IPL 2021 SRH vs DC: మరో గెలుపే లక్ష్యంగా... | Sunrisers Hyderabad vs Delhi Capitals Match Today | Sakshi
Sakshi News home page

IPL 2021 SRH vs DC: మరో గెలుపే లక్ష్యంగా...

Published Sun, Apr 25 2021 5:32 AM | Last Updated on Sun, Apr 25 2021 12:00 PM

Sunrisers Hyderabad vs Delhi Capitals Match Today - Sakshi

చెన్నై: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 14వ సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మరో పోరుకు సిద్ధమైంది. మూడు వరుస పరాజయాల అనంతరం పంజాబ్‌ కింగ్స్‌పై గెలుపొందిన హైదరాబాద్‌... నేడు ఇక్కడి చెపాక్‌ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగే మ్యాచ్‌లో మరో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో బంతితో, బ్యాట్‌తో మెరిసి తొలి విజయాన్ని అందుకున్న వార్నర్‌ బృందం ఆత్మ విశ్వాసంతో ఉంది. మరోవైపు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో ఒకదాంట్లో మాత్రమే ఓడి మూడింటిలో గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్‌ సన్‌రైజర్స్‌కు చెక్‌ పెట్టేందుకు రెడీగా ఉంది.

మరోసారి స్పిన్నర్లే కీలకం
ఈ ఏడాది ఐపీఎల్‌లో చెన్నై ఆతిథ్యమివ్వనున్న చివరి మ్యాచ్‌ ఇదే. ఇప్పటి వరకు ఇక్కడ 9 మ్యాచ్‌లు జరగ్గా... కేవలం మూడు మ్యాచ్‌ల్లో మాత్రమే ఇరు జట్లు కూడా 150కిపైగా స్కోర్లను నమోదు చేశాయి. అంటే ఇక్కడి పిచ్‌ ఎంత మందకొడిగా ఉందో అర్థమవుతోంది. దాంతో హైదరాబాద్, ఢిల్లీ మ్యాచ్‌లో కూడా మరోసారి బౌలర్లే కీలకం కానున్నారు. అయితే బౌలర్ల గాయాలు హైదరాబాద్‌ను కలవరపెడుతున్నాయి. ఇప్పటికే మోకాలి గాయంతో నటరాజన్‌ ఐపీఎల్‌ నుంచి తప్పుకోగా... తొడ కండరాలు పట్టేయడంతో పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌ మధ్యలోనే పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ మైదానం వీడాడు. ఆ మ్యాచ్‌లో అతడు తన పూర్తి కోటా ఓవర్లను వేయలేదు. దాంతో భువనేశ్వర్‌ ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగేది అనుమానమే.

హైదరాబాద్‌కు నమ్మకమైన బౌలర్‌గా పేరు తెచ్చుకున్న రషీద్‌ ఖాన్‌ ఈ సీజన్‌లో కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో పేసర్‌ ఖలీల్‌ అహ్మద్, ఆల్‌రౌండర్‌ అభిషేక్‌ శర్మలు బౌలింగ్‌లో సత్తా చాటారు. కేన్‌ విలియమ్సన్‌ జట్టులోకి రావడంతో హైదరాబాద్‌ బ్యాటింగ్‌ లైనప్‌ పటిష్టంగా కనపడుతోంది. ముఖ్యంగా బెయిర్‌స్టో సూపర్‌ ఫామ్‌లో ఉండగా... వార్నర్‌ కూడా పరుగులు సాధిస్తున్నాడు. ఢిల్లీ జట్టులో శిఖర్‌ ధావన్‌ మ్యాచ్‌ విన్నింగ్‌ ఇన్నింగ్స్‌ ఆడుతున్నాడు.

అయితే మరో ఓపెనర్‌ పృథ్వీ షా ఫామ్‌ జట్టును కలవరపెడుతోంది. అతడు గాడిన పడాల్సి ఉంది. రిషభ్‌ పంత్, స్టీవ్‌ స్మిత్, హెట్‌మైర్, స్టొయినిస్‌లతో ఢిల్లీ బ్యాటింగ్‌ బలంగా కనిపిస్తోంది. బౌలింగ్‌లో అమిత్‌ మిశ్రా, రవిచంద్రన్‌ అశ్విన్, అవేశ్‌ ఖాన్‌లు ప్రత్యర్థిని కట్టడి చేసేందుకు రెడీగా ఉన్నారు. ముఖాముఖి పోరులో హైదరాబాద్‌ ముందంజలో ఉంది. ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు 18 మ్యాచ్‌లు జరగ్గా... హైదరాబాద్‌ 11 మ్యాచ్‌లలో విజయం సాధించింది. ఢిల్లీ ఏడింటిలో గెలిచింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement