టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఫామ్‌లేమితో సతమతమవుతున్నాడు. స్వదేశంలో బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లలో ఈ కుడిచేతి వాటం బ్యాటర్ స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. ముఖ్యంగా స్పిన్నర్లను ఎదుర్కోవడంలో తడబడి వికెట్ పారేసుకున్నాడు.
ఈ నేపథ్యంలో కోహ్లి బ్యాటింగ్ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా కివీస్ చేతిలో టీమిండియా 3-0తో వైట్‌వాష్ కావడంతో భారత మాజీ క్రికెటర్లు సైతం కోహ్లిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరికొంత మంది మాత్రం.. ‘‘ఫామ్ తాత్కాలికం.. క్లాస్ శాశ్వతం’’ అని ఈ రన్‌మెషీన్‌కు అండగా నిలిచారు.
రెండు భారీ రికార్డులపై కన్నేసిన కోహ్లి..
ఈ క్రమంలో ఆస్ట్రేలియా పర్యటన రూపంలో కోహ్లి వరుస వైఫల్యాలకు చెక్ పెడుతూ.. తనను తాను మరోసారి నిరూపించుకునే సమయం వచ్చింది. మామూలుగానే కంగారూలతో టెస్టుల్లో చెలరేగి ఆడే ఈ ఢిల్లీ బ్యాటర్.. ఇలాంటి కఠిన పరిస్థితుల్లో మరింత గొప్పగా రాణిస్తాడని ఇటు టీమిండియా, అటు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు అంచనా వేస్తున్నారు.
ఒకవేళ ఇక్కడా విఫలమైతే.. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(బీజీటీ) కోసం ఆస్ట్రేలియా పర్యటనకు రావడం ఇదే చివరిసారి అవుతుందని కూడా జోస్యం చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. కోహ్లి గనుక మునుపటి ఫామ్ అందుకుంటే ఆస్ట్రేలియా గడ్డపై రెండు అరుదైన భారీ రికార్డులు సొంతం చేసుకునే అవకాశం ఉంది.
మరో 458 పరుగులు చేస్తే!
బీజీటీ 2024-25లో భాగంగా ఆసీస్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో కోహ్లి గనుక 458 పరుగులు సాధిస్తే.. సచిన్ టెండుల్కర్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలవుతుంది. కంగారూ గడ్డపై సచిన్ 20 టెస్టులు ఆడి 53.20 సగటుతో.. 1809 పరుగులు సాధించాడు. తద్వారా ఆస్ట్రేలియాలో టెస్టుల్లో అత్యధిక రన్స్ చేసిన భారత బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు.
మరోవైపు కోహ్లి.. ఆస్ట్రేలియాలో ఇప్పటి వరకు ఆడిన 13 టెస్టుల్లో 54.08 సగటుతో 458 పరుగులు సాధించాడు. కాబట్టి ఈసారి ఇంకో 458 పరుగులు చేశాడంటే.. సచిన్ టెండ్కులర్‌ను అధిగమిస్తాడు.
ఇక ఆస్ట్రేలియా గడ్డపై సచిన్ టెండుల్కర్, కోహ్లి ఆరేసి శతకాలు చేసి.. ఈ ఘనత సాధించిన టీమిండియా బ్యాటర్ల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ఈసారి కోహ్లి ఒక్క సెంచరీ చేస్తే.. సచిన్‌ను వెనక్కి నెట్టి భారత్ తరఫున ఆస్ట్రేలియాలో అత్యధిక శతకాలధీరుడిగా అవతరిస్తాడు.
కాగా.. నవంబరు 22 నుంచి పెర్త్ వేదికగా ఆస్ట్రేలియా- టీమిండియా మధ్య మొదటి టెస్టు ఆరంభం కానుంది. జనవరి 3-7 వరకు జరుగనున్న ఐదో టెస్టుతో టీమిండియా ఆసీస్ టూర్ ముగుస్తుంది. ఇదిలా ఉంటే.. కోహ్లి ఇటీవల స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు టెస్టుల్లో రాబట్టిన పరుగులు 0, 70, 1, 17, 4, 1.
చదవండి: ఇషాన్ కిషన్‌కు కళ్లు చెదిరే ధర.. రూ. 14.5 కోట్లకు ఆ జట్టు సొంతం!
Comments
Please login to add a commentAdd a comment