌రౌండర్లుగా తీర్చిదిద్దాలని బీసీసీఐని అభ్యర్ధించాడు.
ప్రస్తుతం జరుగుతున్న లంక సిరీస్ రెండో వన్డేలో ఓటమి అంచుల్లో ఉన్న టీమిండియాను చాహర్, భువీ అద్భుతమైన బ్యాటింగ్‌తో గట్టెక్కించారని, లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు దిగిన ఈ ఇద్దరూ పక్కా ప్రొఫెషనల్స్‌లా బ్యాటింగ్ చేశారని ప్రశంసించాడు. ఈ మ్యాచ్‌లో చాహర్ 82 బంతుల్లో సిక్స్, 7 ఫోర్ల సాయంతో 69 పరుగులు చేయగా, భువీ.. 28 బంతుల్లో 2 ఫోర్లతో 19 పరుగులు స్కోర్ చేశారని, అంతకుముందు బౌలింగ్‌లోనూ వీరిద్దరూ రాణించారని కితాబునిచ్చాడు. కేవలం ఈ మ్యాచ్‌లో ప్రదర్శన ఆధారంగానే వీరికి మద్దతు తెలపడం లేదని, గతంలో వీరి ఆల్‌రౌండ్ ప్రదర్శనలను బేరీజు వేసుకునే ఈ నిర్ణయానికొచ్చానని, తన అభిప్రాయాన్ని సమర్ధించుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment