కొన్నేళ్లుగా తమను ఊరిస్తోన్న ఐపీఎల్ టైటిల్ వేటను గత ఏడాది రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్ ఘనంగా ప్రారంభించింది. మూడుసార్లు చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ ఏడు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. లక్ష్యం భారీగా ఉన్నా ఆరంభం నుంచే శిఖర్ ధావన్, పృథ్వీ షా ఎదురుదాడి చేయడంతో తుదకు ఢిల్లీకి విజయం సునాయాసంగానే దక్కింది. పునరాగమనంలో సురేశ్ రైనా దూకుడు కనబర్చినా... బౌలింగ్, పేలవ ఫీల్డింగ్‌తో చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్‌ను ఓటమితో మొదలుపెట్టింది.
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తాజా సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ)కు అదిరే ఆరంభం లభించింది. శనివారం జరిగిన తమ తొలి మ్యాచ్‌లో ఢిల్లీ ఏడు వికెట్లతో మాజీ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే)పై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 188 పరుగులు చేసింది. సురేశ్ రైనా (36 బంతుల్లో 54; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించగా... మొయిన్ అలీ (24 బంతుల్లో 36; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), స్యామ్ కరన్ (15 బంతుల్లో 34; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. వోక్స్, అవేశ్ ఖాన్ చెరో రెండు వికెట్లు సాధించారు. అనంతరం ఢిల్లీ 18.4 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి 190 పరుగులు చేసి గెలుపొందింది. ఓపెనర్లు శిఖర్ ధావన్ (54 బంతుల్లో 85; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు), పృథ్వీ షా (38 బంతుల్లో 72; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఈ మ్యాచ్‌తో ఐపీఎల్‌లో ఢిల్లీ జట్టు (డేర్‌డెవిల్స్, క్యాపిటల్స్) తరఫున 100వ మ్యాచ్ ఆడిన తొలి ప్లేయర్‌గా అమిత్ మిశ్రా నిలిచాడు.
ఆడుతూ పాడుతూ...
ఛేదనను ఢిల్లీ క్యాపిటల్స్ ఆడుతూ పాడుతూ ఆరంభించింది. భారీ లక్ష్యం కళ్లముందున్నా ఎక్కడా తొందరపాటుకు గురికాని ఓపెనర్లు ధావన్, పృథ్వీ షా స్కోరు బోర్డును పరుగెత్తించారు. స్యామ్ కరన్ వేసిన నాలుగో ఓవర్‌లో ధావన్ సిక్స్, ఫోర్ కొట్టగా... పృథ్వీ షా మరో ఫోర్ సాధించడంతో 17 పరుగులు లభించాయి. ఐదో ఓవర్‌లో మరింత రెచ్చిపోయిన పృథ్వీ హ్యాట్రిక్ ఫోర్లు కొట్టడంతో ఆ ఓవర్లో కూడా 17 పరుగులు వచ్చాయి. దాంతో ఢిల్లీ పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా 65 పరుగులు చేసింది. పృథ్వీ షా (38, 47 పరుగుల వద్ద్ద) ఇచ్చిన రెండు క్యాచ్‌లను సాన్‌ట్నెర్, రుతురాజ్ జారవిడిచారు. దాంతో 27 బంతుల్లో పృథ్వీ అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా... రెండు బంతుల అనంతరం ధావన్ కూడా 35 బంతుల్లో ఆ మైలురాయిని అందుకున్నాడు.
ఈ క్రమంలో ఢిల్లీ 10.1 ఓవర్లలో 100 పరుగుల మార్కును అందుకుంది. ఆ తర్వాత మరింత దూకుడును కనబర్చిన ధావన్–పృథ్వీ జంట ఏ బౌలర్‌నూ వదల్లేదు. శార్దుల్ ఠాకూర్, బ్రావో, మొయిన్ అలీ ఇలా ఎవరు బౌలింగ్‌కు దిగినా వారికి ఫోర్ లేదా సిక్స్‌తో స్వాగతం లభించింది. అయితే 14వ ఓవర్‌లో సీఎస్‌కేకు తొలి వికెట్ లభించింది. ఆ ఓవర్‌లో బ్రావో వేసిన మూడో బంతిని బ్యాలెన్స్ తప్పి పృథ్వీ షాట్ ఆడగా... స్వీపర్ కవర్ దగ్గర అలీ క్యాచ్ అందుకోవడంతో 138 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యం ముగిసింది. మరికాసేపటికే సెంచరీ చేసేలా కనిపించిన ధావన్‌ను శార్దుల్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. అప్పటికే ఢిల్లీ విజయానికి చేరువ కాగా... మిగిలిన పనిని పంత్ (15 నాటౌట్; 2 ఫోర్లు), స్టొయినిస్ ( 14; 3 ఫోర్లు) పూర్తి చేశారు.
రైనా జోరు...
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్‌కు శుభారంభం లభించలేదు. పేలవ ఫామ్‌లో ఉన్న డు ప్లెసిస్ (0) డకౌట్‌గా వెనుదిరగ్గా... ఫోర్ కొట్టి టచ్‌లో కనిపించిన రుతురాజ్ గైక్వాడ్ (5)ను వోక్స్ పెవిలియన్‌కు చేర్చడంతో సీఎస్‌కే 7 పరుగులకే రెండు వికెట్లను కోల్పోయింది. ఈ దశలో సురేశ్ రైనా, మొయిన్ అలీ ఇన్నింగ్స్‌ను నిర్మించే బాధ్యతను తమ భుజాలపై వేసుకున్నారు. మూడో ఓవర్ చివరి బంతికి ఫోర్ కొట్టిన రైనా తన పరుగుల వేటను ఆరంభించాడు.
అవేశ్ ఖాన్ వేసిన ఆ మరుసటి ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన అలీ... తన ఇన్నింగ్స్‌ను కూడా ధాటిగా ఆరంభించాడు. ఇక్కడి నుంచి వీరిద్దరూ ఓవర్‌కు రెండు బౌండరీల చొప్పును రాబడుతూ ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టారు. అశ్విన్ వేసిన 9వ ఓవర్ తొలి రెండు బంతులను బౌలర్ మీదుగా రెండు సిక్స్‌లు కొట్టిన అలీ... ప్రమాదకారిగా కనిపించాడు. అయితే ఆ మరుసటి బంతిని రివర్స్ స్వీప్ ఆడబోయిన అలీ షార్ట్ థర్డ్ మ్యాన్ దగ్గర ఉన్న ధావన్ చేతికి చిక్కాడు. దాంతో అలీ, రైనా 53 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. అలీ పెవిలియన్ చేరాక గేర్ మార్చిన రైనా ధనాధన్ ఇన్నింగ్స్‌ను షురూ చేశాడు. మూడు ఓవర్ల వ్యవధిలో నాలుగు సిక్స్‌లు బాది 32 బంతుల్లోనే హాఫ్ సెంచరీని సాధించాడు.
మరో ఎండ్‌లో అంబటి రాయుడు (23; 1 ఫోరు, 2 సిక్స్‌లు) అతడికి చక్కటి సహకారం అందించడంతో చెన్నై స్కోరు 100 పరుగులు దాటింది. వీరు నాలుగో వికెట్‌కు 63 పరుగులు జోడించారు. రాయుడు అవుటైన కాసేపటికే జడేజా (26 నాటౌట్; 3 ఫోర్లు)తో సమన్వయ లోపంతో రైనా రనౌట్ అయ్యాడు. అనంతరం వచ్చిన ధోని (0) నిరాశ పరిచాడు. చివర్లో స్యామ్ కరన్, జడేజా దూకుడుగా ఆడటంతో సీఎస్‌కే చివరి ఐదు ఓవర్లో 52 పరుగులు చేయగలిగింది. ఇంగ్లండ్‌కు చెందిన ‘కరన్ బ్రదర్స్’ స్యామ్, టామ్ ఈ మ్యాచ్‌లో ఎదురెదురుగా ఆడారు. స్యామ్ చెన్నై తరఫున, టామ్ ఢిల్లీ తరఫున బరిలోకి దిగారు. చెన్నై ఇన్నింగ్స్‌లో టామ్ బౌలింగ్‌లో స్యామ్ 9 బంతులు ఎదుర్కొన్నాడు.
స్కోరు వివరాలు
చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: రుతురాజ్ గైక్వాడ్ (సి) ధావన్ (బి) వోక్స్ 5; డు ప్లెసిస్ (ఎల్బీ) అవేశ్ ఖాన్ 0; మొయిన్ అలీ (సి) ధావన్ (బి) అశ్విన్ 36; రైనా (రనౌట్) 54; రాయుడు (సి) ధావన్ (బి) టామ్ కరన్ 23; జడేజా (నాటౌట్) 26; ధోని (బి) అవేశ్ ఖాన్ 0; స్యామ్ కరన్ (బి) వోక్స్ 34; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 188.
వికెట్ల పతనం: 1–7, 2–7, 3–60, 4–123, 5–137, 6–137, 7–188.
బౌలింగ్: వోక్స్ 3–0–18–2; అవేశ్ ఖాన్ 4–0–23–2; అశ్విన్ 4–0–47–1; టామ్ కరన్ 4–0– 40–1; మిశ్రా 3–0–27–0; స్టొయినిస్ 2–0–26–0.
ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: పృథ్వీ షా (సి) మొయిన్ అలీ (బి) బ్రావో 72; ధావన్ (ఎల్బీ) (బి) శార్దుల్ 85; పంత్ (నాటౌట్) 15; స్టొయినిస్ (సి) స్యామ్ కరన్ (బి) శార్దుల్ 14; హెట్‌మైర్ (నాటౌట్) 0, ఎక్స్‌ట్రాలు 4, మొత్తం (18.4 ఓవర్లలో 3 వికెట్లకు) 190.
వికెట్ల పతనం: 1–138, 2–167, 3–186.
బౌలింగ్: దీపక్ చహర్ 4–0–36–0; స్యామ్ కరన్ 2–0–24–0; శార్దుల్ 3.4–0–53–2; జడేజా 2–0–16–0; అలీ 3–0–33–0; బ్రావో 4–0–28–1.
ఐపీఎల్‌లో నేడు
సన్‌రైజర్స్ హైదరాబాద్ X కోల్‌కతా నైట్‌రైడర్స్
వేదిక: చెన్నై, రాత్రి గం. 7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం
Comments
Please login to add a commentAdd a comment