టీ20 వరల్డ్‌కప్-2022 సెమీఫైనల్లో టీమిండియా ఘోర ఓటమి నేపథ్యంలో జట్టులో సమూల మార్పులు చేయాలని భారీ స్థాయిలో డిమాండ్లు వినిపిస్తున్న విషయం తెలిసిందే. మాజీ, విశ్లేషకులు ఇందుకనుగుణంగా తగు సూచనలు కూడా చేస్తున్నారు. టీమిండియా మాజీ కెప్టెన్, కోచ్ అనిల్ కుంబ్లే.. 3 ఫార్మాట్లకు 3 వేర్వేరు జట్లు, ముగ్గురు వేర్వేరు కెప్టెన్లు, ముగ్గురు వేర్వేరు కోచ్‌లు ఉండాలని సలహా ఇవ్వగా.. చాలామంది ఫ్యాన్స్ ఈ ప్రతిపాదనకు పూర్తిగా మద్దతు పలుకుతున్నారు.
ఈ నేపథ్యంలో పొట్టి ఫార్మాట్‌లో టీమిండియాకు కొత్త కెప్టెన్, కొత్త కోచ్ అనే అంశంపై గత కొద్దిరోజులుగా సోషల్‌మీడియాలో భారీ ఎత్తున డిస్కషన్ నడుస్తూ ఉంది. కెప్టెన్, కోచ్ పోజిషన్ల కోసం ఎవరికి తోచిన ప్రతిపాదనలు వారు చేస్తున్నారు. కొందరు రోహిత్‌నే కంటిన్యూ చేయాలంటుంటే, మరికొందరు హార్ధిక్ పాండ్యాకు టీ20 పగ్గాలు అప్పగిస్తే బెటరని అభిప్రాయపడుతున్నారు.
తాజాగా ఈ విషయంపై క్రికెట్‌కు సంబంధించిన ఓ వ్యక్తే సరికొత్త ప్రతిపాదనతో ముందుకొచ్చాడు. భారత టీ20 జట్టుకు కెప్టెన్ అయ్యే అన్ని అర్హతలు ఓ ఆటగాడికి ఉన్నాయని స్టేట్‌మెంట్ ఇచ్చాడు. ఇంతకీ టీమిండియా టీ20 జట్టు కెప్టెన్సీ రేసులోకి కొత్తగా వచ్చిన ఆటగాడెవరు.. అతని పేరు ప్రతిపాదించిన వ్యక్తి ఎవరు..?
వివరాల్లోకి వెళితే.. వినాయక్ మానే అనే ముంబై మాజీ క్రికెటర్ టీమిండియా టీ20 కెప్టెన్సీ రేసులోకి ఎవరూ ఊహించని విధంగా మిస్టర్ 360 డిగ్రీస్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ పేరును తీసుకువచ్చాడు. గతంలో స్థానిక క్లబ్ క్రికెట్ ఆడే సమయంలో సూర్యకుమార్ ఆడిన జట్టుకు కెప్టెన్‌గా, ఆ సమయంలో స్కైకు పర్సనల్ కోచ్‌గా వ్యవహరించిన మానే.. సూర్యకుమార్ భారత టీ20 జట్టు పగ్గాలు చేపట్టేందుకు అన్ని విధాల అర్హుడని ప్రముఖ స్పోర్ట్స్ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ సందర్భంగా తన మనసలో మాట బయటపెట్టాడు.
సూర్యకుమార్‌ను చిన్నతనం చూస్తున్నాను.. అతనికి బ్యాటింగ్ లైనప్‌ను లీడ్ చేయగలిగిన సామర్ధ్యంతో పాటు క్లిష్ట సమయాల్లో జట్టు సారధ్య బాధ్యతలు భుజాన ఎత్తుకునే మనోస్థైర్యం, చాణక్యం కూడా ఉన్నాయని ఆకాశానికెత్తాడు. అతనితో కలిసి ఆడిన అనుభవంతో ఈ విషయాన్ని చెబుతున్నా.. టీమిండియా నాయకత్వ మార్పును కోరుకుంటే, సూర్యకుమార్ పేరును తప్పక పరిశీలనలోకి తీసుకుంటుందని ఆశిస్తున్నా అని అన్నాడు.
మానే ఇచ్చిన ఈ స్టేట్‌మెంట్‌తో టీమిండియా టీ20 కెప్టెన్సీ రేసులోకి మరో కొత్త పేరు వచ్చి చేరిందని అభిమానులు డిస్కస్ చేసుకుంటున్నారు. వాస్తవానికి సూర్యకుమార్‌కు గతంలో కెప్టెన్సీ చేసిన అనుభవం ఉంది. 2014-15 రంజీ సీజన్‌లో అతను ముంబై జట్టు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే బ్యాటింగ్‌పై దృష్టి సారించలేకపోతున్నాన్న కారణంతో అదే సీజన్ మధ్యలోనే కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత 2019-20 సీజన్‌లో ముంబై రంజీ టీమ్ కెప్టెన్‌గా మళ్లీ ఎంపికయ్యాడు. 2020-21 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో జట్టును విజయవంతంగా ముందుండి నడిపించాడు.
చదవండి: Team India: 3 ఫార్మాట్లకు 3 వేర్వేరు జట్లు, కెప్టెన్లు, కోచ్‌లు..!
Comments
Please login to add a commentAdd a comment