'సచిన్‌ కూడా అప్పట్లో నీలాగే అవుటయ్యాడు.. కానీ’ | Sunil Gavaskar suggests special advice for Virat Kohli | Sakshi
Sakshi News home page

IND vs AUS: సచిన్‌ కూడా అప్పట్లో నీలాగే అవుటయ్యాడు.. కానీ’

Published Mon, Dec 16 2024 3:57 PM | Last Updated on Mon, Dec 16 2024 5:15 PM

Sunil Gavaskar suggests special advice for Virat Kohli

గబ్బా వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి తీవ్ర నిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో కీలక సమయంలో బ్యాటింగ్ వచ్చిన కోహ్లి.. కేవలం 3 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. క్రీజులోకి వచ్చినప్పటి నుంచే ఆసీస్ బౌలర్లను ఎదుర్కొనేందుకు కోహ్లి ఇబ్బంది పడ్డాడు. ఆఖరికి జోష్ హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి కోహ్లి వెనుదిరిగాడు.

ఆస్ట్రేలియా గడ్డపై అద్బుతమైన రికార్డు ఉన్న కోహ్లి ఈసారి మాత్రం తన మార్క్‌ను చూపించలేకపోతున్నాడు. ఫాస్ట్ బౌలర్లు కోహ్లిని ఈజీగా ట్రాప్ చేసి  పెవిలియన్‌కు పంపుతున్నారు. ఔట్‌సైడ్ ఆఫ్ స్టంప్ దిశ‌గా వెళ్లే బంతిని వెంటాడే క్ర‌మంలో విరాట్ త‌న వికెట్‌ను కోల్పోతున్నాడు. కాగా ఇప్పటివరకు ఈ సిరీస్‌లో 5 ఇన్నింగ్స్‌లు ఆడిన కోహ్లి.. మొత్తం అన్ని సార్లు వికెట్ కీపర్ లేదా స్లిప్ ఫీల్డర్ల చేతికే చిక్కాడు.

ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లికి భారతక్రికెట్‌ దిగ్గజం సునీల్ గవాస్కర్ కీలక సూచన చేశాడు. 2004 ఆసీస్ ప‌ర్య‌ట‌న‌లో మాస్ట‌ర్ బ్లాస‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ ఏమి చేశాడో, ఇప్పుడు విరాట్ కోహ్లి కూడా అలానే చేయాల‌ని గవాస్కర్ స‌ల‌హా ఇచ్చాడు.

"స‌చిన్ టెండూల్క‌ర్‌ను విరాట్ కోహ్లి ఉదాహరణగా తీసుకోవాలి. 2004 ఆసీస్ ప‌ర్య‌ట‌న‌లో సచిన్ కూడా ఇదే సమస్యలను ఎదుర్కొన్నాడు. మొదటి మూడు టెస్ట్ మ్యాచ్‌లలో అతడు ఆఫ్-స్టంప్ వెలుపల వెళ్లే బంతులను ఆడి తన వికెట్‌ను కోల్పోయాడు. 

మొత్తం ఆరు ఇన్నింగ్స్‌లలోనూ స్లిప్స్‌ లేదా  షార్ట్ గల్లీ వద్ద ఫీల్డర్లకు చిక్కాడు. కానీ సిడ్నీ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో మాత్రం సచిన్ ఆ తప్పు చేయలేదు. కవర్స్ దిశగా ఎటువంటి షాట్‌లు ఆడకూడదని నిర్ణయించుకున్నాడు. 

స్ట్రైట్ డ్రైవ్స్‌, మిడ్ ఆఫ్ దిశగానే షాట్లు ఆడాడు. అతడు తనకు ఇష్టమైన కవర్ డ్రైవ్ షాట్ కూడా ఆడలేదు. ఆఫ్-స్టంప్ వెలుపల బంతులను టచ్ చేయకూడదని సంకల్పంగా పెట్టుకున్నాడు. తన స్కోర్ 200 పరుగులు దాటాక సచిన్ కవర్స్ వైపు షాట్ ఆడాడు. 

ఇప్పుడు కోహ్లి కూడా సచిన్‌నే ఫాలో అవ్వాలి. ఆఫ్-స్టంప్ వెలుపుల బంతులను ఆడే సమంయలో మన మనస్సు నియంత్రణలో" ఉంచుకోవాలి అని ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గవాస్కర్ పేర్కొన్నాడు.
చదవండి: IND vs AUS: జస్ప్రీత్‌ బుమ్రా వరల్డ్‌ రి​కార్డు.. 147 ఏళ్ల టెస్టు క్రికెట్‌ హిస్టరీలోనే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement