'రోహిత్ న‌న్ను పూర్తిగా నిరాశ‌ప‌రిచాడు' | Sunil Gavaskar Says Rohit Sharma Disappoints-Me-92-Out-Vs WI 3rd ODI | Sakshi
Sakshi News home page

'రోహిత్ న‌న్ను పూర్తిగా నిరాశ‌ప‌రిచాడు'

Oct 4 2026 6:51 PM | Updated on Oct 4 2026 6:59 PM

Sunil Gavaskar Says Rohit Sharma Disappoints-Me-92-Out-Vs WI 3rd ODI

Photo Credit: Twitter

న్యూ చండీగ‌ఢ్ వేదిక‌గా వెస్టిండీస్‌తో జ‌రిగిన మూడో వ‌న్డేలో రోహిత్ శ‌ర్మ సెంచ‌రీకి 8 ప‌రుగుల దూరంలో ఔటైన సంగ‌తి తెలిసిందే. ఆరంభం నుంచి మంచి ఈజ్‌తో క‌నిపించిన రోహిత్ 92 ప‌రుగుల వ్య‌క్తిగ‌త స్కోరు వ‌ద్ద వెనుదిరిగాడు. ఇప్ప‌టివ‌ర‌కు వ‌న్డేల్లో 35 సెంచ‌రీలు చేసిన రోహిత్ నిన్న‌టి మ్యాచ్‌లో సెంచ‌రీ చేసి ఉంటే ఆ సంఖ్య 36కు చేరుకునేది.

ఈ నేప‌థ్యంలోనే రోహిత్ శ‌ర్మ 92 ప‌రుగుల వ‌ద్ద ఔట‌వ్వ‌డంపై భార‌త క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ మాత్రం అసంతృప్తి వ్యక్తం చేశాడు. సెంచరీకి కేవలం 8 పరుగుల దూరంలో రోహిత్ ఔట్ కావడం తనను చాలా నిరాశపరిచిందని పేర్కొన్నాడు. రోహిత్ శర్మ తన కెరీర్‌ను ఓ ప్రత్యేకమైన మైలురాయితో ముగించాలని తాను కోరుకుంటున్నట్లు గవాస్కర్ త‌న మ‌న‌సులోని మాట‌ను వెల్ల‌డించాడు

‘హయర్ క్రికెట్ లైవ్’ కార్యక్రమంలో గవాస్కర్ మాట్లాడుతూ.. "2027 వన్డే ప్రపంచకప్ తర్వాత సుమారు 40 ఏళ్ల వయసులో రోహిత్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికే అవకాశం ఉంది. నా వ్యక్తిగత కోరిక ఏంటంటే.. అతను రిటైర్ అయ్యే నాటికి అతని వయసు కన్నా ఎక్కువ వన్డే సెంచరీలు చేయాలి. ప్రస్తుతం రోహిత్ ఖాతాలో 35 సెంచరీలు ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో శతకం పూర్తి చేసి ఉంటే, ఆ సంఖ్య 36కు చేరేది. తద్వారా 40 సెంచరీల మార్క్‌కు మరింత దగ్గరయ్యేవాడు" అని అభిప్రాయపడ్డాడు.

ఈ సందర్భంగా తన కెరీర్‌లోని చివరి దశను గవాస్కర్ గుర్తుచేసుకున్నాడు. "నాకు 38 ఏళ్ల వయసులో, టెస్టుల్లో 38 సెంచరీలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. కానీ దురదృష్టవశాత్తు మూడుసార్లు 90ల్లో ఔటయ్యాను. అందుకే రోహిత్ సెంచరీ మిస్ కావడం చూసి నిరాశ చెందాను. నేను సాధించలేకపోయాను.. రోహిత్ అయినా ఆ ఘనత అందుకోవాలి" అని అభిలాషించాడు.

అదే సమయంలో 2023 ప్రపంచకప్ తర్వాత రోహిత్ బ్యాటింగ్ శైలిలో మార్పు వచ్చిందని గవాస్కర్ విశ్లేషించాడు. "ప్రపంచకప్‌లో మొదటి బంతి నుంచే దూకుడుగా ఆడేవాడు. ఇప్పుడు తన వికెట్‌కు ఎక్కువ విలువ ఇస్తున్నాడు. ఇది మంచి పరిణామమే. అయినా, రోహిత్‌ను నేను 30-40 పరుగులు చేసే ఆటగాడిగా కాకుండా, 'సెంచరీల వీరుడి'గానే చూస్తాను" అని స్పష్టం చేశాడు.

ఇదీ చదవండి: సెంచ‌రీతో ఫామ్‌లోకి ఆసీస్ బ్యాట‌ర్‌.. సౌతాఫ్రికాకు చుక్క‌లే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement