విన్‌రైజర్స్‌... | Sunrisers Hyderabad beat Royal Challengers Bangalore by six wickets | Sakshi
Sakshi News home page

విన్‌రైజర్స్‌...

Published Sat, Nov 7 2020 5:13 AM | Last Updated on Sat, Nov 7 2020 7:59 AM

Sunrisers Hyderabad beat Royal Challengers Bangalore by six wickets - Sakshi

విన్నింగ్‌ షాట్‌ అనంతరం విలియమ్సన్‌తో హోల్డర్‌ సంబరం

ఐపీఎల్‌–2020లో సన్‌రైజర్స్‌ మరో అడ్డంకిని విజయవంతంగా అధిగమించింది. ఓడితే టోర్నీ నుంచి నిష్క్రమించే అవకాశం ఉన్న ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో చక్కటి ప్రదర్శనతో విజయాన్ని అందుకొని ముందంజ వేసింది. ఫైనల్లో చోటు కోసం రెండో క్వాలిఫయర్‌ ఆడే అర్హత సాధించింది. లీగ్‌ చివరి దశలో వరుసగా మూడు విజయాలు సాధించి జోరు ప్రదర్శించిన హైదరాబాద్‌ దానిని కొనసాగిస్తూ సత్తా చాటింది. ముందుగా అద్భుతమైన బౌలింగ్‌తో రాయల్‌ చాలెంజర్స్‌ కట్టడి చేసిన జట్టు తర్వాత లక్ష్యాన్ని ఛేదించడంలో సఫలమైంది.

కొంత తడబడినా... అనుభవజ్ఞులైన విలియమ్సన్, హోల్డర్‌ కలిసి ఎలాంటి ప్రమాదం లేకుండా హైదరాబాద్‌కు గట్టిక్కించారు. మరోవైపు ఐపీఎల్‌ మొదలైన నాటినుంచి ‘ఈ సాలా కప్‌ నామ్‌దే...’ అంటూ చకోర పక్షుల్లా బెంగళూరు విజయంపై అభిమానులు పెట్టుకుంటున్న ఆశలు మరోసారి ఆవిరయ్యాయి. ప్రతీ ఏడాది టైటిల్‌ గెలుస్తామనే నమ్మకం ప్రదర్శిస్తూ వచ్చిన కోహ్లి కల మళ్లీ భగ్నమైంది. వరుసగా ఐదో పరాజయంతో ఆ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది.

అబుదాబి: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ క్వాలిఫయర్‌–2కు అర్హత పొందింది. ముందుకు వెళ్లాలంటే కచ్చితంగా గెలవాల్సిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ 6 వికెట్ల తేడాతో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుపై ఘన విజయం సాధించింది. టాస్‌ గెలిచిన వార్నర్‌ ఫీల్డింగ్‌ ఎంచుకోగా... ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. ఏబీ డివిలియర్స్‌ (43 బంతుల్లో 56; 5 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించాడు. ఫించ్‌ (30 బంతుల్లో 32; 3 ఫోర్లు, 1 సిక్స్‌) ఫర్వాలేదనిపించాడు. హోల్డర్‌కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం హైదరాబాద్‌ 19.4 ఓవర్లలో 4 వికెట్లకు 132 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ కేన్‌ విలియమ్సన్‌ (44 బంతుల్లో 50 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), జేసన్‌ హోల్డర్‌ (20 బంతుల్లో 24 నాటౌట్‌; 3 ఫోర్లు) కలిసి జట్టును విజయతీరం చేర్చారు. వీరిద్దరు ఐదో వికెట్‌కు అభేద్యంగా 47 బంతుల్లో 65 పరుగులు జోడించడం విశేషం. ఆదివారం జరిగే రెండో క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో హైదరాబాద్‌ తలపడుతుంది.  

ఒకే ఒక్కడు...
బెంగళూరు ఇన్నింగ్స్‌లో మొత్తం 10 ఫోర్లు, 1 సిక్స్‌ మాత్రమే ఉండటం చూస్తే జట్టు బ్యాటింగ్‌ ఎలా సాగిందో అర్థమవుతుంది. పేలవ స్ట్రయిక్‌రేట్‌తో ఫించ్‌ పరుగులు చేయగా... డివిలియర్స్‌ మినహా అంతా విఫలమయ్యారు. ఓపెనర్‌గా వచ్చిన కోహ్లి (6) మరోసారి తక్కువ స్కోరుకే వెనుదిరగ్గా, దేవ్‌దత్‌ పడిక్కల్‌ (1) కూడా విఫలమయ్యాడు. ఈ దశలో కొద్దిసేపు ఫించ్, డివిలియర్స్‌ కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే రైజర్స్‌ కట్టుదిట్టమైన బౌలింగ్‌ కారణంగా వేగంగా పరుగులు చేయలేకపోయారు. నదీమ్‌ బౌలింగ్‌లో ఫించ్‌ అవుట్‌ కావడంతో ఈ భాగస్వామ్యానికి తెర పడింది.

అదే ఓవర్లో ‘ఫ్రీ హిట్‌’ షాట్‌ ఆడి సింగిల్‌ కోసం ప్రయత్నించిన మొయిన్‌ అలీ (0) రనౌటయ్యాడు. మరోవైపు డివిలియర్స్‌ మాత్రం కొన్ని చక్కటి షాట్లతో స్కోరును నడిపించాడు. అయితే అతను కూడా తనదైన శైలిలో విధ్వంసక ఇన్నింగ్స్‌ ఆడలేకపోవడం హైదరాబాద్‌ బౌలింగ్‌ పదునును చూపిస్తోంది. 39 బంతుల్లో అతని అర్ధ సెంచరీ పూర్తి కాగా... శివమ్‌ దూబే (8), సుందర్‌ (5) కూడా తొందరగా డగౌట్‌ చేరారు. ఇన్నింగ్స్‌లో మరో 14 బంతులు మిగిలి ఉండగా... డివిలియర్స్‌ చెలరేగితే భారీ స్కోరుకు అవకాశం కనిపించింది. అయితే నటరాజన్‌ వేసిన అద్భుత యార్కర్‌ డివిలియర్స్‌ మిడిల్‌ స్టంప్‌ను గిరాటేయడంతో బెంగళూరు సాధారణ స్కోరుకు పరిమితమైంది.  

ఉత్కంఠను అధిగమించి...
గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరమైన సాహా స్థానంలో జట్టులోకి వచ్చిన శ్రీవత్స్‌ గోస్వామి (0)తో కలిసి డేవిడ్‌ వార్నర్‌ (17) ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. అయితే తొలి ఓవర్లోనే రైజర్స్‌ మొదటి వికెట్‌ కోల్పోయింది. మనీశ్‌ పాండే (21 బంతుల్లో 24; 3 ఫోర్లు, 1 సిక్స్‌), వార్నర్‌ కలిసి జాగ్రత్తగా ఆడుతున్న దశలో అంపైర్‌ వివాదస్పద నిర్ణయంతో వార్నర్‌ వెనుదిరిగాడు. సిరాజ్‌ బౌలింగ్‌లో కీపర్‌ క్యాచ్‌ పట్టగా, అంపైర్‌ తిరస్కరించాడు. అయితే ఆర్‌సీబీ రివ్యూ కోరింది. సుదీర్ఘ సమయం పాటు పలు రీప్లేల తర్వాత వార్నర్‌ను మూడో అంపైర్‌ అవుట్‌గా ప్రకటించాడు. వీడియోలో బంతి వార్నర్‌ బ్యాట్‌కు లేదా గ్లవ్‌కు తగిలినట్లుగా ఎక్కడా స్పష్టంగా కనిపించలే?దు.

ఆ తర్వాత తక్కువ వ్యవధిలో పాండే, గార్గ్‌ (7) కూడా అవుట్‌ కావడంతో రైజర్స్‌ ఛేదనపై సందేహాలు రేగాయి. బెంగళూరు బౌలర్లు కూడా ఎలాంటి భారీ షాట్లకు అవకాశం ఇవ్వలేదు. అయితే ఇద్దరు అంతర్జాతీయ జట్ల కెప్టెన్లు కలిసి చక్కటి సమన్వయంతో, పరిస్థితికి తగినట్లుగా ఆడుతూ ముందుకు వెళ్లారు. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఆర్‌సీబీ బౌలర్లు ఒత్తిడి పెంచే ప్రయత్నం చేసినా... విలియమ్సన్, హోల్డర్‌ ఎక్కడా అత్యుత్సాహం ప్రదర్శించలేదు. సైనీ వేసిన చివరి ఓవర్లో విజయానికి 9 పరుగులు అవసరం కాగా... తొలి బంతికే విలియమ్సన్‌ అర్ధ సెంచరీ (39 బంతుల్లో) పూర్తయింది. రెండో బంతిపై పరుగు తీయని హోల్డర్‌ మూడో, నాలుగో బంతులను బౌండరీ దాటించి హైదరాబాద్‌కు విజయం ఖాయం చేశాడు.
 

బ్యాటింగ్‌లో తగినన్ని పరుగులు చేయలేకపోవడమే ఓటమికి కారణం. బౌలింగ్‌ చేస్తున్నప్పుడు మాత్రం ఒక దశలో మ్యాచ్‌ను శాసించే స్థితిలో నిలవగలిగాం. మా ప్రణాళికలు సరిగ్గా పని చేశాయి. సీజన్‌లో భారీ స్కోర్లు చేయలేకపోవడానికి బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి కారణం కావచ్చు. ఎలా ఆడినా ఫీల్డర్ల చేతుల్లోకే బంతులు వెళ్లాయి. బౌలర్లు మాత్రం స్వేచ్ఛగా బౌలింగ్‌ చేశారు. సీజన్‌లో దేవ్‌దత్, సిరాజ్‌ బాగా ఆడటం చెప్పుకోదగ్గ విషయం.  ఏబీ, చహల్‌ ఎప్పటిలాగే తమ సత్తా చాటారు. ఈ ఏడాది మాకు కఠినంగా గడిచింది. మిగిలిన జట్లు ఎంత బలంగా ఉన్నాయో తెలిసింది. పైగా సొంత మైదానాల అనుకూలత లేకపోవడం వల్ల అన్ని జట్లకు సమానావకాశాలు కనిపించాయి. అలా చూస్తే అత్యంత హోరాహోరీగా సాగిన లీగ్‌ ఇది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మేమందరం మైదానంలోకి దిగి ఆడగలగడమే సంతోషించాల్సిన విషయం. అభిమానులకు ఇలాంటి వినోదం అందించినందుకు గర్వపడుతున్నాం. 
–కోహ్లి, బెంగళూరు జట్టు కెప్టెన్‌

► ఈ ఐపీఎల్‌లో వార్నర్‌ టాస్‌ గెలిచిన మ్యాచ్‌ల సంఖ్య. ఎనిమిది జట్లు పాల్గొన్న ఐపీఎల్‌ టోర్నీలలో గతంలో రోహిత్‌ (ముంబై–2017), ధోని (చెనై–2016) మాత్రమే ఈ ఘనత సాధించారు. ఆ రెండు సార్లూ రోహిత్, ధోని జట్లు ఐపీఎల్‌ ట్రోఫీని నెగ్గాయి.  

► ఈ ఐపీఎల్‌ టోర్నీలో సన్‌రైజర్స్‌ గెలిచిన మొత్తం 8 మ్యాచ్‌ల్లో 8 వేర్వేరు ఆటగాళ్లకు (రషీద్‌ ఖాన్, ప్రియమ్‌ గార్గ్, బెయిర్‌స్టో, మనీశ్‌ పాండే, సాహా, సందీప్‌ శర్మ, నదీమ్, విలియమ్సన్‌) ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డులు రావడం విశేషం.

స్కోరు వివరాలు
రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఇన్నింగ్స్‌: కోహ్లి (సి) గోస్వామి (బి) హోల్డర్‌ 6; దేవ్‌దత్‌ (సి) గార్గ్‌ (బి) హోల్డర్‌ 1; ఫించ్‌ (సి) సమద్‌ (బి) నదీమ్‌ 32; డివిలియర్స్‌ (బి) నటరాజన్‌ 56; మొయిన్‌ అలీ (రనౌట్‌) 0; దూబే (సి) వార్నర్‌ (బి) హోల్డర్‌ 8; సుందర్‌ (సి) సమద్‌ (బి) నటరాజన్‌ 5; సైనీ (నాటౌట్‌) 9; సిరాజ్‌ (నాటౌట్‌) 10; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 131.
వికెట్ల పతనం: 1–7; 2–15; 3–56; 4–62; 5–99; 6–111; 7–113.  
బౌలింగ్‌: సందీప్‌ శర్మ 4–0–21–0; హోల్డర్‌ 4–0–25–3; నటరాజన్‌ 4–0–33–2; నదీమ్‌ 4–0–30–1; రషీద్‌ ఖాన్‌ 4–0–22–0.

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: వార్నర్‌ (సి) డివిలియర్స్‌ (బి) సిరాజ్‌ 17; గోస్వామి (సి) డివిలియర్స్‌ (బి) సిరాజ్‌ 0; పాండే (సి) డివిలియర్స్‌ (బి) జంపా 24; విలియమ్సన్‌ (నాటౌట్‌) 50; గార్గ్‌ (సి) జంపా (బి) చహల్‌ 7; హోల్డర్‌ (నాటౌట్‌) 24; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (19.4 ఓవర్లలో 4 వికెట్లకు) 132.  
వికెట్ల పతనం: 1–2; 2–43; 3–55; 4–67. బౌలింగ్‌: సిరాజ్‌ 4–0–28–2; సైనీ 3.4–0–31–0; సుందర్‌ 2–0–21–0; జంపా 4–0–12–1; చహల్‌ 4–0–24–1; మొయిన్‌ అలీ 1–0–4–0; దూబే 1–0–7–0.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement